అన్నీ ఈయనకే కావాలట.. మరి మిగిలిన వారో?

ఉత్తరాంధ్ర జిల్లాలో కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మొత్తం 9 అసెంబ్లీ స్థానాల్లో నూ వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. 2014లో ఇక్కడ [more]

Update: 2020-07-14 02:00 GMT

ఉత్తరాంధ్ర జిల్లాలో కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మొత్తం 9 అసెంబ్లీ స్థానాల్లో నూ వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. 2014లో ఇక్కడ టీడీపీ వార్ వ‌న్‌సైడ్ చేసేసింది. అయితే ఐదేళ్లలో బొత్స సత్యనారాయణతో పాటు ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం రావ‌డంతో పాటుజిల్లాలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్రత్యేకంగా ఫోక‌స్ చేయ‌డంతో అన్ని 9 సీట్లతో పాటు విజ‌య‌న‌గ‌రం ఎంపీ సీటు కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. అయితే, ఇంత సాధించినా.. నేత‌ల మ‌ధ్య తీవ్ర అసంతృప్తి రేగుతోంది. దీనికి కార‌ణం ఏంటి ? ఎందుకు నేత‌ల మ‌ధ్య అసంతృప్తి ఉంది ? అనే విష‌యాలు కూడా చిత్రంగా ఉన్నాయి. జిల్లా నుంచి కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయ చ‌క్రం తిప్పుతున్నారు బొత్స స‌త్యనారాయ‌ణ‌. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పటికీ.. ఆయ‌న త‌న‌దైన రాజ‌కీయాలు చేస్తున్నారు. దీంతో జిల్లాలో అంతా బొత్స సత్యనారాయణ క‌నుస‌న్నల్లోనే సాగుతోంది.

ఆరు నియోజకవర్గాల్లో…..

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే.. ఒక్క రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు కురుపాం, సాలూరు, పార్వతీపురం తీసేస్తే.. ఆరింటిలో బొత్స సత్యనారాయణ బంధువులు లేదా అనుచ‌రులే ఉన్నారు. ఎంపీ బెల్లాని చంద్రశేఖ‌ర్‌కు బొత్స సత్యనారాయణకు బంధువే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, నెల్లిమ‌ర్ల నుంచి విజ‌యం సాధించిన బొడ్డుకొండ అప్పల‌నాయుడు.. ఏకంగా బొత్స మేన‌కోడ‌లు భ‌ర్త. అదే స‌మ‌యంలో గ‌జ‌ప‌తి న‌గ‌రం నుంచి విజ‌యం సాధించిన‌.. బొత్స అప్పల‌న‌ర్సయ్య స్వయానా బొత్సకు సోద‌రుడు. ఇక‌, ఎస్‌. కోట ఎమ్మెల్యే క‌డుబండి అప్పల‌నాయుడు కూడా బొత్స శిష్యుడే కావ‌డం గ‌మ‌నార్హం. చీపురుప‌ల్లి నుంచి బొత్స విజ‌యం సాధించారు. అంటే.. మొత్తంగా దాదాపు జిల్లాలో ఎటు చూసినా.. బొత్స సత్యనారాయణ వ‌ర్గమే క‌నిపిస్తోంది.

అన్నింటా వారే కావడంతో….

ఇక వీరంతా ఒక ఎత్తు అయితే జిల్లా రాజ‌కీయాల‌ను శాసించేది బొత్స సత్యనారాయణమ‌రో స‌మీప బంధువు అయిన మ‌జ్జి శీను. చిన్న శీనుగా పేరున్న ఈ శీను క‌నుస‌న్నల్లోనే జిల్లాలో రాజ‌కీయం చాలా వ‌ర‌కు న‌డుస్తుంది. దీనిని బ‌ట్టి బొత్స సత్యనారాయణను ఎదిరించే వారుకానీ, ఆయ‌న‌పై యాంటీగా మాట్లాడే వారు కానీ లేరు. ఒక్క జిల్లాలో విజ‌య‌న‌గ‌రం సిటీ ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి త‌ప్ప. అయిన‌ప్పటికీ.. నేత‌ల్లో ఎందుకు అసంతృప్తి ఉంది.. అనేది కీల‌క ప్రశ్న. దీనికి ప్రధాన కార‌ణం.. జిల్లా రాజ‌కీయాలు అన్నీ బొత్స బంధువులు, స‌న్నిహితుల‌ ఆధ్వరంలోనే న‌డుస్తుండ‌డం. మిగిలిన వారికి ప్రాధాన్యం లేక పోవ‌డం. పార్టీలో కానీ, నామినేటెడ్ ప‌ద‌వులు కానీ.. పార్టీలో సీనియ‌ర్లకు కాకుండా .. బొత్స సత్యనారాయణ అనుచ‌ర గ‌ణానికే ద‌క్కుతున్నాయి. దీంతో పార్టీలో సీనియ‌ర్లు తీవ్రస్థాయిలో మండి ప‌డుతున్నారు.

గతంలో కూడా….

నిజానికి 2014లో కాంగ్రెస్ త‌ర‌ఫున చీపురుప‌ల్లిలో పోటీ చేసి ఓడిపోయిన త‌ర్వాతే బొత్స సత్యనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, ఆయ‌న‌క‌న్నా ముందు నుంచి ఉన్న నాయ‌కులు పార్టీని ఇక్కడ నిల‌బెట్టారు. అయితే, వారికి ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యం ల‌భించ‌డం లేదు.అస‌లు వారి అడ్రస్ కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. గ‌తంలోనూ కాంగ్రెస్ హ‌యాంలో బొత్స సత్యనారాయణ ఇలా చేసే.. ఇక్కడ టీడీపీ పుంజుకునేందుకు అవ‌కాశం క‌ల్పించార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్పటికైనా అన్ని వ‌ర్గాల‌ను, అంద‌రినీ క‌లుపుకొని పోతారో లేదో చూడాలి.

Tags:    

Similar News