పెళ్లైన నెలన్నరకే.. నవవధువు అనుమానాస్ప మృతి
పెళ్లి సమయంలో వధువు తరపువారు వరుడికి భారీగా కట్నకానుకలు అందజేశారు. ఎలాంటి లోటు లేకుండా..
పెళ్లంటే.. ఎన్నో ఆశలు, మరెన్నో కలలు, అంతకు మించిన బాధ్యతలతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు ఆడపిల్లలు. పెళ్లైన తర్వాత గానీ కట్టుకున్న భర్త నిజస్వరూపమేంటో తెలియట్లేదు. అత్తింటి వరకట్న దాహానికి, భర్త అనుమానపు భూతానికి బలైన వివాహితలెందరో ఉన్నారు. తాజాగా మరో నవవధువు అత్తింటి వేధింపులకు బలైంతి. పెళ్లై నిండా రెండు నెల్లైనా కాకుండానే కన్నుమూసిందో యువతి. ఈ ఘటన కర్ణాటకలోని ధర్వాడ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక ధర్వాడ జిల్లా అనేరికి గ్రామానికి చెందిన షహబాద్ ములగంజ (26)కు గదగ్ జిల్లా గజేంద్రడకు చెందిన షహనాజ్ బేగం (24)తో నెలన్నర క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో వధువు తరపువారు వరుడికి భారీగా కట్నకానుకలు అందజేశారు. ఎలాంటి లోటు లేకుండా సకల లాంఛనాలతో కూతుర్ని అత్తారింటికి సాగనంపారు. వివాహం తర్వాత ములగంజ, షహనాజ్ బేగం దంపతుల కాపురం కొన్ని రోజుల పాటు సజావుగానే సాగింది. క్రమక్రమంగా ములగంజ అసలు స్వరూపం బయటపడింది. అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ములగంజ తల్లిదండ్రులు కూడా కొడుకుకి సపోర్ట్ చేస్తూ.. కోడల్ని చిత్రహింసలకు గురిచేశారు.
ఎన్నో ఆశలు, కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి కన్నీళ్లే మిగిలాయి. రంజాన్ పండగ వేళ అందరూ హడావిడిగా ఉన్న సమయంలో షహనాజ్ బేగం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని భర్త ములగంజ భార్య షహనాజ్ బేగం తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. హుటాహుటిన కూతురి అత్తింటికి చేరుకున్న తల్లిదండ్రులు షహనాజ్ మృతదేహాన్ని చూసి ఘోల్లుమని ఏడ్చారు. అదనపు కట్నం పేరుతో తమ కూతురిని హింసించి, హత్య చేశారంటూ మృతురాలి భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.