పోలీసు వాహనం వస్తుండడం చూసి వేగంగా కారు నడిపారు.. తీరా చూస్తే
పోలీసులను చూసి అతివేగంతో కారు నడిపారు.
పత్రాలు లేకుండా రూ.85 లక్షలు అక్రమంగా తరలిస్తున్న గ్యాంగును పోలీసులు పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో నగదును పోలీసులు సీజ్ చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా హానగల్‌లో చోటుచేసుకుంది. అక్రమంగా డబ్బు రవాణా చేస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి అతివేగంతో కారు నడిపారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంబడించి ఆ కారును ఆపారు.
ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపూర్ తాలూకా నిజ్జూర్ గ్రామానికి చెందిన ఫయాజా ఖాన్ (31), ఇమ్రాన్ ఖాన్ (27), షిమోగా జిల్లా సాగర్‌కు చెందిన సద్దన్ ఖాన్ (23), సయ్యకు చెందిన అమీన్ (29)లను పోలీసులు అరెస్టు చేశారు. హుబ్లీ నుంచి షిమోగా జిల్లా సాగర్ వైపు అక్రమంగా డబ్బును తరలిస్తూ ఉన్నారని పోలీసులు తెలిపారు. 500, 200, 100, 50 రూపాయల నోట్లతో నిండిన బ్యాగును పోలీసులు కారులో గుర్తించారు. మొత్తం విలువ రూ.85 లక్షలు అని తేలింది. ఆ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డబ్బు తరలిస్తున్న నిందితులను పట్టుకునేందుకు హానగల్ సీపీఐ శివశంకర్ గణాచారి, పీఎస్‌ఐ శ్రీశైల పట్టన శెట్టి ఆధ్వర్యంలో బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఎస్పీ హనుమంతరాయ ఇచ్చిన సమాచారం మేరకు ఆపరేషన్ నిర్వహించారు.