రైలు ప్రయాణంలో ఈ తప్పు చేస్తున్నారా? జరిమానా, శిక్ష

ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసే ఉంటారు. తక్కువ ఛార్జీలు ఉండటం కారణంగా సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు.

Update: 2023-11-04 03:42 GMT

ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసే ఉంటారు. తక్కువ ఛార్జీలు ఉండటం కారణంగా సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఇక రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవడం చాలా ముఖ్యం. రైల్వే నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులు ఏదైనా పొరపాటు చేస్తే శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంటుందని గుర్తించుకోవాలి. ముఖ్యంగా రైలులో చైన్‌ లాగడం. దీని గురించి అందరికి తెలిసే ఉంటుంది. కానీ కొందరు అనవసరంగా రైలులో చైన్‌ లాగినట్లయితే అందుకు శిక్షను, జరిమానాను అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రైల్లో ప్రయాణించేటప్పుడు అనువుగా ఉంది కదా అని మీ బ్యాగులు, ఇతర లగేజీని ఎక్కడపడితే అక్కడ తగిలిస్తే కూడా తప్పే అవుతుంది. ఇకపై అలా చేస్తే మీకు ఫైన్‌ తప్పదు. జరిమాననే కాకుండా శిక్ష కూడా పడవచ్చు. ఈ మేరకు అధికారులు నవంబరు 2వ తేదీన ఓ ప్రకటన చేశారు.

రైలును అత్యవసరంగా ఆపాల్సి వచ్చినప్పుడు ఉపయోగించే చైన్‌ గురించి తరచూ రైల్లో ప్రయాణించేవారికి.. తెలిసే ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, లేదా అత్యవసర పరిస్థితుల్లో రైలును ఆపేందుకు ప్రతి బోగీలోనూ ఒక చైన్‌ తో ప్రత్యేక ఏర్పాటును చేస్తుంది రైల్వే. దీనిని లాగినప్పుడు ఆటోమేటిక్‌గా రైలుకు బ్రేకులు పడి ఆగిపోతుంటుంది. అయితే ఇప్పుడు ఈ చైన్‌ పద్ధతిని మార్చి, దాని స్థానంలో పాసింజర్స్‌ ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్‌ డివైజ్‌ అమర్చారు. ఇది ఎరుపురంగులో ఉంటుంది. అంతేకాదు అది హ్యాండిల్‌ను పోలి ఉంటుంది. దీంతో ప్రయాణికులు దానికి బ్యాగులు, సెల్‌ఫోన్లు లాంటివి తగిలిస్తున్నారు. దీనివల్ల ఆ పరికరం ఆటోమేటిక్‌గా లాక్‌ అయ్యి రైలు నిలిచిపోతుంది.

ఇది చట్టరిత్యా నేరమని, ఇలాంటి నేరానికి పాల్పడితే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా పడుతుందని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. ఈ తరహా ఘటనలు అక్టోబరు వరకూ డివిజన్‌ వ్యాప్తంగా 2,159 జరిగినట్టు రైల్వే అధికారుల నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రయాణికులు సరైన కారణం లేకుండా అలారం చైన్‌ ఉపయోగించడం తీవ్రమైన నేరమని, రైల్వే చట్టం 141 సెక్షన్‌ ప్రకారం 1000 రూపాయిలు జరిమానా, లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సో.. ఇలాంటి విషయాల్లో రైలు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాము. ప్రయాణం చేసేటప్పుడు మీ లగేజీని ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా జాగ్రత్తగా ఉండండి. తెలియకుండా చైన్‌కు బ్యాగులు తగిలించినట్లయితే రైలు ఆగిపోయే అవకాశం ఉంది. దీని వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News