అయినకాడికి అమ్మి పారేస్తే…?
ప్రభుత్వాలు శాశ్వత ఆస్తులను అమ్మి పక్కాగా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి. ఇందుకు రకరకాల పేర్లతో ప్రజలను ప్రలోభ పెట్టాలనుకుంటున్నాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం [more]
ప్రభుత్వాలు శాశ్వత ఆస్తులను అమ్మి పక్కాగా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి. ఇందుకు రకరకాల పేర్లతో ప్రజలను ప్రలోభ పెట్టాలనుకుంటున్నాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం [more]
ప్రభుత్వాలు శాశ్వత ఆస్తులను అమ్మి పక్కాగా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి. ఇందుకు రకరకాల పేర్లతో ప్రజలను ప్రలోభ పెట్టాలనుకుంటున్నాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అదే తంతు. ఈ విక్రయాల వ్యవహారం పతాకస్థాయికి చేరుకుంది. నగదీకరణ పేరుతో కేంద్రప్రభుత్వం ఆరులక్షల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతోంది. తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ కూడా అదే బాటలో ఉన్నాయి. ప్రజల నుంచి ఆందోళన చెలరేగకుండా సంక్షేమానికి ఈ నిధులను వినియోగిస్తామంటున్నాయి. ప్రభుత్వ స్థలాలు, సంస్థలను తెగనమ్మి డబ్బు పంచి పెట్టేయడం ద్వారా అధికారాన్ని స్థిరపరుచుకోవాలనేదే ఎత్తుగడ. ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తులు వాటికి ప్రభుత్వాలు ధర్మకర్తలు మాత్రమే. శాశ్వత యజమానులు ప్రజలే. అయితే అడిగేవారు లేకపోవడం సార్వభౌమత్వాన్ని ఆపాదించుకుంటున్న ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నాయి. భవిష్యత్తును అంధకారమయంగా మారుస్తున్నాయి.
కేంద్రానిది ఓ లెక్క…
ఎన్డీఏ సర్కారు చాలా తెలివిగా పావులు కదుపుతోంది. గతంలో ప్రభుత్వాలు పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను నెమ్మదిగా వదిలించుకుంటూ సొమ్ము చేసుకుంటుండేవి. ఏదేని కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే భూములు దొరకకపోతే , రాష్ట్రాల వాటా రూపంలో బాధ్యతను బదలాయిస్తూ తెలివిగా భారాన్ని తగ్గించుకునేవి. ఇప్పుడు మోడీ హయాంలో ఆకర్షణీయమైన పేర్లతో గత ప్రభుత్వాలను తలదన్నే పథకాలను రచిస్తోంది. జీవితబీమా వంటి సంస్థను నగదీకరించుకునే ఎత్తుగడ వేస్తోంది. దేశజనాభాలో దాదాపు సగం మందికి జీవన భరోసా ఇస్తున్న సంస్థను సైతం పణంగా పెట్టే సాహసానికి తెగిస్తోంది. రైల్వేలు, రహదారులు, పోర్టులు, మౌలిక వసతులు అన్నిటా కేంద్రం తన బాధ్యతను వదిలించుకుంటూనే నగదు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో రవాణా, మౌలిక వసతులు, జీవితబీమా వంటి రంగాలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ కోల్పోతుంది. ప్రజలపై విపరీతంగా భారం పడే అవకాశాలున్నాయి. ఈనిధులను ఏమేరకు సద్వినియోగం చేస్తారనేది ప్రశ్నార్థకమే. తాత్కాలికంగా ఏర్పడిన కరోనా వంటి విపత్తులను సాకుగా చూపి ప్రజలు వ్యతిరేకించలేని విధంగా నిస్సహాయం చేస్తున్నాయి.
టీఎస్ లో పక్కా…
ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. మొహమాటానికి పోకుండా సర్కారీ భూములను అమ్మేసి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని గట్టిగా చెబుతోంది. దళిత బంధు పథకానికి లక్ష కోట్ల రూపాయలవరకూ అవసరమవుతాయి. వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మునే వెచ్చిస్తామంటూ ఆర్థిక శాఖమంత్రి హరీశ్ రావు బహిరంగంగా ప్రకటించారు. బీసీలకు, ఆర్థికంగా వెనకబడిన ఇతరవర్గాలకు సైతం పేదల బంధును ఆచరణలోకి తెస్తామంటూ కేసీఆర్ కొ్త్తగా హామీని గుప్పించారు. దానికి కూడా ఇదే తరహా లో నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సాధారణ వార్సిక ఆదాయంలో సగం నిధులు ఉద్యోగుల జీతాలకు, పింఛన్లకు సరిపోతున్నాయి. సంక్షేమపద్దులో మిగిలిన నిధులను సరిపెట్టాల్సి వస్తోంది. కొత్త పథకాలకు డబ్బులు కావాలంటే ఆస్తులు అమ్మక తప్పదు. అందుకు సర్కారు సిద్దమవుతోంది. న్యాయపరంగా ఇంకా కొన్నిచిక్కులు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించి లక్షల రూపాయల్లో పేదలకు నగదును అందచేస్తామంటూ నమ్మబలుకుతోంది. యథేచ్ఛగా స్థలాల విక్రయాలు చేయకుండా న్యాయస్థానం ఆంక్షలు, షరతులు పెడుతోంది. అయితే ప్రజల్లో విశ్వాసం పెంచడానికి విస్తారంగా ఉన్న తనభూములే పథకాలకు పూచీకత్తుగా చూపిస్తోంది సర్కారు.
ఏపీలో ఇంకో లెక్క..
ఆంధ్రప్రదేశ్ లో నిధుల సమీకరణ మరింత క్లిష్టంగా కనిపిస్తోంది. కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల తరహాలో అపారంగా వనరులు అందుబాటులో లేవు. ఇప్పటికే కొన్ని పథకాలు, చెల్లింపుల నిమిత్తం సర్కారీ ఆస్తులను ప్రభుత్వం తనఖాలు పెట్టింది. విక్రయాలు చేసేందుకు భూములు పెద్ద ఎత్తున లేవు. తెలంగాణలో నిజాం పరిపాలన కారణంగా ప్రభుత్వానికి లక్షల ఎకరాలు దఖలయ్యాయి. ఉమ్మడి ప్రభుత్వ హయాంలో 2010 వ సంవత్సరం వరకూ వివిధ సంస్థలకు కేటాయింపులే తప్ప విక్రయాలు భారీగా చేయలేదు. తెలంగాణ భూములు విక్రయించడంపై టీఆర్ఎస్ ఆందోళనలు, ఉద్యమాలు చేయడంతో ఉమ్మడి పాలకులు ఒకింత సాహసించలేకపోయారు. భూముల విలువ బాగా పెరిగింది. ఇప్పుడు వాటి ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు ప్రయత్నిస్తోంది. విభజన తర్వాత నవ్యాంధ్రకు ప్రభుత్వ భూములు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అందులోనూ హైదరాబాద్ మాదిరిగా వేల కోట్ల రూపాయలలో ఆదాయమూ తెచ్చిపెట్టేవి కావు. ప్రభుత్వ రంగసంస్థల ఆస్తులు కూడా హైదరాబాద్ లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఇంకా పంపిణీ పూర్తి కాలేదు. ఈ కారణాల వల్ల కేంద్రానికి, దాయాది తెలంగాణకు ఉన్న వెసులుబాటు ఏపీకి దక్కడం లేదు. సంక్షేమపద్దులో భూములను అమ్మేయాలని భావిస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున నిధులు సమకూరే పరిస్థితులు కనిపించడం లేదు.
సార్వభౌమాధికారం ఎవరిది..?
అయిదేళ్ల కాలానికి అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు శాశ్వత ఆస్తులను కరిగించివేయడంపై మేధావుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వాలు తమకు లభించే పరిమిత కాలంలో భావితరాలకు అవసరమైన శాశ్వత ప్రగతికి పునాదులు వేయాలి. అంతే తప్ప అప్పుల ఊబిలో ముంచేయడం, తరతరాలుగా వస్తున్న భూమిని ప్రయివేటు వ్యక్తుల ధారాదత్తం చేయడం మంచిది కాదు. భారతదేశంలో సార్వభౌమాధికారం ప్రభుత్వాలది కాదు. పార్లమెంటుకు మాత్రమే అటువంటి అధికారం ఉంటుంది. భూ క్రయవిక్రయాలకు అనుమతులు పార్లమెంటు నుంచి పొందేలా కఠినతరమైన చట్టం రావాలి. రాష్ట్రప్రభుత్వాలకు భూములను లీజులకు ఇచ్చే అధికారం మాత్రమే ఉండాలి. అప్పుడే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలకు భూ వసతి అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు కనీస మార్పులు జరగకపోతే సంకుచిత లక్ష్యాలతో కూడిన ప్రభుత్వాలు శాశ్వత వనరులను కనుమరుగు చేసేస్తాయి.
-ఎడిటోరియల్ డెస్క్