మంత్రిగారి శ‌ప‌థం.. సీఎంకు గిఫ్టుగా ఇస్తానంటున్నాడే

యువ మంత్రి, ఫైర్ బ్రాండ్ వైసీపీ నాయ‌కుడు అనిల్ కుమార్‌.. శ‌ప‌థం చేశారా ? నెల్లూరు కార్పొరేష‌న్‌ను సీఎం జ‌గ‌న్‌కు గిఫ్టుగా ఇస్తాన‌ని ప్రతిన బూనారా ? [more]

Update: 2021-03-02 11:00 GMT

యువ మంత్రి, ఫైర్ బ్రాండ్ వైసీపీ నాయ‌కుడు అనిల్ కుమార్‌.. శ‌ప‌థం చేశారా ? నెల్లూరు కార్పొరేష‌న్‌ను సీఎం జ‌గ‌న్‌కు గిఫ్టుగా ఇస్తాన‌ని ప్రతిన బూనారా ? అంటే ఔన‌నే అని స్థానిక వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో నెల్లూరు కార్పొరేషన్‌ను వైసీపీ ద‌క్కించుకుంది. మేయ‌ర్‌గా మైనార్టీ నేత అబ్దుల్ అజీజ్‌ను ఎన్నుకొన్నారు. అయితే త‌ర్వాత కాలంలో ఆయ‌న వైసీపీని వ‌దిలి టీడీపీలోకి వెళ్లిపోయారు. పైగా ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవ‌డంతో పాటు రూర‌ల్ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. ఇదిలా వుంటే.. ఇప్పుడు మ‌ళ్లీ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేడి పెరిగింది. అయితే.. దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు మంత్రి అనిల్ కుమార్‌ ప్రయ‌త్నిస్తున్నారు.

ఇక్కడ గెలిచి….

త్వర‌లోనే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ ఉన్న నేప‌థ్యంలో.. త‌న ప‌ద‌వికి గండం లేకుండా.. మ‌రోవైపు రెడ్డి సామాజిక వ‌ర్గానికి బ‌ల‌మైన నెల్లూరులో త‌న హ‌వాను త‌గ్గకుండా చూసుకునేందుకు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను ఆయుధంగా మార్చుకోవాల‌ని అనిల్ కుమార్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కార్పొరేష‌న్‌లో వైసీపీని ప‌రుగులు పెట్టించి.. దీనిని వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు గిఫ్ట్‌గా ఇస్తాన‌ని నేరుగానే సీఎం జ‌గ‌న్‌కు చెప్పి వ‌చ్చార‌ట‌. టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఇద్దరు కీల‌క నాయ‌కులు నెల్లూరు టీడీపీకి ఉన్నారు. మాజీ మంత్రి పి. నారాయ‌ణ‌, మాజీ మేయ‌ర్ అజీజ్‌.

గ్రూపుల గోలతో….

మొత్తం 54 వార్డులు ఉన్న నెల్లూరు కార్పొరేష‌న్‌లో జ‌నాభా చాలా ఎక్కువ‌గా ఉంది. పైగా..నెల్లూరు రూర‌ల్‌, సిటీ ఎమ్మెల్యేలు ఇద్దరూ కూడా బ‌లంగా ఉన్నారు. మంత్రి అనిల్ కుమార్‌ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను ముందు నుంచే ప్రతిష్టాత్మకంగా తీసుకుని దూకుడుగా ముందుకు వెళ్లారు. కార్పొరేష‌న్‌లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీ జెండా ఎగ‌రేసి తీరుతాన‌ని ఆయ‌న శ‌ప‌థం చేయ‌డంతో పాటు సిఎంకే గిఫ్ట్ అంటు భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఈ త‌ర‌హా దూకుడు ఉన్న నేత‌లు టీడీపీలో ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా గ్రూపుల గోల ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

టీడీపీ పరిస్థితి కూడా….

కార్పొరేష‌న్ ప‌రిధిలో అజీజ్‌కు మంచి ప‌ట్టున్న మాట వాస్తవం. ఆయ‌న గ‌తంలో మేయ‌ర్‌గా చేసి ఉండ‌డంతో ఆయ‌న‌కు ఇక్కడి ప్రజ‌ల నాడి తెలుసు. అయితే.. పార్టీలో క‌లిసి వ‌చ్చే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. ఆయ‌న ఇన్‌చార్జ్‌గా ఉన్న రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ పూర్తిగా డీలా ప‌డింది. గ‌తేడాది ప‌లు వార్డుల్లో పార్టీ త‌ర‌పున కార్పొరేట‌ర్లుగా నామినేష‌న్లు వేసిన వారు ఇప్పుడు నామ్ కే వాస్తే.. అన్నట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక మేయ‌ర్ అభ్యర్థిపై క్లారిటీ లేదు.

ఆనంకు చోటు ఇవ్వకుండా….?

ఇక టీడీపీ కార్పొరేట‌ర్ అభ్యర్థులు అధికార పార్టీ నేత‌ల ప్రలోభాల్లో చిక్కుకున్న వారు ఉన్నార‌ని.. మ‌రి కొంద‌రు డ‌మ్మీలుగా మారి యాక్టింగ్ చేస్తున్నార‌ని సొంత పార్టీలోనే సందేహాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. ఇంత దీన‌స్థితిలో టీడీపీ ఉంటే వైసీపీలో మంత్రి అనిల్ కుమార్‌ అన్నీతానై చ‌క్క బెడుతున్నారు. ఏదేమైనా సిటీలో త‌న ప‌ట్టు స‌డ‌ల‌కుండా చూసుకోవ‌డంతో పాటు ఆనంకు ఏ మాత్రం చిన్న చోటు కూడా ఇచ్చేందుకు అనిల్ సిద్ధంగా లేరు. జెట్ రాకెట్ స్పీడ్‌తో ఉన్న అనిల్‌కు టీడీపీ ఏ మాత్రం పోటీ ఇస్తుందో ? చూడాలి.

Tags:    

Similar News