వీధికుక్క దాడిలో పసి కందు మృతి
కూలీల పిల్లలు ఆ చుట్టుపక్కలే ఆడుకుంటుండగా.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వీధి కుక్కల గుంపు ఒకటి ఆ కాంపౌండ్ లోకి..
వీధికుక్క దాడిలో పసికందు మరణించిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. సోమవారం అపార్ట్ మెంట్ సెల్లార్లో ఆడుకుంటున్న బాబుపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆ పిల్లాడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశాడు. బాబు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 100 లోని బోలీవార్డ్ అపార్ట్ మెంట్ నిర్మాణంలో ఉంది. సోమవారం ఎప్పట్లాగే కూలీలు తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
కూలీల పిల్లలు ఆ చుట్టుపక్కలే ఆడుకుంటుండగా.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వీధి కుక్కల గుంపు ఒకటి ఆ కాంపౌండ్ లోకి చొరబడ్డాయి. సెల్లార్లో ఆడుకుంటున్న పిల్లలపై దాడి చేశాయి. కుక్కలను చూసిన పిల్లలంతా పారిపోగా.. ఏడాది వయసున్న బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు అప్రమత్తమై.. బాబును దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాబును కాపాడేందుకు ప్రయత్నించినా, తీవ్ర గాయాలు కావడంతో ఫలితం లేకుండా పోయిందని వైద్యులు చెప్పారు. కాగా.. సెక్టార్ 100 లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని పట్టుకుని అక్కడి నుంచి తరలించాలని మున్సిపాలిటీ సిబ్బందికి సూచించినట్లు పోలీసులు తెలిపారు.