దారుణం.. మహిళను పీక్కుతిన్న వీధికుక్కలు, మహిళ మృతి
మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లా కన్హివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంద్రాయి గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళ శనివారం..
దేశంలో వీధికుక్కల దాడిలో మృతి చెందిన వారు అనేకం. వీధికుక్కల కారణంగా చాలా కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు వీధికుక్కలను నిర్మూలించడంలో పూర్తి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఎక్కడైనా వీధికుక్కల దాడి జరిగితే నష్టపరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళలు వీధికుక్కలు పీక్కుతిన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లా కన్హివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంద్రాయి గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళ శనివారం ఉదయం 7 గంటల సమయంలో పొలానికి వెళ్లింది. అదే సమయంలో ఓ చెట్టువద్దనున్న వీధికుక్కల గుంపు ఆ మహిళను చుట్టుముట్టి.. మూకుమ్మడిగా దాడిచేసి, పీక్కుతిన్నాయి. వీధికుక్కల దాడిలో మహిళ అక్కడికక్కడే మరణించింది. ఇంతలో అటువైపుగా వెళ్తున్న కొందరు గ్రామస్తులు వీధికుక్కల దాడిని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వీధికుక్కలను రాళ్లతో కొట్టి చెదరగొట్టారు.
ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడి కారణంగానే మహిళ మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కుక్కల దాడి వల్ల మృతురాలి శరీరానికి లోతైన గాయాలు అయ్యాయని, అందుకే మహిళ మరణించినట్లు వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. కాగా.. మహిళ మాంసాన్ని తిన్న తీరు చూస్తుంటే అడవి జంతువుల దాడిగా కనిపించడం లేదని, ఘటనా స్థలానికి 5 కిలోమీటర్ల పరిధిలో అడవి లేదని తెలిపారు.