సినిమాలు చూసి హీరోలను అభిమానించడం.. ఆ ఇష్టం మరీ ఎక్కువైతే వారిని కలిసి ఓ ఆటోగ్రాఫ్.. మరీ పిచ్చ అభిమానమైతే ఓ సెల్ఫీ వరకూ ఓకే.. కానీ.. సినిమాలో హీరో మర్డర్లు చేసి ఎదిగాడని వరుసగా హత్యలు చేస్తే.? అలా ఊహించడమే కష్టం కదా!! కానీ సరిగ్గా అదే జరిగింది. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలన్న కోరికతో వరుస హత్యలు చేశాడో టీనేజర్. తాను కూడా గ్యాంగ్ స్టర్ అవ్వాలంటూ మనుషులను చంపుకుంటూ వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. రోజుకో హత్యతో పోలీసులను సైతం పరుగులు పెట్టించాడు. విషయం సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ సైకో కిల్లర్‌ను అరెస్టు చేయడంతో అతను చెప్పిన సమాధానం విని దిమ్మతిరిగిపోయింది. కేజీఎఫ్‌లో రాకీభాయ్ అవ్వాలనుకుంటున్నానని.. తర్వాత టార్గెట్ పోలీసులే అని చెప్పడంతో కంగుతిన్నారు. మధ్యప్రదేశ్‌లో సంచలనం రేపిన వరుస హత్యల కేసు వివరాలు..
ఇటీవల సాగర్ జిల్లాలో వరుస హత్యలు చోటుచేసుకున్నాయి. కేవలం ఐదు రోజుల్లో నాలుగు హత్యలు జరగడంతో తీవ్ర భయాందోళనలు రేగాయి. సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడంటూ అలజడి రేగింది. రాత్రివేళ.. అది కూడా నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే టార్గెట్‌గా చేసుకుని దుండగుడు హత్యలకు పాల్పడుతున్నాడు. వరుస హత్యలతో జనం బెంబేలెత్తిపోవడంతో మధ్యప్రదేశ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అందుకోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి గాలించడం మొదలుపెట్టారు. ఇటీవల సాగర్‌లో హత్యాయత్నానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన బాధితుడు ఇచ్చిన సమాచారంతో అతని ఊహాచిత్రాన్ని తీసి అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. అతన్ని అరెస్టు చేసేందుకు అవసరమైన సమాచారం అందిస్తే నగదు బహుమతి కూడా అందిస్తామని ప్రకటించారు.
సీరియల్ కిల్లర్‌ను శివప్రసాద్ ధుర్వేగా గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు భోపాల్ బస్టాండ్ ప్రాంతంలో అతన్ని చుట్టుముట్టారు. కేవలం 19 ఏళ్ల యువకుడు ధుర్వే. ప్రత్యేకమైన చాంబర్‌లో ఉంచి విచారణ జరుపుతున్నారు. పోలీసు విచారణలో అతను చెప్పిన సమాధానాలు విని పోలీసులే షాకయ్యారు. తాను కేజీఎఫ్ సినిమాలో రాకీభాయ్‌లా గ్యాంగ్ స్టర్ అవ్వాలనుకుంటున్నానని.. అందుకే హత్యలు చేశానని చెప్పడంతో ఖాకీలకే దిమ్మతిరిగిపోయింది. ఆ తర్వాత భయపెట్టి డబ్బులు కూడా సంపాదించాలనుకుంటున్నానని.. తన తర్వాత టార్గెట్ పోలీస్ శాఖేనని చెప్పడంతో అవాక్కయ్యారట.కేవలం త్వరగా ఫేమస్ అవ్వడం కోసమే తాను హత్యలు చేశానని.. అరెస్టు చేసే ముందు కూడా భోపాల్‌లో ఒకరిని హతమార్చినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. సాగర్‌లోని కేస్లీ ప్రాంతానికి చెందిన ధుర్వే గతంలో కొద్దిరోజులు గోవాలో పనిచేశాడని తెలుస్తోంది. పూణెలో ఒక హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సీరియల్ కిల్లర్‌ను ఎట్టకేలకు అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించడంతో సాగర్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అతన్ని క్షుణ్ణంగా విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.