ఈ యూనివర్సిటీలో చదివితే సీఎం అయినట్లే?
అసోంలోని కాటన్ యూనివర్సిటీ అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. రాష్ర్టంతోపాటు జాతీయంగానూ దీని ప్రతిష్ట విస్తరించింది. ఇక్కడ విద్య అభ్యసించిన అనేకమంది ప్రముఖులు అత్యున్నత స్థానాలను చేరుకుని వర్సిటీ [more]
అసోంలోని కాటన్ యూనివర్సిటీ అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. రాష్ర్టంతోపాటు జాతీయంగానూ దీని ప్రతిష్ట విస్తరించింది. ఇక్కడ విద్య అభ్యసించిన అనేకమంది ప్రముఖులు అత్యున్నత స్థానాలను చేరుకుని వర్సిటీ [more]
అసోంలోని కాటన్ యూనివర్సిటీ అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. రాష్ర్టంతోపాటు జాతీయంగానూ దీని ప్రతిష్ట విస్తరించింది. ఇక్కడ విద్య అభ్యసించిన అనేకమంది ప్రముఖులు అత్యున్నత స్థానాలను చేరుకుని వర్సిటీ పేరు ప్రఖ్యాతులను దశదిశలా విస్తరింపజేశారు. ఈ వర్సిటీ విద్యార్థులు ముఖ్యమంత్రులయ్యారు. గవర్నర్ వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. దేశ ప్రధాన న్యాయమూర్తులయ్యారు. కాటన్ వర్సిటీలో చదివిన వారిలో కవులు, గాయకులు, కళాకారులు, రచయితలు ఉండటం విశేషం. దీన్నిబట్టి వర్సిటీ ప్రతిష్టను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చదివిన ఎనిమిది మంది విద్యార్థులు అనంతర కాలంలో అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి పదవులు చేపట్టి వర్సిటీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు.
పదిహేను మందిని…?
ఈశాన్య భారతంలో అతి పెద్దదైన ఈ రాష్రానికి ఇప్పటివరకు 15 మంది ముఖ్యమంత్రులుగా పనిచేయగా వారిలో 8మంది కాటన్ యూనివర్సిటీ విద్యార్థులే కావడం విశేషం. దీనినిబట్టి వర్సిటీ ప్రాధాన్యాన్నిఅర్థం చేసుకోవచ్చు. పదిహేనో ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన హిమంత బిశ్వ శర్మ ఈ వర్సిటీ విద్యార్థే కావడం గమనార్హం. శర్మ 1990లో గ్రాడ్యుయేషన్, ఆ తరవాత 1992లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పొలిటికల్ సైన్స్ లో ఆయన పీజీ చేశారు. విద్యార్థిగా ఉన్న సమయంలో వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లోనే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. ఆ లక్షణాలే ఆ తరవాత ఆయన రాజకీయాల్లో రాణించడానికి దోహదపడ్డాయి.
స్వతంత్రానికి పూర్వ నుంచే…?
స్వతంత్రానికి పూర్వం అసోంలో బ్రిటీష్ పాలకుల ప్రతినిధిగా పనిచేసిన సయ్యద్ మహమ్మద్ సాదుల్లా కూడా ఈ వర్సిటీ విద్యార్థే . స్వతంత్ర భారతంలో రాష్ర్ట తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బోర్డోలోయి కాటన్ వర్సిటీలోనే ఓనమాలు నేర్చుకున్నారు. ఆయన 1950 జనవరి 26 నుంచి అదే ఏడాది ఆగస్టు వరకు సీఎంగా పనిచేశారు. తరవాతి రోజుల్లో మహేంద్ర మోహన చౌదరి 1970 నవంబరు నుంచి 1972 జనవరి 30 వరకు సీఎంగా చక్రం తిప్పారు. అనంతరం 1972 జనవరి 31 నుంచి 1978మార్చి 12వరకు ముఖ్యమంత్రిగా పాలన సాగించిన శరత్ చంద్ర సిన్హా… ఇద్దరూ కాటన్ వర్సిటీ విద్యార్థులే కావడం విశేషం. 1979 సెప్టెంబరు9 నుంచి అదే ఏడాది డిసెంబరు 11 వరకు సీఎంగా కొనసాగిన జోగేంద్రనాథ్ హజారికా, 1980 డిసెంబరు 6 నుంచి 1981 జూన్ 30 వరకు రాష్ర్ట సారథిగా చక్రం తిప్పిన అన్వార్ తైమూర్ కాటన్ వర్సిటీలోనే విద్యాభ్యాసం చేశారు. సీఎం పగ్గాలు చేపట్టిన తొలి మహిళ, అందునా మైనార్టీ మహిళ అన్వార్ తైమూర్. 1983 ఫిబ్రవరి నుంచి 1985 డిసెంబరు వరకు రాష్ర్ట ముఖ్యమంత్రిగా పనిచేసిన హితేశ్వర్ సైకియా, 1996 ఏప్రిల్ 22 నుంచి దాదాపు నెల పాటు సీఎంగా పనిచేసిన భూమిందర్ బర్మన్ సైతం కాటన్ వర్సిటీ విద్యార్థే. వీరిలో ఒక్క హజారికా తప్ప మిగిలిన ముఖ్యమంత్రులంతా కాంగ్రెస్ పార్టీ వారే. హజారికా జనతా పార్టీకి చెందిన వారు.
అత్యున్నత విద్యాప్రమాణాలకు…?
ప్రస్తుత సీఎం శర్మ కూడా ఒకప్పటి కాంగ్రెస్ వాదే. రాష్టాన్ని వరుసగా పదిహేనేళ్ల పాటు పాలించిన పద్మ భూషణ్ అవార్డు గ్రహీత దివంగత కాంగ్రెస్ సీఎం తరుణ్ గొగోయ్ కు శర్మ కుడిభుజంగా పనిచేశారు. తర్వాత ఆయనతో రాజకీయంగా విభేదించి భాజపాలో చేరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్ గొగోయ్, నాగాలాండ్ మాజీ సీఎం పి.శీలు, ప్రముఖ గాయకుడు, రచయిత, చిత్ర నిర్మాత భూపేన్ హజారికా, మాజీ గవర్నర్లు దేబ్ కాంత్ కొన్వర్, జ్యోతి ప్రసాద్ రాజ్ ఖోవా సైతం కాటన్ వర్సిటీ విద్యార్థులే కావడం గమనార్హం. 1901లో నాటి బ్రిటీష్ పాలకుడు హెన్రీ జాన్ స్టెడ్ మన్ కాటన్ తన పేరుతో గౌహతీలో కళాశాలను ప్రారంభించారు. అప్పట్లో కోల్ కతా వర్సిటీకి ఇది అనుబంధంగా ఉండేది. అసోంలోనే కాక ఈశాన్య భారతంలో ఈ కళాశాల పురాతనమైనది, అత్యంత ప్రతిష్టాత్మకమైనది. కాలక్రమంలో కళాశాల 2011లో వర్సిటీగా రూపాంతరం చెందింది. ఇప్పుడు కాటన్ వర్సిటీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఈశాన్య భాారతంలో అత్యున్నత విద్యా ప్రమాణాలకు వేదిగా సగర్వంగా నిలుస్తోంది.
– ఎడిటోరియల్ డెస్క్