సత్తిబాబు గుస్సాకు కారణం అదేనా?

వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ని అని మంత్రి బొత్స సత్యనారాయణ నమ్మకం. ఆయన చాలా సార్లు ఈ విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా కూడా మీడియా ఎదుట [more]

Update: 2020-07-09 12:30 GMT

వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ని అని మంత్రి బొత్స సత్యనారాయణ నమ్మకం. ఆయన చాలా సార్లు ఈ విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా కూడా మీడియా ఎదుట చెప్పేసుకున్నారు. తాను ఒకటికి రెండు మెట్లు దిగి వైసీపీలో చేరానని కూడా చాలా సార్లు ఆయన అన్నారు. అవును ఇది కూడా కొంత నిజమే. శతాధిక చరిత్ర కలిగిన కాంగ్రెస్ లో ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా రేసులో ఉన్నారు. ఇపుడు పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో అదీ జగన్ వంటి యువ నేత మంత్రివర్గంలో మంత్రిగా ఉండడం అంటే కొంత ఇబ్బందే. కానీ రాజకీయాలు అలాంటివి. ఇక్కడ సీనియారిటీ కంటే కూడా లక్ బాగా పనిచేస్తుంది.

ఇదే బెటర్….

ఇక బొత్స సత్యనారాయణ వరకూ తీసుకుంటే ఇదే బెటర్ కదా అన్న భావన కూడా ఉంది. కాంగ్రెస్ లో సీనియర్ మంత్రులుగా ఉన్నవారు, ఆయన సహచరులు ఇపుడు బొత్సలా మంత్రిగా కూడా అధికార వైభోగం అనుభవించడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో పేరుకు ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆయనకు ఏ పవరూ లేదు. ఇక వైసీపీలోనే ఉన్న ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవి కోసం కలవరిస్తున్నారు. రఘువీరారెడ్డి రాజకీయాలే విరమించుకున్నారు. మరో నేత శైలజానాధ్ ఉందో? లేదో తెలియని కాంగ్రెస్ కి ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన పళ్ళం రాజు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, విజయనగరానికే చెందిన కిశోర్ చంద్రదేవ్ లాంటి వారి పాలిటిక్స్ ఏంటో వారికే అర్ధం కావడంలేదు. అందువల్ల కాలానికి తగినట్లుగానే బొత్స సత్యనారాయణ అడుగులు వేసి వైసీపీలో కుదురుకున్నారనుకోవాలి.

విశాఖపైన :

ఇక బొత్స సత్యనారాయణ జగన్ ఏపీ నాయకుడు అయితే తాను ఉత్తరాంధ్రాకు కింగ్ అనుకుంటున్నారు. అందుకే ఆయన ఈ మూడు జిల్లాల రాజకీయాల్లో వేలూ కాలూ పెడుతున్నారుట. ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నపుడే అంటే పక్కన ధర్మాన ఉన్నా కూడా శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను కెలికి గొడవలకు కారణమయ్యారని అంటారు. అయితే అది కాంగ్రెస్ పార్టీ, మహా సముద్రం అందువల్ల బొత్స సత్యనారాయణ , ధర్మాన ఏ విధంగా కయ్యాలు పడినా కూడా పార్టీకి పెద్దగా ప‌ట్టింపు లేదు, కానీ ఇది వైసీపీ, ఫక్త్ ప్రాంతీయ పార్టీ, పైగా జగన్ ఇలాంటి విషయంలో కఠినంగా ఉంటారు. అన్నీ తెలిసినా కూడా బొత్స సత్యనారాయణ పాత అలవాటు మేరకు పక్క జిల్లా పార్టీ రాజకీయాల్లో వేలు పెట్టడం మాత్రం మానలేదు అంటున్నారు.

ఇబ్బందేనా….?

ఇక ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జిగా పార్టీ విజయసాయిరెడ్డిని నియమించింది. అయితే దీని మీద కూడా బొత్స సత్యనారాయణ వర్గం మొదటి నుంచి రగులుతూనే ఉంది. తాను సీనియర్ లీడర్ గా ఉండగా వేరే జిల్లాల నుంచి వచ్చిన వారికి బాధ్యతలు ఇవ్వడమేంటని బొత్స సత్యనారాయణ గుస్సా అవుతున్నారని టాక్. ఇవన్నీ ఇలా ఉంటే విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పార్టీలో వర్గ పోరు సాగుతోంది. ఈ నేపధ్యంలో బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా రాజకీయల్లో ఒక వర్గాన్ని పెంచిపోషిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన విజయనగరం జిల్లా రాజకీయాల్లో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలను తనవారిని చేసుకుని అక్కడ వర్గ పోరుకు కారణమవుతున్నారు. ఇపుడు విశాఖలో కూడా బొత్స వల్ల పార్టీలో విభేదాలు ముదిరితే మాత్రం బొత్సకు కూడా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరి చూడాలి బొత్స తన సీనియారిటీతో హై కమాండ్ కి కొత్త తలనొప్పులు తెస్తారా. సర్దుకుంటారా అన్నది.

Tags:    

Similar News