ఆనంతో పెద్ద పని పడిందిగా

ఆనం రామనారాయణరెడ్డితో ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి పెద్దపనే పడింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటంతో ఆనం ఇప్పుడు వైసీపీ హైకమాండ్ స్పెషల్ లుక్స్ లోకి [more]

Update: 2020-09-29 15:30 GMT

ఆనం రామనారాయణరెడ్డితో ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి పెద్దపనే పడింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటంతో ఆనం ఇప్పుడు వైసీపీ హైకమాండ్ స్పెషల్ లుక్స్ లోకి వచ్చారంటున్నారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం కూడా ఉంది.

పదిహేను నెలల నుంచి…..

ఆనం రామనారాయణరెడ్డి గత పదిహేను నెలల నుంచి పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడమే కారణమన్నది అందరికీ తెలిసిందే. మంత్రి పదవి దక్కక పోవడంతో పాటు జిల్లాలోనూ ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. కనీసం తన వెంకటగిరి నియోజకవర్గంలోనూ పనులు జరగడం లేదని జిల్లా సమీక్ష సమావేశంలోనే ఆనం రామనారాయణరెడ్డి తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు.

వీఆర్ కళాశాల…..

ఇక వీఆర్ కళాశాల మేనేజ్ మెంట్ కమిటీ వ్యవహారంలోనూ ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీఆర్ కళాశాల వ్యవహారంలో తలదూర్చారన్న కోపంతో రగిలిపోతున్నారు ఆనం రామనారాయణరెడ్డి. దీంతో పాటు తన సీనియారిటీని కూడా జూనియర్ నేతలు పట్టించుకోవడం లేదని, ఏకంగా వారిపై మాఫియా ముద్రను వేయబోయారు. దీనిపై పార్టీ అధిష్టానం ఆనంకు షోకాజ్ నోటీసు ఇచ్చేంత వరకూ వెళ్లింది.

ఇప్పుడు ఆనం టైం…..

అయితే ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి సమయం వచ్చేసింది. తిరుపతి ఉప ఎన్నికలో ఆనం కూడా కీలకంగా మారనున్నారు. తన నియోజవర్గ పరిధిలో జరగనున్న ఎన్నికతో ఆయనకు రానున్న కాలంలో పార్టీలో ప్రయారిటీ పెరుగుతుందంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి కూడా ఈ ఉప ఎన్నికను అడ్డం పెట్టుకుని తన డిమాండ్లను హైకమాండ్ ద్వారా నెరవేర్చుకునే లక్ష్యంతోనే ఉన్నట్లు కనపడుతుంది. మొత్తం మీద ఆనం రామనారాయణరెడ్డితో అధిష్టానానికి పెద్దపని పడిందనే చెప్పాలి.

Tags:    

Similar News