Praveen Pagadala: ప్రవీణ్ పగడాల మృతి కేసులో వీడుతున్న చిక్కుముడులు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి;

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపడుతున్నారు. ప్రవీణ్ పగడాల కేసులో దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత మృతికి సంబంధించిన గల కారణాలపై అంచనాకు పోలీసు అధికారులు వచ్చినట్లు తెలిసింది. అయితే మరొకసారి దీనికి సంబంధించి ఆధారాలను పకడ్బందీగా సేకరించి మీడియాకు రివీల్ చేయాలని నిర్ణయానికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు.
అనుమానాస్పద కేసుగా...
ప్రస్తుతానికి ప్రవీణ్ పగడాల మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుంది. పోస్టు మార్టం నివేదికతో పాటు సీసీటీవీ ఫుటేజీలకు సంబంధించిన ఆధారాలతో కేసును క్లోజ్ చేయాలన్న ఆలోచనతో పోలీసు ఉన్నతాధికారులున్నారు. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా, ఆరోపణలకు దారికల్పించకుండా ప్రతిదీ స్పష్టమైన ఆధారాలతో రెండు, మూడు రోజుల్లో మీడియాకు ప్రవీణ్ పగడాల మృతి కేసుపై పోలీసు అధికారులు బ్రీఫ్ చేసే అవకాశముంది.
హత్యా? రోడ్డు ప్రమాదమా?...
అయితే ఇది హత్యా? రోడ్డు ప్రమాదమా? అన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే పోలీసులు విచారణ జరుపుతున్నారు. హర్షకుమార్ కు నోటీసులు ఇచ్చి వారి దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని కోరారు. అయితే ఇప్పటి వరకూ హర్షకుమార్ ఎలాంటి ఆధారలు ఇవ్వలేదని పోలీసు అధకారులు చెబుతున్నారు. మృతిపై పాస్టర్లు చేసిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుని వారికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ లభించిన ఆధారాల మేరకు రోడ్డు ప్రమాదంగానే భావిస్తున్నారు. మరి పోలీసులు ఈ కేసులో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.