పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో.. 200 సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు?
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మిస్టరీ వీడలేదు;

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మిస్టరీ వీడలేదు. ప్రమాదం జరిగిందా? లేక హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తన బుల్లెట్ బైక్ పై బయలుదేరారు. అయితే విజయవాడలో మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న దానిపై మాత్రం క్లారిటీ వచ్చింది. పాస్టర్ ప్రవీణ్ మూడు గంటల పాటు ఒక పార్కులో విశ్రాంతి తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ లో బయలుదేరి విజయవాడకు చేరుకున్న పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో మూడు గంటల పాటు ఒక పార్కులో విశ్రాంతి తీసుకుంటున్నట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు.
బుల్లెట్ పై బయలుదేరిన ప్రవీణ్...
పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ లో బుల్లెట్ పై బయలుదేరడం, ఎండకు తీవ్రంగా అలసట చెందడంతో తన బుల్లెట్ ను ముందుగా రామవరప్పాడు రింగ్ రోడ్డుకు యాభైమీటర్లు ముందుగా నేషనల్ హైవేపై ఆపి కూర్చున్న ఫొటో బయటపడింది. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడకు చేరుకున్న పాస్టర్ ప్రవీణ్ రాత్రి 8.45 గంటలకు ఎనికేపాడు దాటినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. అయితే ఈ మూడు గంటలు పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలిశారన్న దానిపై పోలీసులు లోతుగా విచారించారు. విజయవాడలోని అన్ని సీసీటీవీలను పరిశీలించారు. అయితే పాస్టర్ ప్రవీణ్ ఎక్కడకు వెళ్లలేదని 200 కెమెరాలను పరిశీలించిన తర్వాత గాని పోలీసులకు అర్థం కాలేదు.
మూడు గంటలు పార్కులోనే...
అలసిపోయిన పాస్టర్ ప్రవీణ్ ను జాతీయ రహదారిపై కూర్చుండటాన్ని గుర్తించిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగేందుకు నీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టినట్లు గమనించారు. అక్కడ మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకుని తర్వాత రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు. అక్కడ మృతి చెందారు. అయితే విజయవాడకు రాకముందే పాస్టర్ ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ వాహనం ప్రమాదానికి గురయిందని అక్కడి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గమనించినట్లు పోలీసులు తెలిపారు. హెల్మెట్ కూడా దెబ్బతినడంతో ఎక్కడైనా ప్రమాదం జరిగిందా? అని ఆరా తీశారు. దీంతో పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో ఎవరినీ కలవలేదని పోలీసుల విచారణలో వెల్లడయింది.