ఎప్పుడన్నదే తేలాలట

బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా, పీసీసీ చీఫ్ గా పనిచేశారు. ఆయన సేవలు కాంగ్రెస్ కి ఎంత ఉపయోగపడ్డాయో తెలియదు కానీ జగన్ సర్కార్ లో [more]

Update: 2020-02-15 14:30 GMT

బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా, పీసీసీ చీఫ్ గా పనిచేశారు. ఆయన సేవలు కాంగ్రెస్ కి ఎంత ఉపయోగపడ్డాయో తెలియదు కానీ జగన్ సర్కార్ లో మాత్రం బాగానే హైలెట్ అవుతున్నారు. బొత్స సత్యనారాయణ పలుకు అంటే అంబ పలుకు అన్నట్లుగా వైసీపీలో సీన్ ఉంది. అమరావతి రాజధాని తరలింపు విషయంలో మొదట బొత్స నోటి వెంట నుంచే ఆణిముత్యాలు జాలువారాయి. ఆ తరువాత ఆరు నెలలకు జగన్ అదే సత్యమని నిండు అసెంబ్లీలో నొక్కి వక్కాణించారు. ఇపుడు కేంద్ర క్యాబినెట్లో వైసీపీ చేరికపైన కూడా బొత్స సత్యనారాయణ సానుకూలంగా మాట్లాడుతున్నారు.

ఓకే అంటారట….

కేంద్రం నుంచి ప్రతిపాదనలు వస్తే అక్కడి ప్రభుత్వంలో వైసీపీ ఎంపీలు చేరడానికి అభ్యంతరం ఏముంటుందని బొత్స సత్యనారాయణ విలేకరులతో అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. మరి పార్టీలుగా వైసీపీ రాజకీయ విధానాలు, బీజేపీ విధానాలు వేరు అన్నది తెలిసిందే. దీని మీద కూడా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తమకు రాష్ట్రం ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ఇంకా ముఖ్యం. అందువల్ల వారి కోసం తాము ఎవరి గడ్డం అయినా పట్టుకుంటామని అంటున్నారు. పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని ఏపీని అభివృధ్ధి చేసుకుంటామని, ఈ విషయంలో అన్ని మార్గాలను తాము చూసుకుంటామని చెప్పుకొచ్చారు.

రెడీ అయినట్లే…

వైసీపీలో పెద్ద తలకాయ, సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ వంటి వారు కేంద్రంలో చేరితే తప్పేముంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటే దానికి పూర్వరంగం సిధ్ధమైపోయిందనే భావించాలి. దీని మీద అటు బీజేపీలోనూ, ఇటు ఢిల్లీలోనూ అనేక రకాలైన ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ కోరి మరీ వైసీపీని కేంద్ర క్యాబినెట్ లోకి ఆహ్వానిస్తోందని అంటున్నారు. మోడీ, షాలతో జగన్ జరిపిన చర్చల్లో ఇది కూడా కీలకం అంటున్నారు. జగన్ సైతం దీనికి సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు.

ఒక్క దెబ్బకు….

ఇలా చేయడం వెనక జగన్ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో బాబుని, పవన్ ని దెబ్బ కొట్టాలంటే బీజేపీతో జట్టు కట్టడమే బెస్ట్ అని జగన్ భావిస్తున్నారుట. ఎంతసేపూ కేంద్రాన్ని, బీజేపీని బూచిగా చూపించి బాబు, పవన్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు, అటువంటి కేంద్రంలోనే అధికారం సంపాదిస్తే ఒక్క దెబ్బకు ఈ రెండు పార్టీల గొంతు మూగబోతుందని కూడా జగన్ భావిసున్నారుట. ఇక పవన్ పరిస్థితి మరింత దారుణం అవుతుందని, ఆయన అన్ని పార్టీలతో పొత్తు పేరిట చుట్టి వచ్చేశారని, బీజేపీలో ఇపుడు ఉన్నా బయటకు వెళ్ళినా అసలు విలువ ఉండదని కూడా వైసీపీ పెద్దలు అంచనా కడుతున్నారుట. ఇక కేంద్రం దన్ను ఉంటే బాబుని పూర్తిగా బోనులో బంధించవచ్చునని, ఏపీలో రాజకీయం ఏకపక్షం చేసుకోవచ్చునని కూడా జగన్ ఆలోచిస్తున్నారుట. మొత్తానికి కేంద్రంలో వైసీపీ మంత్రులు ఉండడం ఖాయమని బొత్స సత్యనారాయణ వారు సత్యం పలికారు. అది ఎప్పుడన్నదే ఇపుడు చూడాలి.

Tags:    

Similar News