దసరాకు ఆ సరదాయే వేరు
దసరా అంటే తెలంగాణకు పెద్ద పండగ. దేవీ నవరాత్రులు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది
దసరా అంటే తెలంగాణకు పెద్ద పండగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకూ దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. పదో రోజు దసరా పండగా. ఈ ఏడాది అక్టోబరు 24వ తేదీన దసరా పండగ జరుపుకుంటున్నారు. అక్టోబరు 22వ తేదీన దుర్గాష్టమిగా పండితులు నిర్ణయించారు. అనేక సంప్రదాయాలు, సంస్కృతులతో మేళవించిన పండగ కావడంతో దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు అత్యంత ఇష్టమైన పండగ.
తమ గ్రామానికి వెళ్లి...
ప్రభుత్వం కూడా పాఠశాలలకు, కళాశాలలకు ఎక్కువ రోజులు సెలవులు ప్రకటించే పండగ ఇది. ప్రతి ఒక్కరూ దసరా పండగకు తమ గ్రామానికి చేరుకుని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కుటుంబ సభ్యులందరూ కలసి చేసుకునే పండగగా దీనిని భావిస్తారు. తొమ్మిది రోజులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి తమకు ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని వేడుకుంటారు. వరసగా రోజుకో అవతారంతో అమ్మవారిని పూజించడం మన సంస్కృతిలో భాగంగా మారింది.
నవరాత్రులను...
దసరా నవరాత్రుల సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. ప్రతి వీధిలో దుర్గమ్మ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తారు. వినాయకుడి తరహాలోనే వీధి వీధినా దుర్గమ్మ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని నవరాత్రులను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అన్ని దుర్గామాత ఆలయాల్లోనూ నవరాత్రులు జరుపుతారు. రోజుకొక అలంకారంతో అమ్మవారిని పూజిస్తూ తమ కుటుంబాన్ని కాపాడమంటూ వేడుకుంటారు. ఈ తొమ్మిదిరోజులు ఉపవాసాలు ఉండి అత్యంత భక్తి శ్రద్థలతో ఈ పండగను జరపుకుంటుంటారు.
ప్రత్యేక సర్వీసులు...
అటువంటి దసరా పండగను చూడాలంటే తెలంగాణలోనే చూడాలి. ఈ ప్రాంతంలోనే అత్యధికంగా ఇష్టపడి జరుపుకునే పండగ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ పండగ కోసం ఏర్పాట్లు చేస్తుంది. ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. పెద్ద పండగ కావడంతో బంగారం, వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకూ అతి పెద్ద వేడుకగా దసరాను నిర్వహించుకుంటారు.