చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారా..?

నాలుగేళ్లు ప్రధాని నరేంద్ర మోడీతో, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు నెలల క్రితం బీజేపీకి దూరం జరిగారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం [more]

Update: 2019-03-02 05:00 GMT

నాలుగేళ్లు ప్రధాని నరేంద్ర మోడీతో, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు నెలల క్రితం బీజేపీకి దూరం జరిగారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందనే వాదనతో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చాక బీజేపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపైన కూడా ఆయన మండిపడుతున్నారు. బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని, రాష్ట్రంపై కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటువంటి బేదాభ్రిప్రాయాలు రావడం ఇప్పుడే కొత్తేమీ కాదు. కానీ, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవలంభిస్తున్న తీరు మాత్రం విభిన్నంగా ఉంది. మోడీతో ఎన్ని వివాదాలు ఉన్నా ప్రధానమంత్రిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కానీ, చంద్రబాబు మాత్రం మోడీతో వ్యక్తిగత వైరానికి పోతున్నట్లు కనిపిస్తోంది. ప్రతీరోజూ ఆయనను విమర్శిస్తున్నారు. సరే, రాజకీయంగా మోడీని విమర్శించడం చంద్రబాబుకు అవసరం కావచ్చు. కానీ, ఏకంగా ప్రధాని రాకకు నిరసనగా హోర్డింగులు వేయించడం, కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇవ్వడం విచిత్రంగా ఉంది.

ప్రభుత్వ ఖర్చుతో నిరసనలా..?

రాష్ట్ర విభజన తర్వాత నవ నిర్మాణ దీక్షలు నిర్వహించి కాంగ్రెస్ ను తిట్టారు చంద్రబాబు. ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా ధర్మపోరాట దీక్షలు నిర్వహించి ఆయననను తిడుతున్నారు. అయితే, టీడీపీ తరపున ఈ సభలు పెడితే తప్పులేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సభలు నిర్వహించారు. ఈ సభల ఖర్చంతా రాష్ట్ర ఖజానా నుంచే పెట్టారు. ఇక, నిన్న మోడీ విశాఖపట్నానికి వస్తున్నందున చంద్రబాబు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు వ్యాఖ్యలకు ఎలాగూ మీడియా కవరేజీ బాగుంటుంది. అయినా అన్ని ఇంగ్లీషు, తెలుగు పత్రికల్లో మోడీకి వ్యతిరేకంగా, రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని ప్రకటనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ ప్రకటనలు ఇచ్చినందున డబ్బులు కూడా రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు చేస్తారు. అయితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెబుతూ బీజేపీ కూడా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. కానీ అవి పార్టీ తరపున ఇచ్చిన ప్రకటనలు, పార్టీనే డబ్బులు చెల్లిస్తుంది.

మోసం చేసే అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ కదా..!

మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు నిరసనలు చేయడం తప్పుకాదు కానీ ఆయన మోడీతో వ్యక్తిగత వైరం పెట్టుకుంటున్నారు. సరే, మోడీని, బీజేపీని వ్యతిరేకిస్తున్న ఆయన కాంగ్రెస్ తో కలిశారు. అసలు పార్లమెంటు తలపులు మూసేసి మరీ రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీనే కదా. ఇవాళ బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందనే వాదన నిజమే అయితే ఇలా అన్యాయం చేసేందుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ కదా. ఈ విషయాన్ని చంద్రబాబు ఎలా మరిచిపోతున్నారు. మోడీకి వ్యతిరేకంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన చంద్రబాబు… విభజన చట్టాన్ని రూపొందించిన, విభజనలో కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి మొదట అన్యాయం చేసిన జైరాం రమేష్, గులాం నబీ ఆజాద్ వంటి వారిని కౌగిలించుకుంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ తో ఆయన అవగాహనకు వచ్చారు. రాష్ట్రంలో పొత్తు లేకుండా అంతర్గతంగా అవగాహన ఉందనే ప్రచారం జరుగుతోంది.

మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?

గత ఎన్నికలకు ముందు బీజేపీని చంద్రబాబు ఎలా నమ్మారో ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ ను కూడా అలానే నమ్ముతున్నారు. ఒకవేళ రేపు నిజంగా కాంగ్రెస్ గనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇప్పుడు బీజేపీ చేసినట్లుగా కాంగ్రెస్ మోసం చేయదని గ్యారెంటీ ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇలా కాకుండా మళ్లీ బీజేపీనే అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో చంద్రబాబు వస్తే మోడీతో పెట్టుకుంటున్న ఈ వ్యక్తిగత వైరం వల్ల రాష్ట్ర సమస్యలపై మోడీని చంద్రబాబు కలవగలరా? నలభై ఏళ్ల అనుభవం, రాజకీయ చతురత, ముందుచూపు ఉన్న చంద్రబాబు చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారా అనే విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News