కమలం…. C/O అనుమానం
తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ కిందామీదా పడుతోంది. తెలంగాణలో ఒక్కసారిగా ఊపు మీదకొచ్చిన పార్టీ అంతలోనే చల్లారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ ఆపసోపాలు పడుతోంది. అయినా తమ [more]
తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ కిందామీదా పడుతోంది. తెలంగాణలో ఒక్కసారిగా ఊపు మీదకొచ్చిన పార్టీ అంతలోనే చల్లారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ ఆపసోపాలు పడుతోంది. అయినా తమ [more]
తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ కిందామీదా పడుతోంది. తెలంగాణలో ఒక్కసారిగా ఊపు మీదకొచ్చిన పార్టీ అంతలోనే చల్లారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ ఆపసోపాలు పడుతోంది. అయినా తమ బలహీనతలు పక్కన పెట్టి ప్రకటనల్లో మాత్రం నాయకులు దంచి కొడుతున్నారు. గెలుపు తమదేనని ఆంధ్రా, తెలంగాణ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. తెలంగాణలో నాగార్జున సాగర్ లో ఇప్పటికే విసిగిపోయిన స్థానిక నాయకులు చాలామంది అధికార టీఆర్ఎస్ లోకి సర్దుకుంటున్నారు. టిక్కెట్లు వస్తాయని ఆశించి భంగపడిన వారు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. పైస్థాయిలో కొందరు నేతలు నెగ్గే సీటు కాదు కదా, ఈసారికి వదిలేయండి అంటూ ఒకరిద్దరు నాయకులను బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో అయితే అసలు ప్రచారం పట్టాలకి ఎక్కించడమెలాగో తెలియక సతమతమవుతున్నారు. సైద్దాంతికంగా రాష్ట్రంలో బలపడటానికి సెంటిమెంటుగా తిరుపతి ఉపయోగపడుతుందని భావించారు. తీరా చూస్తే గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నట్లు నాయకులు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే జాతీయ అగ్రనాయకులు వాస్తవ పరిస్థితులను మదింపు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ప్రచారానికి రాలేమని ఇప్పటికే తేల్చి చెప్పినట్లు సమాచారం. అయిదు రాష్ట్రాల ఎన్నికల బిజీ ని ఇందుకు సాకుగా చూపుతున్నట్లు తెలుస్తోంది.
రెండు చోట్లా అదే మాట…
ఎక్కడ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ అవకాశాన్ని మోడీ, షా లు ఏనాడూ విడిచిపెట్టరు. నిజింగానే వారు బిజీగా ఉన్న మాట వాస్తవమే. కానీ ఇక్కడ పార్టీకి ఏదో మేరకు అవకాశం ఉంటే వారు సమయం వెచ్చించేవారు. కేంద్ర ఇంటిలిజెన్స్ రిపోర్టులు , పార్టీ సర్వేల ప్రకారం ఆంధ్రా, తెలంగాణల్లో దారుణమైన ఓటమి ఖాయమని అంచనాకు వచ్చేశారనేది పార్టీ వర్గాల ఆంతరంగిక సమాచారం. రెండు చోట్లా మూడో స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుందని బీజేపీ నాయకులు తమలోతాము అంగీకరిస్తున్నారు. అంతేకాకుండా మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారికి , బీజేపీకి మధ్య ఓట్ల శాతంలో తీవ్రమైన వ్యత్యాసం కూడా ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి వచ్చి పరువు పోగొట్టుకోవడమెందుకనే కోణంలోనే అగ్రనాయకులు నిరాకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాల బీజేపీ నాయకులు మాత్రం చాలా సీరియస్ గానే మోడీ, అమిత్ షాల పర్యటన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారి రాకతో పార్టీకి కొంత ఉత్సాహం వస్తుందని నచ్చచెప్పే ప్రయత్నాల్లో పడ్డారు. ముందుగా పార్టీ అధ్యక్షుడు నద్దాను ఒప్పించి ప్రధాని, హోం మంత్రుల ప్రచారాన్ని ఖరారు చేయించుకోవాలని చూస్తున్నారు. నిజానికి సాగర్ ఎన్నికలో ఎటువంటి ఫలితం వచ్చినా పెద్దగా బాధ పడాల్సింది లేదు. ఒకవైపు కాంగ్రెసులో టాల్ లీడర్ అయిన జానారెడ్డి పోటీ చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కుమారుడు. అతనికి తండ్రి సెంటిమెంటు ఉంటుంది. ఓటమి పాలైనా ఆయా వ్యక్తిగత కరిష్మా, సెంటిమెంటు పనిచేసిందని సర్దిచెప్పుకోవడానికి బీజేపీకి సాకు ముందుగానే దొరికింది. గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు తెచ్చుకుంటే సరిపోతుంది. దానికి కూడా అగ్రనాయకుల పర్యటనలు అవసరమనేది స్థానిక నాయకుల వాదన.
వారు సరిపోతారు…
తిరుపతి బీజేపీకి చాలా ప్రతిష్ఠాత్మకమైన ఎన్నిక . ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ వివక్ష చూపుతోందని తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. అధికార, ప్రతిపక్షాలు రెండూ లోక్ సభ, రాజ్యసభల్లో బీజేపీకి, కేంద్రానికి సహకరిస్తున్నాయి. కానీ ఏపీలో పార్టీ ఎదగకుండా మోకాలడ్డుతున్నాయి. ప్రత్యేకించి టీడీపీ బీజేపీ అజెండాను సొంతం చేసుకుంటూ పార్టీ ముందడుగు వేయకుండా నిరోధిస్తోంది. టీడీపీని టార్గెట్ చేసి మూడో స్థానానికి నెట్టేయాలనుకున్న బీజేపీ ప్రయత్నం ఇంతవరకూ ఏ ఒక్క ప్రాంతంలోనూ నెరవేరలేదు. ఇటీవల జరిగిన తిరుపతి మునిసిపల్ ఎన్నికల్లో్నూ ఘోరమైన ఫలితాల్నే చవి చూసింది. అధికార, ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానం చెప్పాలంటే ఇక్కడ కనీసం రెండో స్థానంలో నిలవాలనేది బీజేపీ నాయకుల అంతర్గత ఆలోచన. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. తమ పార్టీకి చెందిన అగ్రనాయకుల సంగతి పక్కనపెడితే తమ పార్ట్ నర్ అయిన పవన్ కల్యాణ్ సైతం ఈ ఎన్నికల్లో ప్రచారం చేయకపోవచ్చునని సంకేతాలు అందుతున్నాయి. సినిమాల్లో ఆయన కూడా బిజీ. పవన్ తరఫున తాము ప్రచారం చేస్తామంటూ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించేశారు. పవర్ స్టార్ రంగంలోకి దిగకపోతే జనసేన అభిమానులు, కార్యకర్తల సహకారం అనుమానమే.
క్యాడర్ కోసం పొరుగు లీడర్…
తిరుపతి బీజేపీ క్యాడర్ లోనూ జోష్ కనిపించడం లేదు. కనీసం ఉత్సాహం నింపి సైద్దాంతికంగా ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేయాలన్నా బలమైన నాయకుడు కావాలి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులపై కార్యకర్తల్లోనే అనుమానాలున్నాయి. అధికార వైసీపీపై తీవ్రమైన రాజకీయ పోరాటం చేయడం లేదనే సందేహాలున్నాయి. అందువల్ల పార్టీ కోర్ ఐడియాలజీతో అనుబంధం ఉన్న కార్యకర్తలు నాయకత్వంపై విశ్వాసాన్ని వ్యక్తం చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో పొరుగున ఉన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆహ్వానించాలని యోచిస్తున్నారు. బండి సంజయ్ సైద్దాంతికంగా స్ట్రాంగ్. ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో అతని పోర్సే వేరు. టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ఊపిరి సలపనివ్వడం లేదు. బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా? అంటూ తిరుపతికి సంబంధించి కూడా గతంలోనే ప్రకటించి వేడి పెంచాడాయన. అక్కడ పోటీ చేసేది తమ పార్టీయే అని తొలుత సంకేతాలిచ్చింది కూడా అతనే. సంజయ్ పర్యటన ఖరారైతే కార్యకర్తల్లో ప్రేరణ కలుగుతుందని స్థానిక నాయకులు కోరుకుంటున్నారు. మొత్తమ్మీద రాష్ట్ర నాయకులపైన ప్రజలకు నమ్మకం లోపించింది. కనీసం డిపాజిట్లు అయినా వస్తాయా? అన్న విషయంలో అగ్రనాయకత్వంలో అనుమానాలు పొడచూపుతున్నాయి. సైద్ధాంతికమైన ఓటింగును అయినా తెచ్చకుని , కార్యకర్తల్లో ప్రచార సంరంభం నింపడం సాధ్యమా? అన్నసమస్య మరోవైపు వేధిస్తోంది. మొత్తమ్మీద బీజేపీలో సర్వత్రా అనుమానాలు, సందేహాలతో అడుగు ముందుకు పడటం లేదు.
-ఎడిటోరియల్ డెస్క్