వ్యూహానికి చిత్తయిపోయారే

కాంగ్రెసు చరిత్రలో సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా పనిచేసి కష్టకాలంలో పార్టీని గట్టెక్కించిన సోనియానే మరోసారి బాధ్యతలు తలకెత్తుకోవాలా? వేల మంది సీనియర్ నాయకులు, యువ నాయకులు ఉన్న పార్టీకి [more]

Update: 2019-08-13 16:30 GMT

కాంగ్రెసు చరిత్రలో సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా పనిచేసి కష్టకాలంలో పార్టీని గట్టెక్కించిన సోనియానే మరోసారి బాధ్యతలు తలకెత్తుకోవాలా? వేల మంది సీనియర్ నాయకులు, యువ నాయకులు ఉన్న పార్టీకి వారసత్వ కుటుంబం తప్ప వేరే దిక్కే లేదా? స్వాతంత్ర్యం సముపార్జించిన పార్టీగా క్లెయిం చేసుకోవడమే కాదు. దేశంలోని రెండో పెద్దపార్టీగా నేటికీ కాంగ్రెసుకు ఆదరణ ఉంది. కోట్లాది మంది ప్రజల సభ్యత్వంతో ప్రపంచంలోని పెద్ద పార్టీలలో ఒకటిగా ఉంది. సుదీర్ఘ చరిత్ర, అంతకుమించి భారతదేశ పరివర్తన శకంలో కీలక భూమిక పోషించిన పార్టీగా ప్రపంచానికి కాంగ్రెసు తెలుసు. పొరపాట్లు, లోపాలు, నిర్ణయాలలో దోషాలు ఉండవచ్చు. కానీ నేటికీ దేశమంతటా వ్యాపించి పాన్ ఇండియా గుర్తింపు ఉన్న ఏకైక ప్రతిపక్షపార్టీగా కాంగ్రెసునే చెప్పుకోవాలి. నరేంద్ర మోడీ, అమిత్ షాల శకం మొదలయ్యాక బీజేపీ వ్యాప్తిలోనూ , వ్యూహ చాతుర్యంలోనూ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో వారి ఎత్తుగడలు అంతుచిక్కని విధంగా ఉంటున్నాయి. ఫలితంగానే ప్రతిపక్షం ఉండీలేనట్లుగా తయారవుతోంది. కాంగ్రెసు ముక్త్ భారత్ నినాదాన్ని నిజం చేయబోతున్నట్లుగా రాజకీయ వాతావరణాన్ని బీజేపీ మలచగలిగింది. ఈదిశలో కాంగ్రెసు స్వయంకృతాపరాధాలతో కొన్ని కష్టాలను కొని తెచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

బీజేపీ ట్రాప్ లో రాహుల్…

మోడీ, అమిత్ షా లు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడానికి గడచిన రెండేళ్లుగా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. యువ నాయకుడు, కాంగ్రెసు పార్టీకి దిక్సూచి రాహుల్ మాత్రమేనని వారికి తెలుసు. అందుకే యువరాజు, వారసత్వం అంటూ పదే పదే ఎద్దేవా చేస్తూ వచ్చారు. ఇది వ్యక్తిగతంగా కాంగ్రెసు అధ్యక్షుడికి కొంత ఇబ్బందికరంగా మారింది. నిజానికి రాహుల్ గాంధీని ప్రజాస్వామ్య విలువలు తెలిసిన నాయకుడిగానే చెప్పుకోవాలి. కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీలో విద్యార్థి, యువజన విభాగాలకు ఇన్ ఛార్జిగా ఉన్నప్పుడు ఆ విభాగాలకు అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించారాయన. తాను అనుకున్నది చేయాలనుకుంటారు. ఇందుకోసం అనేక సందర్బాల్లో తమ పార్టీతోనూ, ప్రభుత్వంతోనూ విభేదించారు. కానీ పొలిటికల్లీ సెన్సిటివ్. ఫెయిల్ అయితే తొందరగానే అలసిపోతారు. కిల్లర్ ఇన్ స్టింక్ట్ లేదు. రాహుల్ లోని ఈ మనస్తత్వాన్ని మోడీ, షాలు సరిగానే అంచనా వేశారు. అందుకే ఆయనపైనే గురి పెట్టారు. వారసత్వం అన్నమాట రాహుల్ కు నచ్చలేదు. అందుకే బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి భీష్మించారు. రాహుల్ అధ్యక్షునిగా లేకపోతే కాంగ్రెసు చుక్కాని లేని నావలా మారుతుంది. మరింతగా బలహీనపడుతుంది. ఇదే బీజేపీ లక్ష్యం.

ఇతరులను ఇష్టపడరా..?

కాంగ్రెసు పార్టీపై కమలం పార్టీ వేస్తున్న వారసత్వ ముద్రను తొలగించాలనేది రాహుల్ తాపత్రయం. అందుకే పార్టీకి తన అవసరం ఉందని తెలిసినా రాజీనామా చేస్తానని ముందుకు వచ్చారాయన. కానీ ఇక్కడ రాహుల్ గుర్తించని విషయం ఒకటుంది. గాంధీ ముద్ర లేకపోతే పార్టీ వర్గాలుగా మారిపోతుంది. మళ్లీ నాయకత్వ పోరు ముదిరిపోతుంది. గతంలో తొమ్మిదో దశకంలో పీవీ నరసింహారావు, సీతారాం కేసరి వంటి వారు నాయకత్వం వహించినా ఏమాత్రం పార్టీలో స్ఫూర్తినింపలేకపోయారు. కాంగ్రెసు పరిస్థితి బాగా బలహీనపడింది. అధినాయకత్వాన్ని వర్గాలు పెద్దగా లెక్క చేసేవి కావు. దాంతో మళ్లీ సోనియా గాంధీ వచ్చేవరకూ కాంగ్రెసు ఏకతాటిపై నడవలేకపోయింది. నిజానికి కాంగ్రెసులో సోనియాను వ్యతిరేకించినవారు లేకపోలేదు. కానీ వారి సంఖ్య చాలా స్వల్పం. అధ్యక్షపీఠాన్ని ఆశించిన వారు, తమకు శాశ్వతంగా పార్టీలో అగ్రస్థానానికి ఎదగడానికి అవకాశం రాదనే ఉద్దేశంతోనే అసమ్మతి గళం ఎత్తుకున్నారు. శరద్ పవార్ వంటి పెద్దస్థాయి వ్యక్తులూ ఇందులో ఉన్నారు. కానీ తర్వాత వారు సైతం కాంగ్రెసుతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అదీ గాంధీ కుటుంబానికి ఉండే ప్రాధాన్యత. నిజానికి నాయకత్వానికి కాంగ్రెసులో సీనియర్లు, యువ నాయకుల్లో చాలా మంది అర్హులు ఉన్నారు. సమర్థంగా పనిచేయగలిగిన వారికీ కొరత లేదు. కానీ సామర్థ్యం కంటే సెంటిమెంటుకే ఇంపార్టెన్స్. అందుకే అయిదు కమిటీలు వేసుకుని కూడా అధ్యక్షపీఠానికి అర్హులను తేల్చుకోలేకపోయింది కాంగ్రెసు.

సోనియానే చుక్కాని…

సోనియా గాంధీ పై పెద్ద బాధ్యతనే మళ్లీ మరోసారి పెట్టేశారు. కేవలం రెండేళ్ల కాల వ్యవధిలోనే అధ్యక్షపీఠం నుంచి తప్పుకున్నారు రాహుల్. నిజానికి బాహుబలిగా కనిపించే మోడీ, అమిత్ షాలతో, వారి వ్యూహాలతో తన శక్తిమేరకు రాహుల్ గాంధీ పోరాటం సాగించారు. అయితే ఒకటి రెండు ఎన్నికలతోనే పార్టీ పని అయిపోతుందనే వాదన సరైనది కాదు. 1980లో పార్టీ వ్యవస్థాపన నుంచి పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడానికి 18 సంవత్సరాలపాటు బీజేపీ ఎదురుచూడాల్సి వచ్చింది. జనసంఘ్ మూలాలు అప్పటికే నాలుగు దశాబ్దాల పైచిలుకు పనిచేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ , విశ్వహిందూ పరిషత్ వంటి అనుబంధ సంఘాలూ దశాబ్దాలుగా కృషి చేశాయి. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2019 ఓటమిని తొలి సార్వత్రిక ఓటమిగానే చెప్పాలి. అంతమాత్రం చేతనే బాధ్యతను వదిలివేయడమనేది పార్టీకి నష్టదాయకమే. నిజానికి మోడీ, అమిత్ షాలకు ఎంతో కొంత దీటైన పోటీ ఇవ్వడం రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెసుకు మాత్రమే సాధ్యం. సైకలాజికల్ గా ప్రత్యర్థిని నిర్వీర్యుడిని చేయడమనేది రాజకీయాల్లో ఒక ఎత్తుగడ. బలమైన ప్రత్యర్థిని పోటీ నుంచి తప్పించేస్తుంటారు. సరిగ్గా ఈ వ్యూహానికే రాహుల్ చిత్తయిపోయాడని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ వయసు, ఆరోగ్యం రీత్యా సోనియా భుజస్కంధాలపై పెద్ద బరువే ఉంచారు. ఎవరు అవునన్నా కాదన్నా..ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెసుకు ఆమె మాత్రమే చుక్కాని. తాత్కాలికం అని పేరు పెట్టినా రాహుల్ అలకవీడే వరకూ బాధ్యతల నిభాయింపు ఆమెకు తప్పకపోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News