బొబ్బిలి కోట మీదనే బొత్స గురి ..?

విజయనగరం జిల్లా రాజకీయాలు బహు పసందుగా ఉంటాయి. వేరు వేరు పార్టీలలో ఉన్నా కూడా నాయకుల మధ్యన తెర వెనక సఖ్యత హ్యాపీగా తాపీగా అలా సాగిపోతూనే [more]

Update: 2021-08-27 14:30 GMT

విజయనగరం జిల్లా రాజకీయాలు బహు పసందుగా ఉంటాయి. వేరు వేరు పార్టీలలో ఉన్నా కూడా నాయకుల మధ్యన తెర వెనక సఖ్యత హ్యాపీగా తాపీగా అలా సాగిపోతూనే ఉంటుంది. విజయనగరం జిల్లా పూసపాటి వారికీ, మంత్రి బొత్స సత్యనారాయణకు మధ్య చక్కని బంధమే ఉందని అంటారు. ఎన్నికల వేళ ఇది మరింతగా పండుతుందని కూడా చెబుతారు. వీక్ క్యాండిడేట్ ని అటూ ఇటూ పెట్టుకుని గెలుస్తారు అని కూడా ప్రచారం అయితే ఉంది. ఇవన్నీ ఉత్త మాటలు అనుకున్నా ఈ మధ్య అశోక్ గజపతి రాజు అంటే ఒంటికాలు మీద లేస్తున్న వైసీపీ సర్కార్ కి కనీసం మాట సాయం కూడా బొత్స సత్యనారాయణ చేయకపోవడాన్ని బట్టి చూస్తే ఈ బంధం బహు గట్టిది అనిపించక మానదు.

మెత్తమెత్తగానే ..?

అశోక్ మీద విమర్శలు చేయాలంటే బొత్స సత్యనారాయణ మాటలకే తడుముకుంటారు అంటారు. ఎందుకంటే విజయనగరం వరకూ అశోక్ దే మాట. గ్రామీణంలో తన హవా అంటూ రాజకీయ గిరులు గీసుకుని కొన్ని దశాబ్దాల పాటు ఈ ఫ్యామిలీలు ఏలాయి. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ లో ఉన్నపుడు అలా సాగింది కానీ ఇపుడు ఆయన కూడా వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలో ఉన్నారు. దాంతో సొంత ఒప్పందాలు స్వీయ నిబంధలను పక్కన పెట్టి మరీ అశోక్ మీద దాడి చేయాల్సిందే అంటోంది అధినాయకత్వం. దానికి సరేననలేక మెత్తమెత్తగా అశోక్ మీద బొత్స సత్యనారాయణ బాణాలు వేస్తున్నారు. మా ప్రభుత్వం తప్పు ఏమీ లేదు, పూసపాటి వారి వారసత్వం విషయంలో వచ్చిన గొడవను మా మీద రుద్దితే ఎలా అంటూ అశోక్ ని చైర్మన్ పదవి నుంచి తప్పించడాన్ని బొత్స తనదైన స్టైల్ లో సమర్ధించారు.

దూకుడు అక్కడే…?

అదే సమయంలో బొబ్బిలి రాజుల విషయంలో మాత్రం ఎలాంటి మొహమాటాలకూ తావు లేకుండా బొత్స సత్యనారాయణ మాటల తూటాలు పేల్చేస్తారు. బొబ్బిలి వారిదీ సంస్థానమే. వారికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది. కానీ బొత్స సత్యనారాయణకు వారితో ఉన్నది రాజకీయ వైరం. పార్టీలు ఎన్ని మారినా ఆయన టార్గెట్ మాత్రం బొబ్బిలి కోట మీదనే ఉంటుంది. అందుకే బొబ్బిలి రాజుల ఇలవేలుపు అయిన వేణుగోపాలస్వామి వారి నగలు కోటలో ఎందుకు ఉండాలి అంటూ లా పాయింట్లు బాగానే లాగుతున్నారు బొత్స సత్యనారాయణ. విజయనగరం రాజుల ఆధీనంలోని మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో అవకతవకలు జరిగాయని చెబుతున్నా మాట్లాడని బొత్స బొబ్బిలి రాజులు మాత్రం అవకతవకలకు పాల్పడ్డారని పెద్ద నోరు చేస్తున్నారు.

అందుకే అలా ..?

ఈ ద్వంద్వ నీతితో తన స్వీయ ప్రయోజనాలకు చూసుకుంటూ పోతున్న బొత్స సత్యనారాయణ తీరుని వైసీపీ ఒక కంట కనిపెడుతోందని అంటున్నారు. తప్పు ఎక్కడ జరిగినా తప్పే, అందరి గుట్టూ బయటపెడతామని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు. సింహాచలంతో మొదలుపెట్టి విజయనగరం మాన్సాస్ భూముల విషయంలో లోతైన దర్యాప్తు చేస్తామని కూడా స్పష్టంగా చెబుతున్నారు. అదే సమయంలో బొబ్బిలి కోటలో ఉన్న నగలు, విలువైన ఆభరణాలను కూడా దేవస్థానం ఆధీనంలోకి తెస్తామని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి అటూ ఇటూ రాజులు, మధ్యలో బొత్స సత్యనారాయణ లాంటి దళపతులు, పైన వైసీపీ సర్కార్ చెడుగుడు ఇవన్నీ కలసి విజయనగరంలో మరో యుద్ధాన్నే తీసుకువచ్చేలా ఉన్నాయని అంతా అంటున్నారు.

Tags:    

Similar News