నమ్మినోళ్లే నట్టేట ముంచారు

అంత:పురం రాజకీయాలు ఒక పట్టాన అర్థం కావు. ఎవరు నిజమైన మిత్రులో, ఎంతవరకు విశ్వాస పాత్రులో పక్కాగా అంచనా వేయడం అసాధ్యం. అదే అధినేతల పాలిట ఒక్కోసారి [more]

Update: 2021-08-30 16:30 GMT

అంత:పురం రాజకీయాలు ఒక పట్టాన అర్థం కావు. ఎవరు నిజమైన మిత్రులో, ఎంతవరకు విశ్వాస పాత్రులో పక్కాగా అంచనా వేయడం అసాధ్యం. అదే అధినేతల పాలిట ఒక్కోసారి శాపవుతుంది. వారి పతనానికి దారితీస్తుంది. పాత రోజుల్లో కుట్రలు, కుతంత్రాలతో ఒకరినొకరు చంపుకోవడం, విషమిచ్చి చంపడం వంటివి ఉండేవి. ఒకనాటి పల్నాటి యుద్ధమే ఇందుకు నిదర్శనం. తాజాగా రెండు దశాబ్దాల క్రితం మన పొరుగు దేశమైన నేపాల్ రాజ కుటుంబంలో అధికార పోరులో భాగంగా ఏకంగా ఊచకోతలు సాగాయి. తరువాతి రోజుల్లో సంపన్న ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇదంతా చరిత్ర. ఇప్పుడు ఆధునిక కాలంలో హత్యలు, ఊచకోతలు వంటివి లేకున్నా రాజ్యధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. నమ్మినవాళ్లు చివరి క్షణంలో వైరిపక్షంలో చేరిపోవడం, మాట మార్చడం వంటి ఘటనల వల్ల రాజ్యధికారం పోగొట్టుకుంటు న్నారు. మధ్య ఆసియా దేశమైన అప్ఘనిస్థాన్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. 2015లో అధ్యక్షుడిగా ఎన్నికైన అష్రాఫ్ ఘనీ గత నాలుగేళ్లుగా చక్రం తిప్పుతున్నారు.

పాలనలో చేదోడుగా…

తన సోదరుడు హస్మత్ ఘనీ, సన్నిహితుడు మిర్వాయిస్ యాసినీ ఆయనకు పాలనలో చేదోడువాదోడుగా ఉంటున్నారు. కీలక అంశాలపై అష్రాఫ్ ఘనీ వారితో చర్చించేవారు. అనంతతరమే నిర్ణయాలు తీసుకునే వారు. గత కొన్ని నెలలుగా తాలిబన్లు చొచ్చుకు వస్తున్నప్పటికీ సోదరుడు హస్మత్ ఘనీ, నమ్మకమైన నేస్తం మిర్వాయిస్ పైనే ఆయన మొత్తం భారం మోపారు. తాలిబన్లను వ్యతిరేకించడంలో వీరిద్దరూ ఎప్పుడూ ముందుండే వారు. అంతేకాక తాలిబన్లు దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతారు తప్ప యావత్ దేశాన్ని కైవశం చేసుకునే శక్తి లేదని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి వివరించే వారు. ఆయన కూడా వారి మాటలను విశ్వసించే వారు. చివరకు తన సోదరుడైన హస్మత్ ఆఖరిలో మాట మార్చి తాలిబన్ల వైపు చేరిపోయారు.

ప్రాణ భయంతో….

దీంతో గత్యంతరం లేక అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రాణభయంతో యునైటెడ్ అఅరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కు పారిపోయారు. హస్మత్ ఘనీ కుచిస్ గ్రాండ్ కౌన్సిల్ చీఫ్ గా పని చేసేవారు. అప్ఘాన్ పార్లమెంటు దిగువ సభ డిప్యూటీ స్పీకర్ అయిన మిర్వాయిస్ యాసినీ తూర్పు నంగార్హర్ రాష్రానికి ప్రతినిధి. పస్తూన్ తెగకు చెందిన వారు. దేశానికి తాలిబన్లే పెద్ద ముప్పని తరచూ చెబుతుండేవారు. 1996-2001 మధ్య కాలంలో అధికారంలో ఉన్న తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడారు. వారి పతనం తరవాత ప్రభుత్వంలో చేరారు. అష్రాఫ్ ఘనీకి తెలియకుండా చివరిక్షణంలో మిర్వాయిస్ తాలిబన్లతో చేతులు కలపడం వల్లే వారు అంత వేగంగా దేశాన్ని వశం చేసుకోగలిగారు. దీంతో చివరకు చేసేదేమీ లేక తట్టాబుట్టా సర్దుకుని అధ్యక్షుడు అఫ్రాఫ్ ఘనీ పలాయనం చిత్తగించాల్సి వచ్చిందన్న వాదన అప్ఘాన్ దౌత్య వర్గాల నుంచి వినపడుతోంది.

నిన్నటి వరకూ పక్కనే ఉండి…

అయితే మిర్వాయిస్ ఏ పరిస్థితుల్లో తాలిబన్ల వైపు చేరారన్న విషయంలో స్పష్టత లేదు. మునిగే పడవ వంటి అధ్యక్షడు అష్రాఫ్ ఘనీ వైపు ఉండటం వల్ల కన్నా అధికారానికి దగ్గర్లో ఉన్న తాలిబన్ల వైపే ఉంటే మేలన్నది ఆయన అంచనా అయి ఉండవచ్చు. చివరికి ఆయన అంచానాయే నిజమైంది. దేశ రాజధాని నగరం కాబూల్ భద్రతా వ్యవహారాల బాధ్యతలను మిర్వాయిస్ యాసినీకి తాలిబన్లు అప్పగించారు. అంత:పుర రాజకీయాలకు, కుట్రలు, కుతంత్రాలకు హస్మత్ ఘనీ, మిర్వాయిస్ ఉదంతాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News