అఖిల్ గొగోయ్….మార్మోగిపోతున్న పేరు

అఖిల్ గొగోయ్… ఈ పేరు ఇప్పుడు అసోం అంతటా మార్మోగుతుంది. ఆయన గురించే అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆయన పోరాట పటిమను అదే పనిగా కీర్తిస్తున్నారు. ఆయన [more]

Update: 2021-05-16 16:30 GMT

అఖిల్ గొగోయ్… ఈ పేరు ఇప్పుడు అసోం అంతటా మార్మోగుతుంది. ఆయన గురించే అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆయన పోరాట పటిమను అదే పనిగా కీర్తిస్తున్నారు. ఆయన సేవా నిరతిని అభినందిస్తున్నారు. ప్రజల పట్ల, వారి సంక్షేమం పట్ల, వారి హక్కుల పట్ల గొగోయ్ కు గల చిత్తశుద్ధికి నీరాజనాలు పలుకుతున్నారు. ఇంతకీ ఆయన చేసిందేమిటి, ప్రజలు ఎందుకు ఆయనను ప్రశంసిస్తున్నారు, ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు… తదితర ప్రశ్నలు ఉత్పన్నమవడం సహజం. ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

జైల్లో నుంచే గెలిచి…?

మొన్న మార్చి చివరి వారంలో జరిగిన అసోం మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో జైల్లో ఉంటూ శివసాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన అఖిల్ గొగోయ్ ఘన విజయం సాధించారు. అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన సురభి రాజ్ కోన్ వారిపై ఆయన గెలుపొందారు. 11,875 ఓట్ల మెజార్టీ సాధించారు. దీంతో జైల్లో ఉంటూ ఎన్నికల్లో విజేతగా నిలిచిన తొలి అస్సామీగా ఆయన గుర్తింపు పొందారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ జైల్లోంచి పోటీచేసి గెలిచారు. 1977లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడి అరెస్టయిన ఫెర్నాండెజ్ జైల్లోంచే ఎన్నికల బరిలోకి దిగారు. అప్పట్లో బిహార్ లోని ముజఫరపూర్ నుంచి పార్లమెంటుకు పోటీచేసిన జార్జి ఫెర్నాండెజ్ మూడు లక్షలకు పైగా మెజార్టీ సాధించడం విశేషం.

ఎన్ఐఏ కేసు నమోదుతో…?

ఇప్పుడు అలాంటి ఘనతనే సాధించారు అఖిల్ గొగోయ్. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడిన అఖిల్ గొగోయ్ పై జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ ఐ ఏ) కేసు నమోదు చేసి జైల్లో పెట్టింది. హింసాత్మక ఘటనల్లో ఆయన ప్రమేయం ఉందంటూ 2019 డిసెంబరులో ఆయనను అరెస్టు చేశారు. అయినప్పటికీ జైల్లో నుంచే ఎన్నికల బరిలోకి దిగారు. అఖిల్ గొగోయ్. తాను స్థాపించిన రైజోర్ దళ్ పార్టీ పేరిట ప్రజల వద్దకు వెళ్లారు. బహిరంగ లేఖల ద్వారా ప్రజా సమస్యలను ప్రస్తావించారు. తన వాణిని వినిపించారు.

కన్నతల్లి ఇంటింటికి తిరిగి….

అఖిల్ గొగోయ్ తరఫున ఆయన తల్లి అయిన 85 సంవత్సరాల ప్రియాదా గొగోయ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగగారు. తన కుమారుడి పోరాటానికి మద్దతుగా నిలవాలని అర్థించారు. సామాజిక కార్యకర్తలు మేధా పాట్కర్, సందీప్ పాండే లు కూడా మద్దతుగా నిలిచారు. యవకులు కూడా ఆయన తరఫున పోరాడారు. అధికార భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యావత్ పార్టీ యంత్రాంగాన్ని ఇక్కడ మోహరించింది. అఖిల్ గొగోయ్ ను నిలువరించేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. ముఖ్యమంత్రి సర్బానంద్ సోనావాల్, రాష్ర్ట మంత్రి, పార్టీ అగ్రనేత హిమంత బిశ్వ శర్మ వంటి ఉద్దండ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు.

వీధుల్లో పోరాటం కన్నా…?

మొదట్లో మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ తరవాత మనసు మార్చుకుంది. తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఫలితాల్లో ఆ పార్టీ అభ్యర్థి మూడో స్థానంలో నిలబడటం గమనార్హం. జోర్హాట్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఈ అసెంబ్లీ స్థానం ఉంది. అంతిమ విజయం ధర్మానిదే అన్నట్లు అఖిల్ గొగోయ్ ను విజయం వరించింది. గొగోయ్ గువాహటిలోని కాటన్ కాలేజి నుంచి డిగ్రీ చేశారు. 1995-96లో కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. సమాచార హక్కు ఉద్యమకారుడిగా పేరుంది. అనేక రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడారు. పర్యా
వరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ వెరవకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు అఖిల్ గొగోయ్. వీధుల్లో పోరాటాల కన్నా చట్టసభలో పోరాడితే తన వాణికి మరింత బలం చేకూరుతుందన్న ఉద్దేశంతో ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. ఓ ప్రజాప్రతినిధిగా ఆయన చేసే పోరాటాలు విజయవంతం కావాలని, తద్వారా సమాజానికి మేలు కలగాలని శివసాగర్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News