జెండా సాక్షిగా చీలిందిగా

విశాఖ జిల్లాలో సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంట్లోకి ఇపుడు రాజకీయాలు ప్రవేశించాయి. ఇంతకాలం వీధుల్లోనే రచ్చ చేసిన మాజీ మంత్రికి ఇపుడు [more]

Update: 2019-12-13 05:00 GMT

విశాఖ జిల్లాలో సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంట్లోకి ఇపుడు రాజకీయాలు ప్రవేశించాయి. ఇంతకాలం వీధుల్లోనే రచ్చ చేసిన మాజీ మంత్రికి ఇపుడు సొంత ఇంట్లో తగులుతున్న పాలిటిక్స్ హీట్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికంతంటికీ కావడం సొంత తమ్ముడు, నిన్నటి వరకూ వెన్నంటి ఉన్న సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరిపోవడమే. అంతటితో ఆగకుండా ఇంటిపైన వైసీపీ జెండా ఎగరేశారు. దాంతో మూడున్నర డశాబ్దాలుగా పసుపు జెండా నీడన రాజకీయం చేస్తున్న అయ్యన్నకు ఇపుడు వైసీపీ జెండా పాము పడగలా మారిందట.

పోలీసుల వరకూ…..

అయ్యన్నపాత్రుడు ఫైర్ బ్రాండ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మాట్లడితే అధినేత చంద్రబాబు సైతం ఏమీ అనలేని పరిస్థితి. అటువంటి అయ్యన్నపాత్రుడు సొంత ఇంటి గొడవలను చక్కదిద్దుకోలేకపోతున్నారని అంటున్నారు. నర్శీపట్నంలో ఉమ్మడి కుటుంబంగా దశాబ్దాల తరబడి అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీ ఉంటోంది. ఒకే ఇంటిలో అన్నదమ్ములు కలసి రాజకీయాలు చేసేవారు. ఒకే పార్టీ కాబట్టి నిన్నటి వరకూ సరిపోయింది. కధ సాఫీగానే సాగింది. అయితే ఇపుడు మొత్తం అడ్డం తిరిగింది. అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు తాను కొత్తగా చేరిన వైసీపీ జెండాని అదే ఉమ్మడి ఇంటి మీద ఎగరవేశారు. దాంతో ఒకే చోట అటు టీడీపీ, ఇటు వైసీపీ జెండా ఎగరడం రాజకీయంగా కొత్త మలుపుగానే చెప్పాలి. దాంతో వైసీపీ జెండా తీయమని అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో సన్యాసిపాత్రుడు కుటుంబంతో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ పోలీసులను ఆశ్రయించడం కూడా జిల్లా రాజకీయాల్లో చర్చగా ఉంది.

పరువు పోయిందిగా…?

అయ్యన్నపాత్రుడు నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ టీడీపీ జెండా నీడనే ఉంటానని ఇప్పటిదాకా ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇపుడు ఆయన ఇంటి మీదనే వైసీపీ జెండా ఎగరడం ఆ నీడలో అయ్యన్నపాత్రుడు గడిపే పరిస్థితి రావడం అంటే నిజంగా దారుణమే. ఓ విధంగా అయ్యన్నపాత్రుడు పరువు పోయిందని కార్యక‌ర్తలు అంటున్నారు. మరో వైపు ఉమ్మడి కుటుంబంలో గొడవలు కాస్తా రాజకీయ రంగు పులుముకోవడంతో బజార్న పడి అయ్యన్నపాత్రుడు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయ్యన్నపాత్రుడు బయట టీడీపీ గురించి ఎంత గొంతు చించుకున్నా ఇంటి మీదనే ఎగిరే వైసీపీ జెండా గురించి ఏమీ చేయలేని నిస్సహాయ‌తలో పడ్డారని అంటున్నారు.

వారసుల కుస్తీ….

నిజానికి అన్నదమ్ములుగా అయ్యన్నపాత్రుడు, సన్యాసిపాత్రుడూ ఒక్కటిగానే ఉండేవారు. కలసిమెలసి మెలిగేవారు. అయితే వారి వారసుల మధ్య ఇంతటి సఖ్యత లేకపోవడంతోనే గొడవలు రేగాయని అంటున్నారు. అయ్యన్నపాత్రుడు పెద్ద కుమారుడు విజయ్ పాత్రుడు రాజకీయ వారసుడుగా ముందుకువస్తున్నాడు, అదే సమయంలో సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ పాత్రుడు సైతం సై అంటున్నారు. ఆయనే తండ్రి సన్యాసిపాత్రుడు మనసు మార్చి వైసీపీలో చేరేలా చూశారని అంటారు. ఇపుడు కొడుకుల గొడవలతో తండ్రులు రెండు పార్టీలుగా చీలడమే కాదు, ఉమ్మడి కుటుంబం కూడా రెండు ముక్కలయ్యేలా ఉందని అంటున్నారు. మొత్తానికి అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీలో జెండా చిచ్చు పెద్ద ఎత్తున రగులుతోంది.

Tags:    

Similar News