ప్రకృతి పిలిచే పూల పండగ బతుకమ్మ
దసరా పండగ పర్వదినాల్లో జరుపుకునే మరొక ప్రకృతి పండగ బతుకమ్మ
దసరా పండగ పర్వదినాల్లో జరుపుకునే మరొక ప్రకృతి పండగ బతుకమ్మ. తీరొక్క పూలతో తీర్చిదిద్ది మహిళల ఆటపాటలతో ఈ తొమ్మిది రోజులు తెలంగాణ అంతటా వేడుకగా కొనసాగనుంది. ఆటపాటలతో పాటు కోలాటాలను కూడా నిర్వహిస్తారు. మహిళలు ఈ బతుకమ్మను ఆడతారు. అత్యంత భక్తి శ్రద్థలతో జరుపుకునే ఈ ప్రకృతి పండగకు అనేక పూల వాసనలు గుభాళిస్తాయి. మట్టివాసనలు మైమరిపిస్తాయి. పల్లె నుంచి పట్నం దాకా బతుకమ్మ వేడుకలతో నవరాత్రుల సమయంలో హోరెత్తిపోతుంది. ఇది దసరాకు తెలంగాణ మహిళలు జరుపుకునే అతి పెద్ద సంబురం.
పూలన్నింటినీ...
అనేక రకాల పూలను ఒక చోట చేర్చి వాటిని అలంకరిస్తారు. పల్లెల్లో చెరువుగట్టుకు వెళ్లి మహిళందరూ ఒకచోట చేరి బతుకమ్మ ఆడతారు. తంగేడు పూల అంచుతో,గునుగుపూల కొంగు,కట్ల పూల చెంగుతో చీర కట్టిన గౌరమ్మను ఊరిగింపుగా చెరువు గట్టుకు తీసుకెళతారు. కొందరు తమ ఇంటి ముందు బతుకమ్మ ఆడి ఆ తర్వాత చెరువు దగ్గరకు తీసుకెళ్లి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది. మంచి వాసనలు గుప్పుమనే ఈ పండుగ కోసం తెలంగాణ మహిళలంతా ఎదురు చూస్తుంటారు.
చెరువుకు వెళ్లి...
దీనిని ప్రకృతి పండగా భావించి మహిళలు జరుపుకుంటారు. పంటలు సమృద్ధిగా పండాలని, ఇళ్లన్నీ ధాన్యరాశులతో కళకళలాడాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆ బతుకమ్మను వేడుకుంటారు. వరసగా ఎంగిలిపువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా అనేక రోజులు పూలపండగను నిర్వహిస్తారు. బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ బొడ్డెమ్మ చుట్టూ నృత్యాలు చేస్తారు. బతుకమ్మ పాటలు తెలంగాణ మాత్రమే కాదు ప్రపంచమంతా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రోజుకో నైవేద్యం...
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఈ బతుకమ్మ పండగ ప్రతీక. కొన్ని శతాబ్దాలుగా జరుపుకుంటున్న ఈ పండగను తెలంగాణలోని ప్రతి మహిళ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో నైవేద్యం తయారు చేసి దానిని అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మ పండగను తెలంగాణ ప్రభుత్వం అధికారిక పండగగా గుర్తించింది. ఇందుకోసం ప్రతి ఏడాది కోట్ల రూపాయలను కేటాయిస్తుంది. మరోమారు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పాటలు మారుమోగనున్నాయి. వీటిని చూసి తీరాల్సిందే.