Gold Price Today : వరసగా షాకిస్తున్న బంగారం ధరలు.. ఇక కొనడం కష్టమే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగదల కనిపించింది
బంగారం ధరలు మొన్నటి వరకూ తగ్గి కొంత ఊరించాయి. దీంతో బంగారం, వెండి కొనుగోళ్లు కూడా పెరిగాయి. అయితే నాలుగు రోజుల నుంచి వరసగా బంగారం ధరలు పెరుగుతూ పోతుండటం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇలా పెరుగుతూ పోతే బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి ఎంత వరకూ వెళుతుందన్నది కూడా అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే లక్ష రూపాయలు కిలో వెండి దాటేసింది. ఎనభై వేల రూపాయలకు చేరువలో పది గ్రాముల బంగారం ధర ఉంది. మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెప్పడంతో ఇక బంగారాన్ని కొనుగోలు చేయడం కష్టమేనన్న ఆలోచనలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఉండిపోయారు.
కొనుగోళ్లు తగ్గడంతో...
ఇప్పటికే ధరలు అమాంతం పెరగడంతో బంగారం కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. ఇటు అవసరం నిమిత్తం కొనుగోలు చేసేవారితో పాటు పెట్టుబడి కోసం చూసే వారు కూడా కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. ఇంత ధర పోసి కొనుగోలు చేయడం అవసరమా? అన్న ఆలోచన వారిలో బయలుదేరింది. దీంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు సయితం ఆందోళన చెందుతున్నారు. షోరూంల నిర్వహణ ఖర్చులు కూడా రావడం కష్టంగా మారిందని కార్పొరేట్ వ్యాపార సంస్థలు వాపోతున్నాయి. అందుకే ప్రకటనల ఖర్చు కూడా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
స్వల్పంగా పెరిగి...
వీలయినంత నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటే కొంతలో కొంత మేలని కార్పొరేట్ సంస్థలు భావిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక స్కీమ్ లు రాయితీలు ప్రకటించినా కొనుగోళ్లు మాత్రం పెరగడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,460 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,960 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,00,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.