ఇంట్లో ఈగలున్నాయ్..?
ఇంట్లో ఈగల సంగతి మరిచిపోయి.. పొరుగింటిలో ఫినాయిల్ కొట్టడానికి వెళ్లారంట వెనకటికి వెవరో. కేంద్ర ప్రభుత్వానికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. తాజాగా ఒలింపిక్స్ సాగుతున్నాయి. మన [more]
ఇంట్లో ఈగల సంగతి మరిచిపోయి.. పొరుగింటిలో ఫినాయిల్ కొట్టడానికి వెళ్లారంట వెనకటికి వెవరో. కేంద్ర ప్రభుత్వానికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. తాజాగా ఒలింపిక్స్ సాగుతున్నాయి. మన [more]
ఇంట్లో ఈగల సంగతి మరిచిపోయి.. పొరుగింటిలో ఫినాయిల్ కొట్టడానికి వెళ్లారంట వెనకటికి వెవరో. కేంద్ర ప్రభుత్వానికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. తాజాగా ఒలింపిక్స్ సాగుతున్నాయి. మన క్రీడాకారులు ఎంతో కొంత ప్రతిభ చూపుతున్నారు. గతం కంటే మెరుగైన ప్రదర్శనతో స్ఫూర్తిని కనబరుస్తున్నారు. హాకీ వంటి క్రీడల్లో గత వైభవాన్ని గుర్తు చేశారు. ఆటలలో కనిపిస్తున్న పరిణతిని మరింత ముందుకు తీసుకెళ్లడం ఎలా? అన్న దిశలో నాయకత్వం ఆలోచన చేయాలి. కేంద్రప్రభుత్వం , రాష్ట్రాలు కలిసికట్టుగా ఒక నూతన దిశానిర్దేశానికి ప్రయత్నించాలి. దానిని పక్కనపెట్టి కొత్తరాజకీయానికి తెర తీసింది కేంద్రప్రభుత్వం. పేర్ల మార్పిడితోనే క్రీడాస్ఫూర్తిని నింపుతామంటోంది. సింబాలిక్ చర్యలతో రాజకీయ రగడను ప్రేరేపిస్తోంది. క్రీడలకు తాము ఎంతో చేస్తున్నామన్న కోణంలో ఒలింపిక్ ను కూడా వాడుకోవాలనుకుంటోంది. నిజానికి గడచిన రెండు ,మూడు సంవత్సరాలుగా ఆటలకు కేంద్రం ఇస్తున్న నిధులు తగ్గిపోతున్నాయి. ఒలింపిక్స్ వంటి ప్రపంచ ఘట్టం ఉందని తెలిసి కూడా గత ఆర్థిక సంవత్సరం నిధుల్లో కోత విధించింది. ఇటువంటి స్థితిలో తమ తప్పిదాలు బయటికి కనిపించకుండా మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది.
ఖేల్ మారడం వెనక…
దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ఆయన పేరును గతంలో పెట్టేసింది. రెండు మూడు దశాబ్దాలుగా దానిపై పెద్దగా వివాదం లేదు.1982 ఆసియాక్రీడల సందర్బంగా రాజీవ్ చాలా చురుకైన పాత్ర పోషించారు. ఆ ఆటలు భారత్ లో నిర్వహించడంలోనూ ఆయన పాత్ర తోసిపుచ్చలేం. దానిని గుర్తు చేసుకుని కాంగ్రెసు పెద్దలు ఆ నిర్ణయం తీసుకున్నారని బావించాలి. నిజానికి రాజీవ్ గాంధీ పరిపాలన రంగంలో అందించిన సేవలు చాలా ఎక్కువ. దేశంలో కంప్యూటరీకరణ, పిరాయింపుల నిరోధక చట్టం, పంచాయతీ, మునిసిపల్ సంస్థలకు నిధులు, విధులు కల్పించే రాజ్యాంగ సవరణల విషయంలో చాలా చర్యలు తీసుకున్నారు. అప్పట్లో చేసిన చట్టాలే నేటికీ ప్రామాణికంగా ఉన్నాయి. దేశ స్థితిగతులను మెరుగుపరచడానికి తనవంతు రాజీవ్ చేసిన కృషి మెచ్చదగినదే. ఏదో ఒక రూపంలో ఆయన సేవలను గుర్తు చేసే ఖేల్ రత్నను ఇప్పుడు కేంద్రం తొలగించింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న గా మార్పు చేసింది. ఇది మంచి పరిణామమా? చెడ్డదా ? అన్న చర్చ పక్కన పెట్టలేం. స్వర్గీయ నేతను అవమానించినట్లేనని బావనను కాంగ్రెసు వ్యక్తం చేస్తోంది. రాజీవ్ గాంధీ పేరును ఏదేని పథకానికి, లేదా అవార్డుకు పెడుతూ ఖేల్ రత్న నుంచి తొలగించి ఉంటే బాగుండేది. కానీ దేశానికి నాయకత్వం వహించిన నాయకుడి విషయంలో కంగారుపడటం కేంద్రం తొందరపాటు తనమే.
గురివింద గురుతులు…
ఏదేని పథకానికి , అవార్డుకు నాయకుల పేర్లు పెట్టడంపై ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సంక్షేమ పథకాలు, పరిపాలన అంశాలపై అవార్డులకు నాయకుల పేర్లు పెట్టడం సముచితం. కానీ క్రీడా ప్రాంగణాలు, కళలు, సాంస్కృతిక , సాహిత్య అంశాల్లో ఆయా రంగాల ప్రముఖులను గుర్తు చేసుకునేలా పేర్లు ఉండాలి. దానివల్ల ఆ రంగంలో కొత్తగా ముందుకు వచ్చే యువతరానికి స్ఫూర్తి కలుగుతుంది. ఖేల్ రత్న కు రాజీవ్ పేరు ఉండటం తగదని కేంద్రం భావించడం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. మరి గుజరాత్ లో క్రికెట్ స్టేడియానికి నరేంద్రమోడీ పేరు పెట్టుకోవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎదుటివారి తప్పులను సరిదిద్దేందుకు ప్రయత్నించేముందు తమ తప్పులనూ దిద్దుకోవడం అవసరం. లేకపోతే కేవలం రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అపప్రద మూటగట్టు కోవాల్సి వస్తుంది. పైపెచ్చు దేశానికి దిశానిర్దేశం చేసిన నాయకులు కేవలం ఒక పార్టీకి చెందిన వారుగా భావించలేం. వారి విషయంలో కొత్తతరాలు అధ్యయనం చేసి నేర్చుకోవాల్సిన అనేక అంశాలుంటాయి. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు దీనిని చూడాలి. పేరుల మార్పు కంటే ముందు ఆటలను ప్రోత్సహించడానికి తాము ఏమేమి చర్యలు తీసుకున్నారో ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇక ముందైనా నిధులు, శిక్షణ సదుపాయాలు పెంచాలి. తాజా ఒలింపిక్స్ ద్వారా దేశంలోని యువత ప్రపంచ క్రీడారంగంలో పోటీ పడేందుకు సన్నద్ధంగా ఉన్న విషయం తేటతెల్లమైంది. దీనిని అందిపుచ్చుకుని అవసరాలు తీర్చడం పరిపాలకుల బాధ్యత.
పొలిటికల్ మ్యూజికల్ ఛైర్…
అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు కేటాయించే నిధులు సొంత సొమ్ముగా భావిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు రకరకాల పేర్లు మారుస్తూ గందరగోళం స్పష్టించడంలో కేంద్ర, రాష్ట్రాలు రికార్డు తిరగరాస్తున్నాయి. ఆయా కాలాల్లో నాయకులు దేశానికి అందించిన సేవలను గుర్తు చేసేలా పథకాలకు పేర్లు పెట్టాలి. అప్పుడే సార్థకత ఉంటుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల పథకాలను చూస్తుంటే మరింత విడ్డూరంగా కనిపిస్తాయి. ఆరోగ్యశ్రీ పథకం పేరు చెబితే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. చౌక బియ్యం పథకానికి ట్రేడ్ మార్కు ఎన్టీయార్ దే. కానీ చంద్రబాబు నాయుడి హయాంలో అనేక పథకాలను సొంత పేర్లతో పిలుచుకున్నారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి హయాంలో మళ్లీ ఆ పేర్లన్నీ మాయమై కొత్త పేర్లు పుట్టుకుని వచ్చాయి. ప్రతి అయిదేళ్లకూ ప్రభుత్వాలు మారుతుంటాయి. ప్రతి సందర్భంలోనూ ఈ పేర్లపై కసరత్తు తప్పేలా లేదు. పరిపాలకుల ఖ్యాతిని చరిత్ర చెప్పుకోవాలి. చనిపోయిన తర్వాత వారిని తర్వాత తరాలు గుర్తుకు చేసుకోవాలి. తాము బతికుండగానే పథకాలకు పేర్లు పెట్టుకోవడం నాయకుల ఆత్మన్యూనతగా చూడాలి. గతంలో మాయావతి తన విగ్రహాలు తానే తయారు చేయించుకుని ప్రజల దృష్టిలో పలచనైపోయిన ఉదంతాన్ని నాయకులు గుర్తు చేసుకుంటే మంచిది.
-ఎడిటోరియల్ డెస్క్