గూగుల్ మ్యాప్స్ ను నమ్మి కారు నడిపారు.. చివరికి
గూగుల్ మ్యాప్స్‌లోని సూచనలను అనుసరించి కారు నడిపిన కారణంగా ఇద్దరి ప్రాణాలు పోయాయి
గూగుల్ మ్యాప్స్‌లోని సూచనలను అనుసరించి కారు నడిపిన కారణంగా ఇద్దరి ప్రాణాలు పోయాయి. కారుతో సహా నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు కారు మరణించారు. వర్షాకాలంలో గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించే విషయమై జాగ్రత్తగా ఉండాలని కేరళ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. త్రిసూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అద్వైత్ (29), అజ్మల్ (29) ఆదివారం తెల్లవారుజామున గూగుల్ మ్యాప్స్‌లో సూచనలను అనుసరిస్తూ గోతురుత్ వద్ద పెరియార్ నదిలోకి కారును పోనిచ్చారు. ఈ ప్రమాదంలో వారు ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు గాయాలపాలై సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. గూగుల్ మ్యాప్స్ అందించిన సూచనలను అనుసరించి డ్రైవర్ ఆ ప్రాంతానికి చేరుకున్నారని పోలీసుల విచారణలో తేలింది.
కేరళ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే టైంలో అయిదుగురితో వెళ్తున్న ఓ కారు కొచ్చి నుండి వెళ్తోంది. కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళుతుండగా.. కారు పెరియార్ నది వద్దకు రాగానే వారికి రోడ్డు కనిపించలేదు. అయినా కూడా రోడ్డును డ్రైవర్ ఫాలో అవ్వడంతో వాహనం పెరియార్ నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన అద్వైత్, అజ్మల్ లు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులుగా పని చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ పక్కదోవ పట్టించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని గూగుల్ మ్యాప్ సూచించడంతో కారు అటుగా వెళ్లి నీట మునిగిందని పోలీసులు తెలిపారు.