స్వీట్ వార్నింగ్ కాదంటారా?

అయిదు నెలల క్రితం మోడీని ప్రజలు నిండుగా ఆశీర్వదించారు. ఎలా అంటే బీజేపీ నేతలే ఆశ్చర్యపోయేలా. మొత్తం 303 లొక్ సభ సీట్లు కట్టబెట్టి మరో మారు [more]

Update: 2019-10-25 17:30 GMT

అయిదు నెలల క్రితం మోడీని ప్రజలు నిండుగా ఆశీర్వదించారు. ఎలా అంటే బీజేపీ నేతలే ఆశ్చర్యపోయేలా. మొత్తం 303 లొక్ సభ సీట్లు కట్టబెట్టి మరో మారు మోడీయే కావాలని గట్టిగా నినదించారు. మరి ఇంత తక్కువ టైంలో వచ్చిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మోడీ హవా నిజంగా కనిపించిందా అంటే లేదనే చెప్పాలి. 122 సీట్లు 2014 ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ సాధించింది. శివసేన మెడలు వంచి మరీ మద్దతు పుచ్చుకుని అయిదేళ్ళ పాటు రాజ్యం చేసింది. ఇపుడు బీజేపీకి అక్కడ వచ్చినవి 102 సీట్లు. అంటే అచ్చంగా 20 సీట్లు తక్కువపడ్డాయి. మరి ఇది విజయమేనా. ఇక హర్యానా తీసుకుంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పదికి పది లోక్ సభ సీట్లు బీజేపీ గెలుచుకుంది. అంతకు ముందు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి మనోహర్ ఖ‌ట్టర్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇపుడు మాత్రం కేవలం 40 సీట్లు మాత్రమే సాధించి మ్యాజిక్ ఫిగర్ కి ఆమడ దూరంలో బీజేపీ నిలిచింది.

ఉప ఎన్నికల్లోనూ అంతేగా…

ఇక ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆరు చోట్ల ఉప ఎన్నికలు జరిగితే మూడు మాత్రమే బీజేపీ గెలిచింది. మిగిలిన మూడు కాంగ్రెస్ గెలిచి ధీటుగా నిలబడింది. మరి దీన్ని ఏమంటారు. ఇక హర్యానాలో కాంగ్రెస్ బలం బాగా పుంజుకుని 30 అసెంబ్లీ సీట్లు సాధిస్తే జేజేపీ 10 సీట్లు సాధించింది. బీహార్ లో బీజేపీ మిత్రపక్షం నేత నీతీష్ సర్కార్ మొత్తం మూడు చోట్లా ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. తెలంగాణాలో చూసుకుంటే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిటే గల్లంతు అయింది. మరి ఇవన్నీ చూసుకున్నపుడు ప్రజలు తన పనితీరుని ఆశీర్వదించారని మోడీ ఎలా చెప్పుకోగలరన్నది పెద్ద చర్చ.

ప్రభ తగ్గుతోందా?

ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన నిజం. దేశంలో మెల్లగా మోడీ ప్రభ తగ్గుతోంది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేసిన తప్పులతో పాటు, విపక్షం బలహీన‌మైన ఎత్తుగడలు, కలసి వచ్చిన బాలకోట్ దాడులు ఇలా ఎన్నో రకాలుగా బీజేపీకి భారీ మద్దతుగా మారి రెండోసారి అధికారాన్ని కట్టబెట్టాయి. ఇపుడు చూస్తే ఓ వైపు ఆర్ధిక మాంద్యం, మరో వైపు నిరుద్యోగం, అన్నింటా పాలనా వైఫల్యాలు, సామాన్యునికి ధరాభారం వంటివి కళ్ళ ముందు ఉన్నాయి. ఎంతసేపు జాతీయ వాదం, పాకిస్థాన్ బూచి చూపించి పబ్బం గడుపుకుందామంటే కుదరదు అని జనం తీర్పు ఇచ్చారు, నిజానికి మోడీ సైజుని బాగా తగ్గించారు. కాంగ్రెస్ అధినాయకులు కాడి వదిలేసినా ఆ పార్టీని ప్రజలే అక్కున చేర్చుకుని గెలిపించారు. మరోవైపు మోడీ, అమిత్ షా కాలికి బలపం కట్టుకుని తిరిగినా కూడా ఆశించిన విజయం దక్కలేదు. నిజంగా ఈ ఫలితాలు మోడీకి ఒక తీయని హెచ్చరిక. తీరు మార్చుకోమని ఇస్తున్న స్వీట్ వార్నింగ్.

Tags:    

Similar News