మమత కాదు..ఇక అంతా ఈయనదేనట

ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలను, స్థానిక నాయకుల ప్రాధాన్యతను జాతీయ పార్టీలు విస్మరించడమే ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ప్రధాన కారణం. తొలి రోజుల్లో ప్రాంతీయ పార్టీలు తమ రాష్రాల [more]

Update: 2021-06-27 16:30 GMT

ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలను, స్థానిక నాయకుల ప్రాధాన్యతను జాతీయ పార్టీలు విస్మరించడమే ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ప్రధాన కారణం. తొలి రోజుల్లో ప్రాంతీయ పార్టీలు తమ రాష్రాల ప్రగతికి దోహద పడ్డాయి. కాలక్రమంలో ఇవి కుటుంబ పార్టీలు, కుల పార్టీలు, మత పార్టీలుగా ముద్రపడిపోయాయి. పార్టీ అధినేత తదనంతరం అతని వారసులు పగ్గాలు చేపట్టడం సంప్రదాయంగా మారింది. అధినేతల కుటుంబ సభ్యులు చక్రం తిప్పడం ఆనవాయితీగా మారింది. అధినేత కుమారుడు, కూతురు, భార్య అల్లుడు, మేనల్లుడు, ఇతర సమీప బంధువులదే పెత్తనం. అధినేత తరఫున వ్యవహారాలు చక్కబెట్టడం, కీలక పదవులు దక్కించుకోవడం ప్రాంతీయపార్టీల్లో సహజ పరిణామం. తెలుగుదేశం, తెరాస, వైసీపీ, అకాలీదళ్, డీఎంకే, సమాజ్ వాదీ వంటి ప్రాంతీయ పార్టీల సమకాలీన చరిత్ర ఇది.

ఢిల్లీయే కార్యస్థానం….

ఇప్పుడు మమతా బెనర్జీ సారథ్యంలోని తణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా పూర్తిగా ఇదే కోవలో ప్రయాణిస్తోంది. పార్టీ వ్యవస్థాపకురాలు అవివాహిత. మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆమె తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తెరపైకి తీసుకువచ్చారు. నిన్న మొన్నటి దాకా కోల్ కతా కే పరిమితమైన అభిషేక్ బెనర్జీ ఇక నుంచి హస్తిన కేంద్రంగా రాజకీయం నెరపనున్నారు. ఇటీవల ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన నియామకాన్ని పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పటివరకు మేనత్త మమత తరఫున రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టిన అభిషేక్ బెనర్జీ కార్యక్షేత్రం ఇకపై ఢిల్లీకి మారనుంది.

మొన్నటి ఎన్నికల్లో….

ఇప్పటివరకు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా అభిషేక్ బెనర్జీ పనిచేస్తున్నారు. 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి రెండోసారి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మొదటిసారి 2014లో మూడు లక్షల ఇరవై వేలకు పైగా మెజార్టీతో ఎన్నికైన ఆయన మెజార్టీ రెండోసారి 2019నాటికి 1,20,594కు మాత్రమే పరిమితమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తెరవెనక అభిషేక్ బెనర్జీ విశేష కృషి ఉంది. ఒకప్పటి పార్టీ నాయకుడు 2017లో భారతీయ జనతా పార్టీలో చేరిన ముకుల్ రాయ్ ను మళ్లీ పార్టీలోకి తీసుకురావడం వెనక అభిషేక్ బెనర్జీ ప్రయత్నం ఉంది. వాస్తవానికి పార్టీలో పెరిగిపోతున్న అభిషేక్ ప్రాధాన్యాన్ని జీర్ణించుకోలేకే పలువురు సీనియర్ నాయకులు ఎన్నికలకు ముందు కమలం పార్టీకి క్యూ కట్టారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వెంటనే అభిషేక్ బెనర్జీ ఎన్నికల సమయంలో బీజేపీ దాడుల్లో దెబ్బతిన్న కార్యకర్తలను పరామర్శించారు. ముర్షీదాబాద్ జిల్లాలోని బెహ్రంపూర్, రఘనాధ్ గంజ్, బంకూర తదితర ప్రాంతాల్లో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు.

జాతీయ స్థాయిలో….

ఇక మమత తన పరిధిని జాతీయస్థాయికి విస్తరించాలనుకుంటున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో లాబీయింగ్ చేయనున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో నిమగ్నం కానున్నారు. 2024 నాటికి కాంగ్రెస్ తో సహా అన్ని ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడం, దానికి మమత సారథ్యం వహించేలా చేయడం తద్వారా మమత ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమం చేయడం అభిషేక్ బెనర్జీ ముందున్న తక్షణ కర్తవ్యం. ఎంబీఏ చదివిన అభిషేక్ బెనర్జీకి ఆంగ్లంపై పట్టు, జాతీయ రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. మమత మేనల్లుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. హస్తిన రాజకీయాల్లో రాణించడానికి ఆయనకు ఇవి దోహదపడతాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అయిదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికలు, జులైలో రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి ,ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మమతను ప్రచారానికి దించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ఆమె పాత్రను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా అభిషేక్ బెనర్జీ పని చేస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News