కాంగ్రెస్ కు మళ్లీ ఊపిరి పోస్తాయా?

కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికలపై కాంగ్రెస్ భారీగానే ఆశలు పెట్టుకుంది. బెళగావి లోక్ సభ నియోజకవర్గంతో పాటు మస్కి, బసవ కల్యాణ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో కాంగ్రెస్ [more]

Update: 2021-04-23 18:29 GMT

కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికలపై కాంగ్రెస్ భారీగానే ఆశలు పెట్టుకుంది. బెళగావి లోక్ సభ నియోజకవర్గంతో పాటు మస్కి, బసవ కల్యాణ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని భావిస్తున్నారు. యడ్యూరప్ప ప్రభుత్వంపై వ్యతిరేకత, బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు తమ గెలుపునకు కారణమవుతాయని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. ఈ ఉప ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్ గా కాంగ్రెస్ భావిస్తుంది.

ప్రభుత్వంపై వ్యతిరేకత…..

యడ్యూరప్ప ప్రభుత్వం పై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. కరోనా కేసులు పెరిగిపోతుండటం, అభివృద్ధి సక్రమంగా జరగకపోవడం వంటి అంశాలు ఉప ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. ఇక బీజేపీలో యడ్యూరప్పను వ్యతిరేకిస్తున్న నేతలు ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడానికి బాగానే కృషి చేశారంటున్నారు. మే 2న ఫలితాల తర్వాత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలంటే ఈ ఉప ఎన్నికలలో ఓటమి పాలవ్వాలని ఆయన వ్యతిరేక వర్గం గట్టిగా కోరుకుంటుంది.

బీజేపీలో అసంతృప్తి…..

ిఇక ప్రజల్లోనూ బీజేపీలో చెలరేగిన అసంతృప్తి చికాకును తెప్పిస్తుంది. రాసలీలల వీడియో కూడా ఈ ఉప ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ఎటు చూసుకున్నా కాంగ్రెస్ కు ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయమున్నా యడ్యూరప్ప ప్రభుత్వంపై వ్యతిరేకతను ఇప్పటి నుంచే సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా….

అందుకే ఉప ఎన్నికల ప్రచారాన్ని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందరూ ఒకతాటి పైకి వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ నేతలు సమన్వయంతో పనిచేశారు. జరిగేవి మూడు ఉప ఎన్నికలయినప్పటికీ దీని ప్రభావం కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ పై ఆధారపడి ఉంటుందంటున్నారు. అధికారంలో ఉన్న తమను దొడ్డిదారిన తొలగించి ముఖ్యమంత్రి అయిన యడ్యూరప్పకు ఈ ఉప ఎన్నికలు గుణపాఠం చెప్పక తప్పదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News