నాలుగులో మిగిలేది ఏ ఒక్కటీ లేదా.. అంతర్మధనంలో బాబు

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పార్టీ టీడీపీ. అయితే, ఎక్కడో ఒక చోట నుంచి మ‌ళ్లీ పార్టీ పుంజుకునేలా చేయాల‌ని పార్టీ అధినేత‌గా చంద్రబాబు [more]

Update: 2020-09-06 03:30 GMT

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పార్టీ టీడీపీ. అయితే, ఎక్కడో ఒక చోట నుంచి మ‌ళ్లీ పార్టీ పుంజుకునేలా చేయాల‌ని పార్టీ అధినేత‌గా చంద్రబాబు సంక‌ల్పం. ఈ క్రమంలోనే ఆయ‌న జిల్లాల వారీగా స‌మీక్షల‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే రాయ‌ల‌సీమ జిల్లాల‌పై సీనియ‌ర్లతో మంత‌నాలు ప్రారంభించారు. ఇక్కడి నాలుగు జిల్లాల్లో .. రెండు జిల్లాల‌పై ఇప్పటికే చంద్రబాబు ఆశ‌లు వ‌దులుకున్నార‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో సీమ‌లోని నాలుగు జిల్లాల్లో క‌లిపి 8 ఎంపీ సీట్లు, 52 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్క ఎంపీ సీటూ గెల‌వ‌ని టీడీపీ, మొత్తంగా మూడే మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. అందులోనూ చంద్రబాబు, బాల‌య్యను వ‌దిలేస్తే ప‌య్యావుల కేశ‌వ్ ఒక్కడే ఉర‌వ‌కొండ‌లో గెలిచారు. మిగిలిన సీనియ‌ర్లు, జూనియ‌ర్లు క‌ట్టగ‌ట్టుకుని ఓడిపోయారు.

ఈ రెండు జిల్లాలపై…

ఇక చంద్రబాబుకు సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌పై ఎప్పుడో ఆయ‌న‌కు ఆశ‌లు, అంచ‌నాలు పోయాయి. ఇంకా చెప్పాలంటే 2004 నుంచే క‌డ‌పతో టీడీపీ బంధం పోయింది. 2009, 2014 ఎన్నికల్లో క‌నీసం ఒక సీటు అయినా టీడీపీ గెలిస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో అస‌లు పార్టీ ఖాతాయే తెర‌వ‌లేదు. క‌డ‌ప‌లో ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి బ‌ల‌మైన నేత‌లే లేని ప‌రిస్థితి. ఇక‌, క‌ర్నూలులో అంతో ఇంతో ప్రభావం ఉంటుంద‌ని అనుకున్నా.. సీనియ‌ర్లు ఎవ‌రూ పార్టీని న‌డిపించేందుకు ముందుకు రాలేని ప‌రిస్థితి. 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడే అక్కడ మూడు సీట్లు గెలిచిన టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో సున్నా చుట్టేసింది. క‌ర్నూలులో గ‌త ఎన్నిక‌ల్లో చాలా మంది వారి వారి వార‌సుల‌ను రంగంలోకి దింపారు. వీరంతా ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక్కడ క‌నుచూపు మేర‌లో కూడా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ పుంజుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. సో.. ఈ జిల్లాపై ఫిఫ్టీ ఫిఫ్టీ ఆశ‌లే పెట్టుకున్నారు.

అనంతలోనూ ఇంతే…

ఇక పార్టీకి గ‌త ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కంచుకోట‌గా అనంత‌పురంలో మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాలు కూడా పార్టీ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉన్న నాయ‌కులు కూడా తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. పైగా ఇంచార్జ్ పీఠాల కోసం, పార్టీ ప‌ద‌వుల కోసం కొట్టుకుంటున్నారు. జేసీ వంటి నేత‌లు కేసుల్లో ప‌డి కొట్టుమిట్టాడుతుంటే, ప‌రిటాల ఫ్యామిలీ ప్రజ‌ల్లోకే రాని ప‌రిస్థితి ఉంది. దీంతో అనంత‌పురంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులే చంద్బాబుకు క‌నిపిస్తున్నాయి. ఇక్కడ పార్టీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో బాల‌య్య ఎప్పుడూ నియోజ‌క‌వ‌ర్గానికే రారు.. ఇక ఉర‌వ‌కొండ‌లో కేశ‌వ్ ఉన్నా ఆయ‌న ఇటీవ‌ల పూర్తిగా సైలెంట్ అవ్వడం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది.

సొంత జిల్లాలోనూ…

ఇక‌, త‌న సొంత జిల్లా చిత్తూరులో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జులు క‌నిపించ‌డం లేదు. ఉన్నవారు కూడా సైలెంట్ అయ్యారు. మ‌రికొంద‌రు కాడి ప‌డేశారు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో చంద్రబాబు త‌ప్ప అంద‌రూ చిత్తుగా ఓడిపోయారు. కొత్త నేత‌ల‌కు పార్టీ ఇన్‌చార్జ్‌లు ప‌గ్గాలు ఇచ్చినా.. మ‌రి కొంద‌రికి ఇస్తామ‌ని చెప్పినా కూడా ఎవ్వరూ ముందుకు రావ‌డం లేద‌ట‌. ఈ ప‌రిణామాల‌ను విశ్లేషించుకున్న చంద్రబాబు అనంత‌పురం పై దృష్టి పెట్టి ఆ ఒక్క ‌జిల్లాలో అయినా పార్టీని పూర్తిస్థాయిలో ఎదిగేలా ప్రణాళిక‌లు సిద్ధం చేసుకోవాల‌ని నాయ‌కుల‌కు సూచించిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, చిత్తూరులో ప్రస్తుత‌మున్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను కాపాడాకుంటూనే త‌మ‌కు ప్రాధాన్యం లేని చోట్ల ఎద‌గాల‌ని నిర్ణయించుకున్నార‌ట‌. క‌డ‌ప‌, క‌ర్నూలులో ఇప్పట్లో చేయ‌డానికేం లేద‌ని కూడా పార్టీ ముఖ్యుల‌తో అన్నట్టు టాక్‌..?

Tags:    

Similar News