బెంగాల్ సీఎం అభ్యర్థి ఆ స్వామీజీయేనటగా?
ఇటీవలి బిహార్ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ మంచి ఊపు మీదుంది. ఈ జోష్ తో పొరుగన ఉన్న పశ్చిమ బెంగాల్ [more]
ఇటీవలి బిహార్ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ మంచి ఊపు మీదుంది. ఈ జోష్ తో పొరుగన ఉన్న పశ్చిమ బెంగాల్ [more]
ఇటీవలి బిహార్ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ మంచి ఊపు మీదుంది. ఈ జోష్ తో పొరుగన ఉన్న పశ్చిమ బెంగాల్ లో సత్తా చాటాలని ఉవ్విళూరుతోంది. 2021 ఏప్రిల్, మే నెలల్లో బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అయిదింటిల్లో ముఖ్యంగా బెంగాల్ పై పార్టీ గురి పెట్టింది. పదేళ్ల నుంచి చక్రం తిప్పుతున్న మమతను పదవి నుంచి దించడానికి ఇదే సరైన సమయమని పార్టీ బలంగా భావిస్తోంది. ఇప్పుడు తప్పితే మున్ముందు సాధ్యం కాదన్న ఆలోచనలో ఉంది. అందువల్ల తన శక్తియుక్తులను పూర్తిగా బెంగాల్ పైనే నిలుపుతోంది. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఈ తూర్పు రాష్రాన్ని చుట్టి వచ్చి పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు.
అనేక పేర్లను పరిశీలించి…..
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఫోకస్ చేయాలనే విషయమై కసరత్తు చేస్తోంది. తొలుత క్రికెటర్ సౌరభ్ గంగూలీ పేరును పరిశీలించింది. అనుభవలేమి ఆయనకు పెద్ద అడ్డంకిగా ఉండటంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. తరవాత రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేరును ప్రతిపాదనలోకి తీసుకుంది.ఆయన పాతతరం మనిషి కావడంతో పక్కకు పెట్టింది. ఇంతకు ముందు టీఎంసీ నుంచి భాజపాలోకి వచ్చిన ముకుల్ రాయ్ పేరును పరిగణనలోకి తీసుకుంది. ఆయన బలమైన నేత. ప్రస్తుతం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాయ్ ఆర్థికంగానూ స్థితిమంతుడు. అయితే ఆయనపై బ్యాంకు కుంభకోణాల కేసులుండటంతో రాయ్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.
వేలూరు మఠానికి…..
దీంతో అనేక ప్రత్యామ్నాయాలను పరిశీలించిన హైకమాండ్ చివరికి స్వామి కృపాకరానంద పేరు పట్ల సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆయన అసలు పేరు డెబాతోష్ చక్రవర్తి. బెంగాల్ లోని వేలూరు మఠం ఆరోగ్యవిభాగం అధిపతిగా పని చేస్తున్నారు. చిన్నతనం నుంచే చదువుల్లో దిట్ట. మంచి మార్కులు తెచ్చుకున్నారు. ప్రతిష్టాత్మకమైన దిల్లీ ఎయిమ్స్ లో పనిచేశారు. అమెరికాలో గుండెవ్యాధుల పై అనేక పరిశోధనలు చేశారు. సంగీతంలో మంచి పట్టుంది. మంచిగాయకుడు కూడా. స్వామి పట్ల భాజపాకు పునాది అయిన ఆర్ఎస్ఎస్ లో సానుకూలత ఉంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న మేధావులు, యువకులను గుర్తించడం, వారు పార్టీకి పనికి వచ్చేటట్లయితే ప్రొత్సహించడం, శిక్షణ ఇవ్వడం వంటి పనులను ఆర్ఎస్ఎస్ గుట్టు చప్పుడు కాకుండా చక్కబెడుతుంది. అనూహ్యంగా ఆఖరి నిమిషంలో పేరు బయట పెడుతుంది. మఠం వర్గాలు విషయాన్ని ఖండిస్తున్నప్పటికీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం తోసిపుచ్చడం లేదు. గతంలోనూ ఆర్ ఎస్ ఎస్ ఇలానే చేసింది.
సన్యాసులకే…..
కీలకమైన యూపీ ముఖ్యమంత్రిగా చివరి నిమిషంలో యోగి ఆదిత్యనాధ్ పేరును తెరపైకి తీసుకువచ్చిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అప్పటికి ఆయన కనీసం ఎమ్మెల్యే కాదు. గోరఖ్ పూర్ పార్లమెంటు సభ్యుడు. గోరఖ్ పూర్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారి అనూహ్యంగా సీఎం అయ్యారు. ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఉమాభారతి కూడా బ్రహ్మచారిణే. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమె అనూహ్యంగా కీలకమైన మధ్యప్రదేశ్ రాష్రానికి ముఖ్యమంత్రిగా వెళ్లారు. అనేకమంది సన్యాసులకు పార్టీ అధికారంలోకి వచ్చాక వివిధ పదవులను అప్పగించింది. ఈ నేపథ్యంలో బెంగాల్ తెరపై స్వామి కృపాకరానంద పేరు తెరపైకి రావడాన్ని తేలిగ్గా తోసిపుచ్చలేమన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.
-ఎడిటోరియల్ డెస్క్