అతికి పోకుండా…నిదానంగా

మంత్రులందూ ఈ మంత్రి తీరు వేర‌యా!- అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు ఏలూరు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ ఆళ్ల నాని. ప్రస్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో [more]

Update: 2019-07-14 15:30 GMT

మంత్రులందూ ఈ మంత్రి తీరు వేర‌యా!- అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు ఏలూరు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ ఆళ్ల నాని. ప్రస్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో వైద్య శాఖ మంత్రిగా ఉన్న ఆయ‌న‌.. త‌న‌దైన శైలిలో దూకుడు చూపు తున్నారు. అయితే ఎక్కడా అతికి పోకుండా, పెద్దగా మీడియా ముందుకు రాకుండానే ఆయ‌న త‌న ప‌ని తాను చేసుకుపో తున్నారు. ఏలూరు నుంచి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కిన నానికి జ‌గ‌న్ కాపుల కోటాలో త‌న మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. అంతేకాదు, ఉప ముఖ్యమంత్రి ప‌ద‌విని కూడా అప్పగించారు.

కాపు సామాజిక వర్గాన్ని…..

దీంతో కాపు వ‌ర్గాన్ని వైసీపీ వైపు పూర్తిగా మ‌ళ్లిస్తార‌ని అంద‌రూ అనుకున్నా.. ఆయ‌న పెద్దగా కాపుల‌ను ప్రభావితం చేసే దిశ‌గా దృష్టిపెట్టడం లేదు. త‌న‌కు అప్పగించిన ప‌నిని పూర్తి చేయ‌డంలోనే దృష్టి పెట్టారు. గ‌తంలోను, ఇప్పుడు కూడా ఎలాంటి వివాదాల‌కు తావివ్వకుండా ఆళ్ల నాని ముందుకు సాగుతున్నారు. వైద్య విద్యలో మార్పుల కోసం ఆయ‌న చేసిన ప్రయ‌త్నాలు, వైద్యాన్ని పేద‌ల‌కు చేరువ చేసేందుకు చేపి ప్రయ‌త్నం తాజాగా జ‌గ‌న్ ప్రభుత్వం ప్ర‌వేశ పెట్టిన తొలి బ‌డ్జెట్‌లో క‌నిపించింది. ముఖ్యంగా పేద‌ల ఆరోగ్యానికి పూచీ ప‌డుతూ.. ఆయ‌న ఆరోగ్య శ్రీని ప్రధానంగా ప‌ట్టాలెక్కించే ప్రయ‌త్నం చేశారు. దీనికి బ‌డ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించేలా అడుగులు వేశారు.

జగన్ ప్రాధాన్యాలను గుర్తించి….

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ఆలోచ‌న‌లను, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల‌ను అమ‌లు చేసే దిశ‌గా కూడా ఆళ్లనాని ప్రయ‌త్నా లు సాగిస్తున్నారు. ప్రచారానికి దూరంగా ప‌నికి ద‌గ్గరగా ఆయ‌న ఉన్నార‌నే పేరు తెచ్చుకున్నారు. స‌హ‌జంగా గ‌తంలో చేసిన వైద్య శాఖ మంత్రులు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే, ఆళ్లనాని మాత్రం ఎక్కడా ప్రచారం లేకుండా తాను చేయాల‌నుకున్న ప‌నిని చేసి చూపుతున్నారు. జ‌గ‌న్ ప్రాధాన్యాల‌ను గుర్తించి మ‌సులు కుంటున్న నాయ‌కుల్లో ఆళ్ల నాని కీల‌క నాయ‌కుడిగా ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…..

ఇక కాపులు బ‌లంగా ఉన్న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఈ వ‌ర్గం నుంచి మంత్రిగా ఉన్న నాని జిల్లాలో కాపు వ‌ర్గాన్ని వైపు ట‌ర్న్ చేయాల‌ని అధిష్టానం ఆశ‌తో ఉంది. జిల్లాలో వ‌చ్చే స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌తో పాటు జిల్లా కేంద్రమైన ఏలూరులోనూ మేయ‌ర్ పీఠం వైసీపీ గెలుచుకునేలా చేయాల్సిన బాధ్యత నానిపై ఉంది. జిల్లా కేంద్రం కావ‌డంతో పాటు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో నానికి జిల్లాలో స్థానిక సంస్థల గెలుపుతో పాటు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలుపు ప్రతిష్టాత్మకం. ఏదేమైనా మంత్రిగా నెల‌న్నర రోజుల్లో నాని మౌనంగా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

Tags:    

Similar News