సత్తిబాబుతో పెట్టుకుంటే అంతేనా?

బొత్స సత్యనారాయణ. సీనియర్ మంత్రి. ఆయనతో పెట్టుకుంటే మసి కావాల్సిందే. అధికారంలో ఉన్నప్పుడు సత్తిబాబు మరింత రెచ్చిపోతారు. ఈ మాటలు అంటుంది ఎవరో కాదు ఆ పార్టీ [more]

Update: 2019-10-13 15:30 GMT

బొత్స సత్యనారాయణ. సీనియర్ మంత్రి. ఆయనతో పెట్టుకుంటే మసి కావాల్సిందే. అధికారంలో ఉన్నప్పుడు సత్తిబాబు మరింత రెచ్చిపోతారు. ఈ మాటలు అంటుంది ఎవరో కాదు ఆ పార్టీ నేతలే. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో పట్టున్న నేత. ఒక సామాజిక వర్గానికి ప్రతినిధి మాత్రమే కాకుండా జిల్లా అంతటా అన్ని నియోజకవర్గాల్లో తన మాట చెల్లుబాటు కావాలన్నది బొత్స సత్యనారాయణ పట్టుబడుతుంటారు. అయితే ఒక ఎమ్మెల్యే సత్తిబాబు వర్గం దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. అధిష్టానానికి చెప్పుకోలేక, తనకు ఎమ్మెల్యేగా పరపతి లేక నియోజకవర్గంలో నలిగిపోతున్నారు.

కంచుకోటలో పాగా వేసినా….

విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గంలో చాలా ఏళ్ల తర్వాత టీడీపీ నుంచి వైసీపీ విజయం సాధించింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి మరీ ఎస్ కోటలో ఫ్యాన్ రెపరెపలాడింది. ఎస్ కోట నమ్మకంగా తమకే దక్కుతుందని టీడీపీ వేసుకున్న అంచనాలు వమ్మయ్యాయి. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కడుబండి శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే కడుబండి శ్రీనివాసరావు ఆ నియోజకవర్గానికి చెందిన నేత కాదు. నాన్ లోకల్. జగన్ తన ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎస్ కోట కు వస్తున్నప్పుడు అక్కడి బాధ్యతలను ఎత్తుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కడుబండి పాదయాత్రకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. కడుబండి చురుకుదనంచూసిన జగన్ ఆయన అక్కడి నివాసి కాకపోయినా ఎస్ కోట టిక్కెట్ ను కేటాయించారు. చివరకు గెలిచారు.

స్థానికేతరుడు కావడంతో….

వైసీపీ అధికారంలోకి రావడం, ఎస్ కోటలోవైసీపీ జెండా ఎగరడంతో అప్పటి వరకూ ముందుకు రాని నేతలు ఇప్పుడు పోటీ పడుతున్నారు. వాస్తవానికి నియోజకవర్గంపై ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు పట్టులేదు. అవగాహనలేదు. ఆయన లోకల్ లీడర్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది. దీనిని సాకుగా తీసుకుని ఎమ్మెల్యేను పక్కన పెట్టి కొందరు నేతలు నేరుగా పనులు చేయిస్తున్నారు. చేయించుకుంటున్నారు. ఇందుకూరి రఘురాజు, అల్లు జోగినాయుడు, చినరామానాయుడు, నెక్కలనాయుడులు ఎమ్మెల్యేను కేర్ చేయకుండా అధికారుల వద్దకు వెళ్లి నేరుగా పనులు చేయించుకుంటున్నారు. ఇది తెలిసిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వారికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించారు.

సత్తిబాబు అండదండలతో…..

అయితే వీరందరికీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను అండదండలున్నాయి. పరోక్షంగా సత్తిబాబు ఆశీస్సులు కూడా ఉండటంతో ఎమ్మెల్యే చెప్పిన పనులు ఈ నియోజకవర్గంలో కావడం లేదన్నది వాస్తవం. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కేవలం ఉత్సవ విగ్రహంలాగానే ఉన్నారు. పరిస్థితిని గమనించిన కడుబండి శ్రీనివాసరావు అధిష్టానం వద్దకు తన పరిస్థితిని వివరించాలని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సత్తిబాబు డైరెక్ట్ ఇన్ వాల్వ్ మెంట్ ఉండటంతో సున్నితంగా పరిష్కరించుకోవాలన్నది ఎమ్మెల్యే యోచన. మొత్తం మీద ఎస్ కోటలో వైసీపీ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే పనులు జరిగిపోతున్నాయన్నది వాస్తవం. నియోజకవర్గంలో క్యాడర్ లో కూడా అయోమయం నెలకొంది.

Tags:    

Similar News