రెండోరోజు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. నేడు రెండో రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మనసు, బుద్ధి, చిత్తం ఈ దేవి అధీనంలో ఉంటాయని భక్తుల నమ్మకం. అభయహస్త ముద్రతో ఉండే అమ్మవారి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ సందర్భంగా రెండేళ్ల నుంచి పదేళ్ల బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు, నూతన వస్త్రాలు బహుకరిస్తారు.
బాలా త్రిపుర సుందరీ దేవిగా....
ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ, పసుపు రంగు చీరలు కట్టి అలంకరించారు. అమ్మవారికి నైవేద్యంగా పాయసం, గారెలు సమర్పిస్తారు. రెండోరోజు దుర్గమ్మ గుడిలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించిన అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. కొండ మీదకు అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.