ఈయన నియామకం మనకు మంచిదే

అమెరికా అధ్యక్షుడు… అత్యంత శక్తిమంతమైన ప్రపంచాధినేత. ఆయన తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుంటాయి. అదే సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి కూడా కీలకమైన [more]

Update: 2020-12-17 16:30 GMT

అమెరికా అధ్యక్షుడు… అత్యంత శక్తిమంతమైన ప్రపంచాధినేత. ఆయన తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుంటాయి. అదే సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి కూడా కీలకమైన నేత. వివిధ దేశాలతో అగ్రరాజ్యం సంబంధాలకు సంబంధించి ఆయన ప్రభావం ఉంటుంది. అందువల్లే అమెరికా అధ్యక్ష పదవి ఎంత శక్తిమంతమైనదో ఆ దేశ విదేశాంగ మంత్రి పదవి కొంచెం అటుఇటుగా అంతే కీలకమైనది. ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంటుంది. అధ్యక్షుడి తరఫున రాయబారాలు నెరపుతుంటారు. తాజాగా జో బైడెన్ తన విదేశాంగ మంత్రిగా ఆంథోనీ బ్లింకెన్ ను నియమించారు. ఈ నేపథ్యంలో ఆంథోనీ వ్యక్తిగతం, అనుసరించే విధివిధానాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.

భారత్ అనుకూల వాదిగా….

ముఖ్యంగా భారత్, చైనా, పాకిస్థాన్, ఉగ్రవాదం, ఇండో-పసిఫిక్ లకు సంబంధించి ఆయన వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరం. దాదాపు రెండు దశాబ్దాల దౌత్య అనుభవం గల బ్లింకెన్ భారత్ అనుకూలవాది కావడం మనకు కలసివచ్చే అంశం. అదే సమయంలో ఉగ్రవాదానికి ఊతమిచ్చే పాక్ అంటే వ్యతిరేకత ఉంది. 2011లో పాకిస్థాన్ లోని అటోమాబాద్ లో దాక్కున్న ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడంలో జాతీయ భద్రతా సలహాదారుగా తెరవెనక ఆయన కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు కూడా ఎఫ్ ఏ టీ ఎఫ్ (ఫైనాన్షియల్ యాక్షన్ టేకెన్ ఫోర్స్) నిబంధనల మేరకు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఇస్లామాబాద్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఎఫ్ టీ టీ ఎఫ్ సంస్థ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి అంతర్జాతీయంగా అనేక చర్యలు చేపడుతుంది. దానిని ప్రోత్సహించే, మద్దతిచ్చే దేశాలపై ఆంక్షలను విధిస్తుంది. ఇప్పుడు పాక్ ‘గ్రే’ జాబితాలో ఉంది. దీని నుంచి బయటపడాలంటే పాక్ మరిన్ని చర్యలు తీసుకోవలసి ఉంది.

చైనా విషయంలోనూ….

అంతర్జాతీయంగా చైనాకు అడ్డుకట్ట వేయాలనే విషయంలో బ్లింకెన్ ది రాజీలేని ధోరణి. ఇండో- పసిఫిక్ లో, దక్షిణ చైనా సముద్రం విషయంలో డ్రాగన్ ను నియంత్రించాలన్నది బ్లింకెన్ విధానం. ఈ విషయంలో భారత్ కీలక పాత్ర పోషించాలన్నది చెబుతుంటారు. అంతర్జాతీయ అంశాల్లో ఆసియాలో ముఖ్యంగా దక్షిణాసియాలోభారత్ కీలక భూమిక పోషించాలన్నది నూతన విదేశాంగ మంత్రి నిశ్చితాభిప్రాయం. బ్లింకెన్ తో భారత్ కు సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. మానవ హక్కులు, 370వ అధికరణ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి విషయాల్లో బ్లింకెన్- భారత్ వైఖరుల మధ్య వైరుద్ధ్యాలు ఉన్నాయి. ఇది కేవలం ఆయన విధానమే కాదు. డెమొక్రటిక్ పార్టీ విధానమే అంత.

అప్పడు జాతీయభద్రత సలహాదారుగా….

భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే గమనార్హం. అయితే వీటిని చర్చలతో పరిష్కరించుకోగల అవకాశం ఉందన్న బ్లింకెన్ ప్రకటన సానుకూలంశంగా చూడవచ్చు. అందువల్ల మున్ముందు ఉభయ దేశాల సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. 1962 ఏప్రిల్ లో న్యూయార్కులో జన్మించిన బ్లింకెన్ యూదు సంతతికి చెందినవారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో చదువుకున్నారు. క్లింటన్, బరాక్ ఒబామా హయాంలో విదేశీ వ్యవహారాల సలహాదారుగా, జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. 2009-13 మధ్య కాలంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జాతీయ భద్రతా సలహాదారుగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దౌత్యరంగంలో విశేష అనుభవం గడించారు. మొత్తం మీద ఆంథోనీ బ్లింకెన్ హయాంలో న్యూదిల్లీ- వాషింగ్టన్ మరింత చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News