రథయాత్రలో విషాదం.. ఏడుగురు మృతి, 18 మందికి గాయాలు
రథాన్ని ఊరేగింపుగా తీసుకొస్తున్న క్రమంలో 133 కేవీ ఓవర్ హెడ్ కేబుళ్లు రథానికి తగలడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు..
త్రిపురలో జరుగుతున్న రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఉనకోటి జిల్లా చౌముహని ప్రాంతంలో రథయాత్ర జరుగుతుండగా.. ఒక్కసారిగా హై టెన్షన్ కరెంట్ వైర్లు భక్తులకు తగిలడంతో.. షాక్ తో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 18 మంది గాయపడ్డారు. రథాన్ని పూర్తిగా ఇనుముతో తయారు చేయడంతో పదుల సంఖ్యలో భక్తులకు షాక్ తగిలినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను కుమార్ ఘాట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి ఉనకోటి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
రథాన్ని ఊరేగింపుగా తీసుకొస్తున్న క్రమంలో 133 కేవీ ఓవర్ హెడ్ కేబుళ్లు రథానికి తగలడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. వార్షిక రథయాత్ర తర్వాత.. జగన్నాథుడి తిరుగు ప్రయాణానికి సంబంధించి ఉల్టో రథ్ ఊరేగింపులో ఈ సంఘటన జరిగింది. రథయాత్రలో మరణించిన మృతుల కుటుంబాలకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా సంతాపం తెలిపారు.