పెళ్లై నెల కూడా కాలేదు.. భర్త మరణం
22 ఏళ్ల అఖిలేశ్ బహదూర్‌పుర్ బ్లాక్‌లోని మనియారి గ్రామానికి చెందిన వ్యక్తి. చెన్నైలో జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించేవాడు.;
ఒడిశా రైలు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులకు బిడ్డలను దూరం చేసింది.. పిల్లలకు తల్లిదండ్రులను లేకుండా చేసింది.. తోబుట్టువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. జంటల జీవితంలో ఊహించని విషాదాన్ని తీసుకుని వచ్చింది. ఎన్నో విషాదాలు ఈ ప్రమాదం చుట్టూ ఉన్నాయి. బిహార్‌కు చెందిన రూప అనే మహిళ జీవితాన్ని ఈ ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. ఈ దుర్ఘటనలో ఆమె తన భర్త అఖిలేశ్ కుమార్ యాదవ్‌ను కోల్పోయింది. 22 ఏళ్ల అఖిలేశ్ బహదూర్‌పుర్ బ్లాక్‌లోని మనియారి గ్రామానికి చెందిన వ్యక్తి. చెన్నైలో జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించేవాడు. మే 7న రూపతో అఖిలేశ్ వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం చెన్నై వెళుతూ ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన అనంతరం అధికారులు ఆధార్ కార్డ్ ద్వారా అఖిలేశ్‌ను గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తీసుకువెళ్లాల్సిందిగా వారికి సూచించారు. అఖిలేశ్ మరణ వార్త విన్న అతని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భర్త మరణంతో రూప గుండెలు పగిలేలా రోదిస్తోంది.