Snakes: కొన్ని గంటల్లో పెళ్లి.. పాము తెచ్చిన విషాదం
కొన్ని గంటల్లో పెళ్లి ఉండగా పాము కాటు వేయడంతో
కొన్ని గంటల్లో పెళ్లి ఉండగా పాము కాటు వేయడంతో పెళ్లికొడుకు ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ పెళ్లి పందిరిలో రోదనలు మిన్నంటాయి. బులంద్‌షహర్‌లోని దిబాయి ప్రాంతంలోని అకర్‌బాస్ గ్రామంలో పాము కాటుకు 26 ఏళ్ల వరుడు మరణించాడు. వరుడు ప్రవేశ్ కుమార్ పొరుగు గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వెళుతుండగా కాలకృత్యాల కోసం ఓ పొద దగ్గరికి వెళ్లాడు.
ఎంత సేపు అయినా అతను తిరిగి రాకపోవడంతో, ఒక కుటుంబ సభ్యుడు వెళ్లి చూశాడు. అప్పటికే అతను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికంగా ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అతను చనిపోయినట్లు ప్రకటించాడని వరుడి సోదరి పూనమ్ చెప్పారు. ఈ విషయం తెలిసి పెళ్లికి వచ్చిన వారంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. పాము కాటుకు గురైనప్పుడు ప్రజలు భయపడవద్దని, రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని దిబాయిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి)లోని ఒక సీనియర్ వైద్యుడు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ-వెనమ్ వ్యాక్సిన్, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయని.. వర్షాకాలంలో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. బులంద్‌షహర్ జిల్లాలో గత రెండు నెలల్లో పాము కాటుతో ఏడుగురు చనిపోయారు.