కండలవీరుడికి కటకటాలు తప్పవా?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కంగారు మొదలయింది. ఆయనను కృష్ణ జింకల కేసు వెంటాడుతూనే ఉంది. రెండు దశాబ్దాలు గడిచినా సల్మాన్ ఖాన్ ను [more]

Update: 2020-09-22 18:29 GMT

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కంగారు మొదలయింది. ఆయనను కృష్ణ జింకల కేసు వెంటాడుతూనే ఉంది. రెండు దశాబ్దాలు గడిచినా సల్మాన్ ఖాన్ ను ఆ కేసు వదల బొమ్మాళీ అంటూ వెంటపడుతూనే ఉంది. ఈ నెల 28వ తేదీన సల్మాన్ ఖాన్ ను కోర్టుకు హాజరు కావాలంటూ జోధ్ పూర్ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీంతో బాలీవుడ్ లో ఉత్కంఠ మొదలయింది. కొన్నేళ్లుగా వెంటాడుతున్న కేసులో తీర్పు ఎలా వస్తుందన్న టెన్షన్ సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన అభిమానుల్లోనూ మొదలయింది.

22 ఏళ్ల నాటి కేసు…..

కృష్ణ జింకల వేట కేసు ఈ నాటిది కాదు. 22 ఏళ్ల నాటిది. 1998వ సంవత్సరంలో సల్మాణ్ ఖాన్ హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ కు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కృష్ణ జింకలను వేటాడినట్లు అప్పట్లో సల్మాన్ ఖాన్ పై కేసు నమోదయింది. సల్మాన్ ఖాన్ తో పాటు నీలమ్, టబు, సోనాలి బింద్రే, ఆలీ ఖాన్ లపై కూడా కేసు అప్పట్లో నమోదయింది. అయితే సల్మాన్ ఖాన్ ను తప్పించి మిగిలిన వారందరికీ ఈ కేసులో రిలీఫ్ లభించింది.

గతంలో ఐదేళ్ల శిక్ష……

అయితే రెండేళ్ల క్రితం అంటే 2018 లో సల్మాన్ ఖాన్ కు ఈ కేసులో ఐదేళ్ల శిక్ష కూడా పడింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన సల్మాన్ ఖాన్ రెండురోజులు జైలులో ఉండి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. అయితే ఈ నెల 28వ తేదీన విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సల్మాన్ ఖాన్ ను జోధ్ పూర్ న్యాయస్థానం ఆదేశించడంతో బాలీవుడ్ లో టెన్షన్ మొదలయింది.

బాలీవుడ్ లో టెన్షన్…..

ఈ కేసులో గతంలో వెలువడిన తీర్పు ప్రకారం శిక్ష పడితే ఐదేళ్ల శిక్షను సల్మాన్ ఖాన్ అనుభవించక తప్పదని న్యాయనిపుణుల చెబుతున్నారు. మూగజీవాలను వేటాడిన కేసు నుంచి బయటపడటం అంత సులువు కాదన్నది వారి అభిప్రాయం. అయితే సల్మాన్ ఖాన్ కు శిక్ష పడితే బాలివుడ్ కు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. సల్మాన్ ఖాన్ భవితవ్యం మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News