జగన్ కి బాబు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్నారా …?

చంద్రబాబు నాయుడు రాజకీయాలు మాములుగా ఉండవు. అందుకే ఎన్ని విపత్కర పరిణామాలు ఎదురైనా ధీటుగా వాటిని ఎదుర్కొని కిందపడినా పైకి లేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆ [more]

Update: 2020-09-16 14:30 GMT

చంద్రబాబు నాయుడు రాజకీయాలు మాములుగా ఉండవు. అందుకే ఎన్ని విపత్కర పరిణామాలు ఎదురైనా ధీటుగా వాటిని ఎదుర్కొని కిందపడినా పైకి లేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికల్లో చవిచూసిన ఓటమితో పసుపు కోట కుప్పకూలింది. వచ్చే ఎన్నికల నాటికి కూలిపోయిన కోటను నిర్మించుకోవాలి అంటే ఇప్పటి నుంచి శ్రమించక తప్పదని చంద్రబాబు లెక్కలు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటినుంచి వ్యూహాత్మక అడుగులు వేసేందుకు పార్టీలో ఉన్న సంప్రదాయాలను ఆయన పక్కన పెట్టేందుకు సైతం సిద్ధం అయిపోయారు. ముల్లును ముల్లు తో తీయాలి. వజ్రాన్ని వజ్రంతో కోయాలని టిడిపి అధినేత వైసిపి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం మెంబర్ తో డీల్ కుదుర్చుకుని రంగంలోకి దింపారని తెలుస్తుంది.

వైసిపి మోడల్ లోనే దెబ్బ కొట్టాలి…

గత ఎన్నికల్లో వైసిపి తమ పార్టీ వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి అధికారికంగానే దింపింది. ఈ వ్యవహారంపై టిడిపి వెక్కిరించింది. కానీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాకా పికె వ్యూహాలు వైసిపి కి అఖండ విజయాన్ని, టిడిపి కి చారిత్రిక పరాజయాన్ని మూటకట్టి ఇచ్చింది. దీన్ని గమనించే ఎన్నికలకు మూడున్నరేళ్లు ఉండగానే వ్యూహకర్త తోనే ముందుకు వెళ్లాలని అధినేత చంద్రబాబు భావించారని తెలుస్తుంది. పికె టీం లో గతంలో కీలక పాత్ర పోషించిన రాబిన్ శర్మ తో ఒప్పందం రహస్యంగా కుదుర్చుకుని పని మొదలు పెట్టిన వ్యవహారం ఇప్పుడు చర్చనీయంగా మారింది. వైసిపి ని నాడు అవహేళన చేసి ఇప్పుడు అధికారం కోసం ఇలా పచ్చ పార్టీ చేస్తుందంటూ ఎద్దేవా చేస్తున్నారు కొందరు.

టిడిపి కి వ్యూహకర్తలు అవసరమా … ?

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం దశాబ్దాలుగా సాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తలు అవసరం లేదు. ఆ పార్టీలో ఢక్కా మొక్కీలు తిన్న అనేకమంది వ్యూహకర్తలు ఉన్నారు. వారి వ్యూహాలకు మద్దత్తుగా నిలిచే పెద్ద మీడియా వ్యవస్థ ఉంది. వీరందరూ ఉండగా కొత్తగా వైసిపి ఫార్ములా అనుసరించడం అనవసరం అనే చర్చా టిడిపి లో మొదలైంది. అయితే వైసిపి ని తక్కువ అంచనా వేసే అతి విశ్వాసంతో గత ఎన్నికల్లో ఖంగు తిన్నామని ఈసారి ఆ పరిస్థితి తలెత్తితే పార్టీనే గల్లంతు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధినేత చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు.

అధ్యయనం చేయడానికి…..

వైసిపి ఆంధ్రప్రదేశ్ లో పాతుకుపోయిన తీరు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిడిపి నేతలకు ఫ్యాన్ పార్టీ తీర్ధం పోసేయడం గమనించాక క్షేత్ర స్థాయిలో పార్టీ స్థితి గతులను అధ్యయనం చేయడానికి నిపుణుల టీం సైకిల్ పార్టీకి తప్పలేదు. క్షేత్ర స్థాయిలో ద్వితీయ, తృతీయ స్థాయిలో టిడిపి ఇప్పటికి బలంగానే ఉన్నప్పటికీ అగ్ర నేతలు అనేక నియోజకవర్గాల్లో అధికారపార్టీలోకి వెళ్లిపోవడంతో వాస్తవ స్థితిగతులు అధినేత చంద్రబాబుకు అవసరం అయ్యింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలకు చంద్రబాబు ఇప్పటినుంచి అన్ని శక్తులను కూడగట్టుకునేందుకు స్ట్రాటజీ టీం కి పార్టీని అప్పగించారని విశ్లేషకుల అంచనా. మరి రాబోయే రోజుల్లో బాబు వ్యూహాల వెనుక రాబిన్ శర్మ టీం ఆలోచనలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Tags:    

Similar News