అయ్యన్న కుటుంబంలో కరోనా చిచ్చురేపిందే?

కరోనా కఠినమైనది, దయలేనిది అన్నది అందరికీ తెలిసిందే. అది కనబడకుండా వచ్చి ప్రాణాలను హరించుకునిపోయేదన్నది ఇప్పటివరకూ తెలిసిన సంగతి. కానీ రక్త సంబంధాలను సైతం విడదీసే కసాయి [more]

Update: 2020-04-10 03:30 GMT

కరోనా కఠినమైనది, దయలేనిది అన్నది అందరికీ తెలిసిందే. అది కనబడకుండా వచ్చి ప్రాణాలను హరించుకునిపోయేదన్నది ఇప్పటివరకూ తెలిసిన సంగతి. కానీ రక్త సంబంధాలను సైతం విడదీసే కసాయి అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం సాక్షిగా రుజువు అయింది. తన సొంత తమ్ముడిని సైతం వదలకుండా దూషించిన అన్న గారు అయ్యన్న అయితే, అన్న గారిని సైతం వదిలిపెట్టకుండా తిట్ల దండకం అందుకునే తమ్ముడు గారు నర్శీపట్నం మునిసిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు. ఈ ఇద్దరూ కరోనా వైరస్ రాధ్ధాంతంలోనే మరింతగా గొడవలు పెంచుకుని రాధ్ధాంతానికి దిగడం అసలైన విశేషం. కరోనా వైరస్ విపత్తు వేళ వైద్యులకు సరైన వైద్య పరికరాలు అందుబాటులో లేవంటూ నర్శీపట్నం డాక్టర్ సుధాకర్ ఘాటు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వెనకాల ఉన్నది తన అన్నగారేనని తమ్ముడు సన్యాసిపాత్రుడు ఇపుడు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు.

వెన్నుపోటు తమ్ముడు….

ఇక తన తమ్ముడు వెన్నుపోటుదారుడు అంటూ అయ్యన్న పాత్రుడు రివర్స్ అటాక్ చేస్తున్నారు. తనతో పాటు ఉంటూనే ప్రత్యర్ధి వర్గాలకు సహకరించే నైజం తమ్ముడు సన్యాసిపాత్రుడిదని కూడా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడుతున్నారు. తన తమ్ముడి విష‌యంలో తాము మోసపోయాయని అయ్యన్న తాపీగా చింతిస్తున్నారు. రాజకీయంగా తనను ఇబ్బందులు పెట్టడం తమ్ముడికే సాధ్యపడిందని కూడా విసుర్లు విసురుతున్నారు. ఇక తన ఇంట్లోనే సీసీ కెమెరాలు పెట్టి మొత్తం రాజకీయాన్ని బ్లాక్ మెయిల్ గా మార్చేశాడంటూ అయ్యన్న పాత్రుడు చేస్తున్న ఆరోపణలతో సన్యాసిపాత్రుడు వర్గం గరం గరం అవుతోంది.. వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ పంచన చేరిన తన తమ్ముడు అచ్చమైన విభీషణుడని, జాగ్రత్తగా ఉండకపోతే తనలాంటి పతనమే వైసీపీ ఎమ్మెల్యేకూ పట్టిస్తాడంటూ తమ్ముడిని అతి పెద్ద విలన్ని చేసేశారు.

బలహీనమేనా?

అన్నదమ్ములు ఇద్దరూ రామ లక్ష్మణులుగా ఉండేవారు. అయ్యన్న పాత్రుడికి ముగ్గురు తమ్ముళ్ళు ఉంటే అందులో ఇద్దరు చనిపోయారు. మిగిలినది సన్యాసిపాత్రుడే. ఇలా ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవారు. అలాంటి అన్నదమ్ముల బంధాన్ని కఠిన రాజకీయం విడదీసింది. అన్న గారి తరువాత తానేనని సన్యాసిపాత్రుడు అనుకుంటే తన కుమారుడే అసలైన రాజకీయ వారసుడని అయ్యన్న పాత్రుడు ప్రకటించేశారు. దాంతో మండిపోయిన తమ్ముడు వైసీపీలో చేరిపోయారు. అయితే అంతకు ముందే సొంత పార్టీలో అన్న గారిని ఓడించి మరీ వైసీపీకి మేలు చేశాడని అయ్యన్న వర్గం కారాలూ మిరియాలూ నూరుతోంది.

ఒక్కటిగా ఉండాల్సిన వేళ….

కరోనా మహమ్మరితో అంతా ఒక ఇంటి చూరు కింద ఒక్కరుగా ఉంటూ వస్తున్నారు. అటువంటి వేళలో కూడా ఉమ్మడి కుటుంబంలో అగ్గి రగిల్చిన కరోనా వైరస్ కంటే గొప్ప మహమ్మారి వేరే ఉంటుందా అని తెలుగుదేశంతో పాటు వైసీపీలోనూ చర్చించుకుంటున్నారు. రాజకీయంగా విడిపోయిన అన్నదమ్ములు ఎంతో మంది వేరు వేరు పార్టీలలో ఉంటున్నారు. కానీ ఇంతలా రచ్చకెక్కి మరీ పరస్పరం తిట్టుకోవడమే కాదు, ఎదుటి వారి కీడు తలచే రాజకీయ రొచ్చు అయ్యన్నపాత్రుడి కుటుంబంలో కొనసాగడం పట్ల మాత్రం అంతా ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనా అన్ని బంధాల కంటే పదవుల కంటే కూడా రక్త సంబంధం గొప్పదని కూడా అంటున్నారు. మరి మాజీ మంత్రి కుటుంబంలో కలహాలు ఎపుడు చల్లారుతాయో. లేక ఇంకా పెచ్చరిల్లుతాయో చూడాలి.

Tags:    

Similar News