అలా చేసినా అంత సులువు కాదు బాసూ?

దేశం మొత్తమ్మీద శాసనసభలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నిక పెట్టేస్తే సరిపోతుందని భారతీయ జనతాపార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇందులో రాజకీయ లాభనష్టాల సంగతి ఎలా ఉన్నప్పటికీ రెండు [more]

Update: 2020-12-07 16:30 GMT

దేశం మొత్తమ్మీద శాసనసభలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నిక పెట్టేస్తే సరిపోతుందని భారతీయ జనతాపార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇందులో రాజకీయ లాభనష్టాల సంగతి ఎలా ఉన్నప్పటికీ రెండు ప్రదానాంశాలను ప్రజల్లో చర్చకు పెడుతోంది. నిరంతరం ఎన్నికలతో కోడ్ కారణంగా ఎఫ్పుడూ దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల దేశవ్యాప్తంగా అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ఏక కాలంలో పట్టాలకు ఎక్కించడం సాధ్యం కావడం లేదనేది ఒక వాదన. వేర్వేరు ఎన్నికల కారణంగా ప్రభుత్వ వ్యయం విపరీతంగా ఉంటోందనేది మరొక వాదన. ఈ రెండూ పాక్షిక సత్యాలే. కోడ్ కారణంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో తాత్కాలికంగా 40 నుంచి 60 రోజుల పాటు కొత్త పథకాల అమలు వాయిదా వేయాల్సి ఉంటుంది. అప్పటికే అమల్లో ఉన్న స్కీములకు ఏ రకంగానూ ఇబ్బంది ఉండదు. అధికారపార్టీలకు అడ్వాంటేజ్ రాకూడదనే ఈ నిరోధం. ప్రభుత్వ వ్యయం విపరీతంగా ఉంటుందంటూ చేస్తున్న వాదన కూడా అర్ధ సత్యమే. దేశవ్యాప్తంగా శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు అయిదేళ్ల వ్యవధిలో పది వేల కోట్లరూపాయల మేరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఇదే సమయంలో ప్రభుత్వాల వ్యయం 350 లక్షల కోట్ల రూపాయల మేరకు ఉంటోందని గణాంకాలు చెబుతున్నాయి. అంత పెద్ద ఖర్చులో ఇది పూచికపుల్ల పాటి. అయితే ఎన్నికల్లో పార్టీలకు మాత్రం తడిసిమోపెడవుతున్న మాట వాస్తవం. కానీ అది సొంత సొమ్ము కాదు. మెజార్టీ భాగం పారిశ్రామిక, వ్యాపార వర్గాల విరాళాలే. ఒకేసారి జమిలీ ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలకు ప్రధానంగా బీజేపీకి అధికారం నల్లేరుపై బండి నడకలా వచ్చి పడిపోతుందంటూ చేస్తున్న విశ్లేషణలూ సత్యదూరమే.

శక్తుల కలయిక…

ఎన్నికలంటే రకరకాల శక్తులు భిన్న వాదనలు, సిద్దాంతాలతో కలపడుతుంటాయి. తలపడుతుంటాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే భావోద్వేగాల పరంగా సంతృప్తి పరిచిన పార్టీకి పట్టం కడుతుంటారు ఓటర్లు. భిన్న శక్తులను తమ సైద్దాంతిక అజెండాకు అనుగుణంగా మలచడంలో బీజేపీ గత కొంతకాలంగా విజయం సాధిస్తూ వస్తోంది. ఎక్కడికక్కడ విజయాలు నమోదవుతున్నాయి. ఇది కమలం పార్టీ ఒక్కదానికే సొంతం కాదు. గతంలో కాంగ్రెసు పార్టీ సైతం కొన్ని దశాబ్దాలు ఇదే బాటలో నడిచింది. 1967 వరకూ సాగిన జమిలీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శాసించింది. అంతమాత్రాన ఆ పార్టీ శాశ్వతంగా అధికారపీఠంపై కూర్చోవడం సాధ్యం కాలేదు. ఇప్పుడు బీజేపీ రైజింగ్ పొజిషన్ లోకి చేరింది. మతపరమైన సమీకరణతో విస్తరణ వాదానికి పూనుకుంటోంది. ఇందుకు అవసరమైన మద్దతు సమీకరణలో భాగమే జమిలీ ఎన్నికల ఎత్తుగడ. దేశంలో రాజకీయ ఏకతను తీసుకురావడం అనుకున్నంత సులభం కాదు. 2019లో లోక్ సభ లో అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ పోలైన ఓట్లలో 40శాతం చేరడమే బీజేపీకి సాధ్యం కాలేదు. విభిన్న రాజకీయ పార్టీలను తోసిరాజంటూ ఏకపక్షమైన రాజకీయ భూమికను దేశంలో చెలాయించేందుకు జమిలీ ఎన్నికలు దోహదపడతాయని చేస్తున్న విశ్లేషణలు, విమర్శలు పూర్తి వాస్తవం కాదు.

ప్రాంతీయ పార్టీలకు చెక్…

నరేంద్ర మోడీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రస్తావన ఇప్పటికి మూడు నాలుగు సార్లుగా నలుగుతోంది. తొలిసారిగా 2016లో మోడీ ఈ అంశాన్ని ప్రజల ముందుంచారు. 2017లో నీతి అయోగ్ మరోసారి ఈ విషయాన్ని చర్చనీయం చేసింది. లా కమిషన్ వివిధ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. తాజాగా మరోసారి ప్రధాని గళమెత్తారు. ప్రాంతీయ అజెండాలతో ఉన్న పార్టీలు పూర్తి స్థాయిలో తమకు సహకరించడం లేదనే అసంతృప్తి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రాంతీయ పార్టీల అస్తిత్వమే సొంత అజెండాలపై ఆధారపడి ఉంది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఒకే అజెండాతో ముందుకు వెళితే ప్రాంతీయ పార్టీలను ఎన్నుకోవాల్సిన అవసరం ఓటర్లకు ఏముంటుంది? అందువల్ల దేశంలో ఏ పార్టీకి పట్టం గట్టినా రాష్ట్రాల విషయంలో ప్రజలు సెలక్టివ్ గానే ఉంటున్నారు. ఈ భావన నుంచి బయటపడేసి ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదంతో బీజేపీ బలపడుతుందని అగ్రనాయకుల యోచన. కొంతమేరకు ఓటింగు వైఖరుల్లో ప్రజల్లో తేడా కనిపించినా ఫలితాలను శాసించే స్థాయిలో జమిలీ ఎన్నికలు ప్రభావితం చేయవని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు.

కాంగ్రెసుకు కలిసి రావచ్చు….

దేశంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ అగ్రనాయకులంతా వాలిపోతున్నారు. ప్రాంతంతో సంబంధం లేకుండా తమ బలాన్ని, బలగాన్ని చాటి చెబుతున్నారు. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఇటీవలి జీహెచ్ ఎంసీ ఎన్నికల తతంగమే అందుకు నిదర్శనం. ఒక స్థానిక ఎన్నిక, కనీసం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక కూడా కాదు. అయినా సర్వశక్తులు సమీకరించి, మోహరించి దాడి చేయడం కమలనాథులకే చెల్లుబాటవుతోంది. జమిలీ ఎన్నికలంటూ వస్తే నాయకులు ఎక్కడికక్కడ పరిమితం కావాలి. బలాన్ని దేశవ్యాప్తంగా సర్దుబాటు చేసుకోవాలి. నిధులు, విరాళాలు సమీకరణకు ఇప్పుడున్నంత వెసులుబాటు ఉండదు. క్రౌడ్ పుల్లర్లు అయినా అగ్రనాయకుల ప్రచారం, పర్యటన సొంత రాష్ట్రాల పరిధిలోనే ఉండిపోతుంది. ఇవన్నీ జాతీయ పార్టీగా బీజేపీకి అనుకూలించే అంశాలేమీ కావు. ఉన్నంతలో బలమైన శక్తి గెలుస్తుంది. కానీ ప్రాంతీయ అజెండాలు, అస్తిత్వం ఎక్కడికీ పోవు. అందువల్ల్లనే ఉమ్మడి ఎన్నికలతో బీజేపీకి అనుకూలమైన ప్రాతిపదిక ఏర్పాటైపోతుందని చెప్పలేం. అందరి అవసరమూ బీజేపీని ఎదుర్కోవడమే కాబట్టి కాంగ్రెసుతో ఇతర పక్షాలు కలిసి కట్టుగా నడిచేందుకు కూడా జమిలీ ఎన్నికల వంటివి తప్పని సరి అనివార్యతను కల్పించవచ్చు. రాజకీయ కోణాల్లో కాకుండా జమిలీ ఎన్నికలను జాతీయ స్ఫూర్తి కోణంలోనే అర్థం చేసుకుంటే మంచిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News