50,000 రూపాయల రివార్డు ఉన్న నేరస్థుడిని పట్టుకోవడానికి ఉత్తరాఖండ్‌కు వెళ్లిన ఉత్తర ప్రదేశ్ పోలీసులపై స్థానికులు ఎగబడ్డారు. దీంతో ఆ సమయంలో ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో బీజేపీ నేత భార్య మరణించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్ పోలీసుల ఆపరేషన్ గురించి స్థానిక పోలీసులకు ఏమీ తెలియదు. దాడి సమయంలో, పోలీసులు, బీజేపీ నాయకుడైన గుర్తజ్ భుల్లర్ కుటుంబానికి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులను చుట్టుముట్టడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
ఇరువర్గాల మధ్య కాల్పులు జరగడంతో భుల్లర్ భార్య గుర్‌ప్రీత్ కౌర్ ఎదురుకాల్పుల్లో గాయపడ్డారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు నలుగురిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. కౌర్ మృతికి నిరసనగా ఆగ్రహించిన స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. "గుర్తేజ్ భుల్లర్ బీజేపీ నాయకుడు. UP పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇక్కడకు వచ్చారు. వారు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. మేము హత్యతో సహా ఇండియన్ పీనల్ కోడ్‌లోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసాము" అని కుమావోన్ రేంజ్ డీఐజీ నీలేష్ తెలిపారు. ఉత్తరాఖండ్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆ సమయంలో తమ సిబ్బందిపై కాల్పులు జరిపారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని యూపీ పోలీసులు పేర్కొన్నారు.