‘గోల్’ లేని గోల

చట్టసభల సమావేశాల్లో ప్రధానమైన అంశాలు ప్రజల దృష్టిలో పడకుండా అధికార పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటాయి. రాజకీయ రచ్చ మాత్రమే ప్రజల ముంగిట్లో కనిపిస్తుంది. ప్రజాజీవితాలతో ముడిపడిన [more]

Update: 2021-07-31 16:30 GMT

చట్టసభల సమావేశాల్లో ప్రధానమైన అంశాలు ప్రజల దృష్టిలో పడకుండా అధికార పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటాయి. రాజకీయ రచ్చ మాత్రమే ప్రజల ముంగిట్లో కనిపిస్తుంది. ప్రజాజీవితాలతో ముడిపడిన విషయాలు పక్కదారి పడుతుంటాయి. తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు నటిస్తుంటాయి. సర్దుబాటు చేసుకుని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికార పక్షం యాక్ట్ చేస్తుంటుంది. కానీ ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో పూర్తిగా అజెండానే పక్కదారి పట్టింది. ప్రతిపక్షమే అధికార పార్టీకి అదనపు వనరుగా మారింది. అసలు విషయాలు సోదిలోకి రాకుండా గందరగోళం కొనసాగుతోంది. కాలమంతా గాలిలో కలిసిపోతోంది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహిస్తున్న పార్లమెంటు సమావేశాలు పది రోజులుగా పట్టుమని పదినిముషాలైనా చర్చ లేకుండా నిరంతరం వాయిదాలు పడుతున్నాయి. దీనివల్ల ఎవరికేని ప్రయోజనం ఉందా? అని ప్రశ్నించుకుంటే ఒక్క అధికారపార్టీకే ఆ లాభం దక్కుతోంది.

అసహనం ..ఆందోళన కరం…

ప్రతిపక్షాలు చాలా అసహనంతో ఊగిపోతున్నాయి. బీజేపీ అంటే వాటికి పడకపోవచ్చు. కానీ ప్రజలు అధికారమిచ్చారు. మరో రెండున్నర సంవత్సరాల పాటు కమలం పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంటుంది. ఇది ఎవరూ తోసిపుచ్చలేనిది. వచ్చే ఎన్నికల నాటికి తాము సిద్దం కావాలనుకుంటే ప్రతిపక్షాలు అంశాల వారీగా అధికార పార్టీని తూర్పారబట్టాలి. ఒక ఫెగాసిస్ వంటి నిఘా అంశమే దేశానికి అతిపెద్ద సమస్య అన్నట్లుగా వ్యవహరించడంతో ప్రతిపక్షాలు నష్టపోతున్నాయి. ప్రజల్లోనూ అనుమానాలు నెలకొనే అవకాశం ఏర్పడుతుంది. ఇంత పెద్ద దేశంలో కేవలం వెయ్యిమంది జాబితా ఫెగాసిన్ నిఘా లిస్టులో ఉందంటే అదేమంత పెద్ద వ్యవహారం కాదు. పైపెచ్చు దాని పై రాజకీయంగా తేల్చుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మమత సొంతంగా తన రాష్ట్రంలో న్యాయవిచారణకు ఆదేశించారు. వీటి ద్వారా ఏమైనా లీడ్స్ దొరికితే కేంద్ర ప్రభుత్వం కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం దేశంలో ప్రజలు అత్యయిక స్తితిలో ఉన్నారు. జీవనం దుర్బరమవుతోంది. వీటి పై పార్లమెంటు వేదికగా గళమెత్తా్ల్సిన ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి.

ఐక్యతకు అరాచకమే మార్గమా..?

విపక్షాల ఐక్యతను చాటుకోవడానికి ఫెగాసిస్ అంశాన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలని పార్టీలు చూస్తున్నాయి. నిజానికి నాయకులందరిలోనూ ఈ అంశం గుబులు రేకెత్తిస్తోంది. తమ సొంత వ్యాపారాలు, రాజకీయ బేరసారాలు, ఆర్తిక అక్రమాలన్నిటికీ ఇప్పుడు మొబైల్ అనేది ఒక సాధనంగా మారుతోంది. ఎక్కడ డొంక లాగినా మొత్తం తీగ కదులుతుంది. ఇది అందరకూ తెలిసున్న వ్యవహారమే. అందుకే నాయకులు భయపడుతున్నారు. తమ వ్యక్తిగత, రాజకీయ జీవితం నిఘా నీడలో ఉందనే అంశమే వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. అందువల్ల ఈ తతంగాన్ని న్యాయ స్థానం ద్వారా కొలిక్కి తెచ్చుకోవచ్చు. ఇది పక్కన పెట్టి తమను ఎన్నుకున్న ప్రజల కోణంలో దృష్టి సారించాలి. కరోనా రెండు దశల తర్వాత ప్రజల జీవితానికే ప్రమాదం ఏర్పడుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు దీనిని ప్రధానాంశంగా చేసుకోకపోవడం విచారకరం. ప్రభుత్వం అరకొర సాయంతోనే సరిపెట్టేస్తోంది. పైపెచ్చు వాక్సిన్ల వంటి అత్యవసర పంపిణీల విషయంలోనూ క్రమేపీ ఉదాసీనత నెలకొంటోంది. డిసెంబర్ నాటికి మొత్తం జనాభాకు వాక్సిన్లు అందచేస్తామన్న హామీ నెరవేరే సూచనలు కనిపించడం లేదు. తాజాగా కలిసి వచ్చిన పార్లమెంటు సమావేశాలను ప్రజారోగ్యానికి అంకితం చేస్తే ప్రయోజనదాయకంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎంతోకొంత మేలు జరుగుతుంది. ఫెగసిస్ వంటి అంశాలు ఒక్కరోజుతో ముగిసే గొడవలు కావు. ఒకవేళ విచారణ కమిటీని నియమించినా మళ్లీ ప్రభుత్వ అదుపాజ్ణల్లోనే విచారణ సాగుతుంది. అందువల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.

కమలం కన్నుల్లో కళకళ…

పార్లమెంటు వర్షాకాల సమావేశాల పట్ల ప్రభుత్వం ముందుగా కొంత కలవరపాటుకు గురైంది. వరసగా ప్రభుత్వ వైఫల్యాలు కళ్లెదురుగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలన్నీ గళమెత్తితే తట్టుకోవడం కష్టం. పైపెచ్చు ప్రజల్లోనూ స్పందన వస్తుంది. కేంద్ర ప్రభుత్వ లోపాలను కడిగిపారేసేందుకు అతి సులభమైన మార్టాలు ప్రతిపక్షాలకు కనిపించాయి. వాటిని అందిపుచ్చుకోలేదు. పరస్పరం సహకరించుకుంటూ ప్రతిపక్షాలన్నీ తమ పోరాటం ప్రజలకోసమే నని చాటి చెప్పుకొనే అవకాశాన్ని జారవిడుచుకున్నాయి.. బీజేపీని నిలదీస్తున్నామనే భ్రమలో తమకు తామే గోతిలో పడుతున్నాయి . పార్లమెంటు సమావేశాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చేస్తున్నారు. ఇతర వేదికల మీద తేల్చుకొనే అంశాలపై ఎక్కువ సమయం కేటాయిస్తే అసలు ప్రజావేదిక కు అర్థమే ఉండదు. ప్రతిపక్షాల వైఖరి చూసి బీజేపీ లోలోపల సంతోషిస్తూ ఉండవచ్చు. అందుకే ఎటువంటి తొట్రు పాటు లేకుండా కేంద్రం ధీమాగా కనిపిస్తోంది.-

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News