మూలా నక్షత్రం : నేడు సరస్వతీ దేవిగా కనకదుర్గమ్మ

అమ్మవారు తెలుపురంగు చీర ధరించి చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు.

Update: 2022-10-02 00:00 GMT

ఇంద్రకీలాద్రి పై దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలను తీర్చే కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దేవీ నవరాత్రుల్లో ఏడవరోజు చాలా ముఖ్యమైనది. నేడు మూలానక్షత్రం.

ఈ రోజు అమ్మవారు తెలుపురంగు చీర ధరించి, చేతిలో వీణతో చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి కేసరి, పరమాన్నం, దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. మూలానక్షత్రం, పైగా ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వస్తారు.
సరస్వతీ నమస్తుభ్యం, వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసర వర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సామాం పాతు సరస్వతీ
అని విద్యార్థులు అమ్మవారిని స్మరించుకుంటూ, తమకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని ప్రార్థిస్తారు.
శ్రీశైలంలో..
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు (ఆదివారం) భ్రమరాంబికా దేవి కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి , అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నేడు అమ్మవారికి గజవాహన సేవ నిర్వహిస్తారు.



Tags:    

Similar News