అజెండాయే వేరటగా

ఏ ముహూర్తాన విశాఖ రాజధాని అని జగన్ అన్నారో తెలియదు కానీ దాన్ని పట్టుకుని తనదైన రాజకీయానికి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పదును పెట్టేశారు. అస‌లే [more]

Update: 2020-01-04 15:30 GMT

ఏ ముహూర్తాన విశాఖ రాజధాని అని జగన్ అన్నారో తెలియదు కానీ దాన్ని పట్టుకుని తనదైన రాజకీయానికి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పదును పెట్టేశారు. అస‌లే ఆయన సీఎం క్యాండిడేట్ అని తనకు తానే భావించుకుంటారాయే. పైగా ఉమ్మడి ఏపీకి పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఓ దశలో బొత్స సత్యనారాయణ పేరు కూడా సీఎం రేసులో వినిపించింది. ఇక పవన్ లాంటి వారు మీరు ముఖ్యమంత్రి కావాల్సినవారు అంటూ సెటైరికల్ గానైనా అపుడపుడు రెచ్చగొడుతూంటారు. దాంతో బొత్స సత్యనారాయణ మదిలో తాను వైసీసీ సర్కార్ లో అందరి కంటే ఎక్కువేనన్న భావన బాగా ఉండిపోయిందన్న ప్రచారం ఉంది.

పదే పదే అదే…?

ఇక గత వారం పది రోజుల్లో విశాఖ రాజధాని అంటూ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేయని రోజు లేదు. జగన్ ఒకసారి అనేసిన తరువాత మౌనం వహించారు. విశాఖలో కొన్ని గంటల పాటు టూర్ చేసినా కూడా ఎక్కడా జగన్ విశాఖ రాజధానిపైన పెదవి విప్పలేదు. విధానపరమైన నిర్ణయం తీసుకున్నాకే ఏదైనా చెబితే బాగుంటుందన్నది జగన్ ఆలోచనగా ఉంది. కానీ ఈ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రతీ రోజూ రాజధాని పాటే పాడుతున్నారు. విశాఖకు రాజధాని వచ్చేసినట్లేనని కూడా ఆయన జనాల్లో ఆశలు రేకెత్తిస్తున్నారు.

తేడా వస్తే…?

నిజానికి ఒక మాట అనడం వేరు. అమలు జరగడం వేరు. మూడు రాజధానులు అంటూ జగన్ అసెంబ్లీలో చెప్పేసినంత తేలిక కాదు వ్యవహారం అన్నది గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా రాజధాని ప్రాంతంలోనే నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాలు, ప్రాంతాలు నాకు ముఖ్యం, ఈ విషయంలో తొందరేమీ లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినా కూడా బాధ్యత గ‌ల మంత్రిగా బొత్స సత్యనారాయణ సహనం పాటించి ఉండాలని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఒకవేళ ఇదే అంశంలో ఏమైనా తేడా వస్తే అపుడు ఈ ప్రాంతాలకు ప్రభుత్వ ఏ రకమైన జవాబు చెప్పుకుంటుంది అన్నది పార్టీ వారి ప్రశ్నగా ఉంది.

ఉప ప్రాంతీయమా?

జగన్ వ్యూహాలు ఏవన్నవి పక్కన పెడితే విశాఖ రాజధాని, ఉత్తరాంధ్ర అభివృధ్ది పేరు మీద ఉప ప్రాంతీయ నాయకునిగా మారిపోవడానికి బొత్స ఉబలాటపడుతున్నారా అన్న సందేహాలు పుట్టుకువస్తున్నాయి. బొత్స సత్యనారాయణ వంటి వారు రాజధాని అంశం లీడ్ తీసుకుని ముందుకు వెళ్తే ఉత్తరాంధ్రలో పట్టు చిక్కుతుందని అనుచరులు అనుకుంటున్నారుట. రేపటి రోజున వైసీపీలో విస్మరించలేని నేతగా ఎదుగేందుకు ఇదొక రాచబాటగా బొత్స సత్యనారాయణ చేసుకుంటున్నారా అన్న డౌట్లు మిగిలిన వారిలో కలుగుతున్నాయి. మరో వైపు రాయలసీమ నాయకులు, మంత్రులు సైతం అక్కడ హైకోర్టు విషయంలో ఇంతలా ఉత్సాహం చూపించడంలేదు. ఉత్తరాంధ్రాలో మిగిలిన మంత్రులు కూడా రాజధాని అంటూ రోజూ కలవరించడంలేదు. దీంతో బొత్స సత్యనారాయణ దూకుడు చూస్తూంటే వేరే అజెండా ఉందేమోనని డౌట్లు వస్తున్నాయిట.

Tags:    

Similar News