అనిల్ దూకుడే కొంపముంచనుందా?

నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఏరికోరి జ‌గ‌న్ ఇద్దరు యువ మంత్రుల‌ను త‌న కేబినెట్‌లో నియ‌మించుకున్నారు. వీరిలో బీసీ వ‌ర్గానికి చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే [more]

Update: 2020-07-31 03:30 GMT

నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఏరికోరి జ‌గ‌న్ ఇద్దరు యువ మంత్రుల‌ను త‌న కేబినెట్‌లో నియ‌మించుకున్నారు. వీరిలో బీసీ వ‌ర్గానికి చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్‌, ఇదే జిల్లాలోని ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు వ‌రుస‌గా గెలిచిన మేకపాటి గౌతం రెడ్డి ఉన్నారు. ఎంతో మంది సీనియ‌ర్ నాయ‌కులు, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు ఈ జిల్లాలో చ‌క్రం తిప్పుతున్నా జ‌గ‌న్ వీరిని మాత్రమే ఏరికోరి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఏడాదిన్నర త‌ర్వాత వీరిద్దరిలో ఎవ‌రు గ్రేట్ ‌? అనే చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు.. ఒక‌రు సైలెంట్ మంత్రిగా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. మ‌రొక‌రు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.

దూకుడుగా అనిల్….

మంత్రి అనిల్ ఎప్పుడూ దూకుడు స్వభావంతో ఉంటార‌నే పేరు తెచ్చుకున్నారు. ప్రతిప‌క్షం చేసే విమ‌ర్శల‌కు త‌న‌దైన శైలిలో ఆయ‌న కౌంట‌ర్ ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నారు. పార్టీలో ఉన్నప్పుడు జ‌గ‌న్‌కు వీరాభిమానిగా ఉన్న అనిల్.. ఇప్పుడు కూడా దానినే కొన‌సాగిస్తున్నారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సొంత పార్టీలో నేత‌లు సూచిస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ఏం చేసినా ప్రజ‌ల‌కు పార్టీప‌రంగానే తెలుస్తుంద‌ని, కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో కీల‌క‌మైన ఇరిగేష‌న్ మంత్రిగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న దూకుడు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంద‌నేది వీరి సూచ‌న‌.

అనిల్ కు వ్యతిరేకంగా…..

పార్టీ కీల‌క నేత‌లు సూచ‌న‌లు చేసినా అనిల్ దూకుడు త‌గ్గడం లేదు. పోనీ.. ఆయ‌న శాఖ‌లో ప‌నుల వేగం పెరుగుతోందా? అంటే.. పెద్దగా లేద‌నే చెప్పాలి. కీల‌క‌మైన పోల‌వ‌రం స‌హా అనేక ప్రాజెక్టుల విష‌యంలో నిధులు లేక ఆగిపోయాయి. దీంతో మంత్రి అనిల్ అంటే దూకుడుకు మారుపేరుగా మారారు. ఇక జిల్లాలో ఒక ఎమ్మెల్యే మిన‌హా సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డితో పాటు పలువురు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు అంద‌రూ అనిల్‌కు వ్యతిరేకంగా గ్రూపు క‌ట్టారు. వీరంతా అనిల్‌ను జ‌గ‌న్ ఎప్పుడు మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తారా ? అని వెయిట్ చేస్తున్నారు.

మేకపాటి మాత్రం…..

ఇక‌, ప‌రిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మేక‌పాటి గౌతంరెడ్డి సైలెంట్‌గా త‌న‌ప‌ని తాను చేసుకు పోతున్నారు. ఆయ‌న ఎక్కడా దూకుడు ప్రద‌ర్శించ‌డం లేదు. ఎవ‌రినీ విమ‌ర్శించరు.. ఎవ‌రి జోలికీ వెళ్లరు. అంతేకాదు, త‌న ప‌నిత‌ప్ప.. మిగిలిన వ్యవ‌హారాల‌ను భుజాల‌కు ఎత్తుకోరు. ఎవ‌రు ఏమ‌నుకున్నా..తాను పెద్దగా ప‌ట్టించుకోరు. ఇది గ‌తంలో ఆయ‌న‌కు మైన‌స్ అయితే.. రానురాను ఆయ‌న ప‌నితీరు చూస్తున్న పార్టీ పెద్దల‌కు ప్లస్‌గా ఉంద‌నే అభిప్రాయం క‌లుగుతోంది. జిల్లాలో సొంత పార్టీ నేత‌ల్లో అనిల్ అంద‌రికి దూర‌మ‌వుతుంటే.. గౌతం రెడ్డి ద‌గ్గర అవుతున్నారు.

పారిశ్రామికంగా…..

రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేలా పారిశ్రామిక వ‌ర్గాల‌ను ఒప్పించ‌డంలోను, ప‌రిశ్రమ‌ల స్థాప‌న‌కు అనువైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డంలోను ఆయ‌న త‌న‌దైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. యువ‌త‌కు పారిశ్రామికంగా శిక్షణ ఇచ్చేందుకు త్వర‌లోనే రాష్ట్రంలో స్కిల్ కాలేజీల‌ను ఏర్పాటు చేసేందుకు కూడా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఫ‌లితంగా ఉపాధి స‌మ‌స్యకు ప‌రిష్కారం చూపించిన‌ట్టే అవుతుంద‌నేది విశ్లేష‌కుల భావ‌న‌. మొత్తంగా చూస్తే.. మేక‌పాటికి మంత్రిగా మంచి మార్కులు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News