కాల్ సెంటర్‌లో దారుణం.. 8 మంది హత్య
మెక్సికో దేశంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్న 8 మంది యువతీ, యువకులు అతి కిరాతకంగా చంపబడ్డారు.
మెక్సికో దేశంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్న 8 మంది యువతీ, యువకులు అతి కిరాతకంగా చంపబడ్డారు. బాధతులు ఉద్యోగం మానేయడానికి సిద్ధం కావడమే కారణంగానే ఈ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. అమెరికన్లను టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న గువాడలజరా సమీపంలో జలిసో న్యూ జనరేషన్ కార్టెల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను మెక్సికో, అమెరికా అధికారులు కూడా ధ్రువీకరించారు. జలిసో.. మెక్సికోలోనే అత్యంత హింసాత్మక ముఠా. ఈ ముఠా దగ్గర పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు.
గత నెలలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళల జాడ కనిపించలేదు. యువతీ, యువకులంతా 30 ఏళ్ల లోపు వారే. తప్పిపోయిన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు శరీర భాగాలతో కూడిన ప్లాస్టిక్ కవర్లు ఆ ప్రాంతంలో వెలుగు చూశాయి. వాటికి ఫోరెన్సిక్ పరీక్షలు చేయగా.. ఆ శరీర భాగాలు కాల్‌సెంటర్‌లో తప్పిపోయిన వారివేనని తెలిసింది. అయితే వీరిని జలిసో గ్యాంగే చంపినట్లు పోలీసు దర్యాప్తు తేలింది. హత్యలకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ యువతీ, యువకులు ఉద్యోగం మానేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో ఈ దారుణాలకు తెగబడినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.