గత్యంతరం లేదప్పా…?

కర్ణాటకలో ఇప్పుడు ఉప ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. పదిహేడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. అంతా అనుకూలిస్తే వచ్చే నెలలోనే నోటిఫికేషన్ [more]

Update: 2019-09-14 16:30 GMT

కర్ణాటకలో ఇప్పుడు ఉప ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. పదిహేడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. అంతా అనుకూలిస్తే వచ్చే నెలలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ప్రస్తుతమున్న బలాబలాల నేపథ్యంలో కర్ణాటకలోని అన్ని పార్టీలకూ ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. సుప్రీంకోర్టు తీర్పు మేరకు నోటిఫికేషన్ ఎప్పుడైనా ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశముంది. మెజారిటీ సంఖ్యకు కూత వేటు దూరంలో ఉన్న కాంగ్రెస్ , బీజేపీలు ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతాయని వేరే చెప్పవలసిన అవసరం లేదు.

కాంగ్రెస్ చితికిపోయి…..

భారతీయ జనతా పార్టీ కర్ణాటకలోనూ, అటు కేంద్రంలోనూ అధికారంలో ఉంది. అంగ, అర్థ బలాలతో ఫుల్ జోష్ మీద ఉంది. అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. సొంత పార్టీ నేతలే వెన్ను పోటు పొడిచి వెళ్లిపోవడంతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ ఆర్థికంగా చితికిపోయి ఉంది. మరోవైపు కీలక నేతలపై కేసులు నమోదవుతున్నాయి. డీకే శివకుమార్ వంటి నేతలు ఈడీ కేసుల్లో ఇరుక్కుని జైలులో ఉన్నారు. దీనికి తోడు పార్టీలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది.

నేతల మధ్య విభేదాలు….

ముఖ్యంగా కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య మైత్రి రాష్ట్రంలో చెడిందనే చెప్పాలి. సంకీర్ణ సర్కార్ కర్ణాటకలో కుప్పకూలిపోవడానికి సిద్ధరామయ్య కారణమంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ సంచలన ప్రకటన చేశారు. కుమారస్వామి కూడా కూలిపోయిన పాపాన్ని మొత్తాన్ని సిద్ధరామయ్య మీదకే నెట్టేశారు. ఇక సిద్ధరామయ్య మాత్రం ఊరుకుంటాడా? తండ్రీ కొడుకులిద్దరినీ చెడుగుడు ఆడేశారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ లు ఇక కలవవని అందరూ భావించారు. కానీ ఉప ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరుగా జరుగుతుండటంతో కాంగ్రెస్, జేడీఎస్ లు కర్ణాటక లో జరగనున్న ఉప ఎన్నికల్లో కలసి పోటీ చేసే అవకాశముంది.

బీజేపీకి లాభమని….

కాంగ్రెస్ పార్టీ లాగానే కర్ణాటకలో జనతాదళ్ ఎస్ కూడా ఇబ్బంది పడుతోంది. కుమారస్వామిపై కేసులు నమోదయి ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకుంది. అలాగే ఉప ఎన్నికలు జరిగే 17 స్థానాల్లో మూడు జేడీఎస్ సిట్టింగ్ స్థానాలు. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి లాభమని దేవెగౌడ, కుమారస్వామి అంచనా వేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు గతంలో గెలిచిన స్థానాలను తమకు ఇవ్వాలని జేడీఎస్ కోరే అవకాశముంది. మొత్తం మీద రెండు పార్టీలు కలసి పోటీచేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News